సింహవాహనంపై ఊరేగిన మలయప్పస్వామి
- 81 Views
- wadminw
- October 5, 2016
- రాష్ట్రీయం
తిరుపతి, అక్టోబబర్ 5 (న్యూస్‌టైమ్): తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బుధవారం శ్రీమలయప్పస్వామితిరువీధుల్లో సింహవాహనంపై వూరేగుతూ భక్తులను కటాక్షించారు. యోగ శాస్త్రంలో సింహం, వహన శక్తికి, శీఘ్ర గమన శక్తికి ఆదర్శం. విష్ణుసహస్ర నామాల్లో స్వామికి నామాంతరంగా సింహఃస్తోత్రం ఉంది. స్వామివారి వాహనసేవకు ముందు భజన బృందాల కోలాటాలు, కళారూపాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన యాత్రికులతో తిరువీధులు జనసంద్రంగా మారాయి. ఉదయం 9 నుండి 11 గంటల వరకు వాహన సేవ నిర్వహించారు. వాహనం ముందు భాగాన అశ్వ, గజ, వృషభాలు ముందు నడుస్తుండగా వేద పండితుల మంత్రోచరణలు, కేరళ వాయిద్దాల మధ్య భక్తులు కోవిందనామస్మరణ చేస్తుండగా స్వామివారి ఊరేగింపు నిర్వహించారు.
మధ్య మధ్యలో మహిళలు స్వామివారికి హారతులను అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావు, జేఈవోలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్, అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు, ఆలయ ముఖ్య భద్రతాధికారి శ్రీనివాసరావు, తిరుపతి అర్బన్ ఎస్సీ జలయక్ష్మీ, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. అంతకముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆయన స్వామివారికి నైవేద్య విరామ సమయంలో అధికారులు దర్శనం కల్పించారు. మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకోగానే జేఈవో శ్రీనివాసరాజు, టక్కర్‌కు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం బస కల్పించారు. మంగళవారం రాత్రి హంస వాహనంపై ఊరేగుతున్న శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారిని టక్కర్ దర్శించి వాహన సేవలో పాల్గొన్నారు. బుధవారం స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగానాయక మండపంలో ఆయన కుటుంబ సభ్యులకు వేద పండితులు ఆశీర్వదించారు. బ్రహ్మోత్సవాలు ఎంతో కార్యక్రమాలు ఎంతో సంతృప్తిని కలిగించాయని టక్కర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు, తదితరులు పాల్గొన్నారు. ఇదిలాువండగా, సప్తగిరీశుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన బుధవారం మధ్యాహ్నం శ్రీమలయప్పస్వామివారికి స్నపన తిరుమంజన వేడుకను కన్నుల పండువగా అర్చకులు నిర్వహించారు. ఆలయ ప్రాకారంలోని రంగనాయకుల మండపంలో మొదటి విడతగా నిర్వహించే ఈ క్రతువును ఆగమ శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. మూలవిరాట్టుకు ప్రతి శుక్రవారం స్నానాసనం (అభిషేక సేవ) నిర్వహిస్తారు. మూలవిరాట్టు పాదాల చెంత ఉండే స్వామి ప్రతిరూపం భోగ శ్రీనివాసునికి ఆకాశగంగ జలతీర్థంతో అనునిత్యం అభిషేకిస్తారు. తిరుమంజనం అనేది ప్రత్యేక సమయాలలో ఉత్సవమూర్తి శుద్ధి కోసం వైభోగంగా చేయించే స్నానం. ఈ ఉత్సవం కన్నుల పండువగా ఉంటుంది.
ఈ విడత బ్రహ్మోత్సవాల్లో మూడు రోజులు స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. పాలు, పెరుగు, జలం, తేనె, కొబ్బరి నీళ్లతో స్వామిని అభిషేకించారు. అనంతరం చందనంతో తిలకం దిద్దారు. లక్ష్మీవల్లభుని పూజాదికాలలో ఎంతో ప్రాధాన్యం ఉన్న తులసిమాలలతో స్వామిని, ఉభయ నాంచారులను అలంకరించారు. మళ్లీ పళ్లెం పెట్టి అందులోని రంధ్రాల నుంచి స్వామికి సహస్రధారాభిషేకం కార్యక్రమం వరకు ఆద్యంతం కన్నుల పండువగా సాగింది. శ్రీనివాసునికి వూంజలసేవ సాయంసందెవేళ కన్నుల పండువగా జరిగింది. స్నపన తిరుమంజనం అనంతరం మందిరంలోని రంగనాయకుల మండపంలో ఉభయనాంచారీ సమేత శ్రీమలయప్ప స్వామివారికి విశేష తిరువాభరణాల అలంకరణ జరిగింది. ఆ తర్వాత వూరేగింపుగా వూంజల్ మండపం వద్దకు వేంచేశారు.
ద్వాపరయుగం నాటి లీలలను జ్ఞప్తికి తెస్తూ స్వామివారు ప్రతినిత్యం రోజుకో అలంకారంతో వూంజల్ మండపం వద్దకు చేరుకుంటారు. మండపంలో వూంజల్‌సేవ కూడా కన్నుల పండువగా ఉంటుంది. స్వామివారి దర్శనార్థం ఇక్కడ వేచి ఉండే వేలాది మంది భక్తులకు ఆయన అభయప్రదానం చేశారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మండపంలో నేతి దీపపు కాంతిలో శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీమలయప్పస్వామివారికి ఉయ్యాల సేవను నిర్వహించారు. మరోవైపు, భక్తుల పాలిట కొంగు బంగారమై వరాలు ప్రసాదించే శ్రీనివాసునికి నిత్యం అలంకరణలు ఎన్నో. వజ్ర వైడూర్యాలతోనే కాదు, ఎండు ఫలాలతోను అలంకరిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి జరిగే స్నపన తిరుమంజన సమయంలో అలంకరించడానికి ఎండు ఫలాలు, వట్టివేరులు, ముత్యాలతో కిరీటాలు చేసి అలంకరిస్తున్నారు. దేశ విదేశాల నుంచి తీసుకొచ్చిన ఫలాలను అలంకరణతో పాటు నైవేద్యంగా సమర్పిస్తున్నారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలో స్నపన తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. స్నపన తిరుమంజనం సమయంలో రంగనాయకుల మండపాన్ని తితిదే ఉద్యానవనశాఖ ప్రత్యేకంగా అలంకరిస్తోంది. ఈ దఫా మండపం అలంకరణకు 20 వేల యాపిల్ పండ్లు, ఐదు వేలు బత్తాయి, దానిమ్మ పండ్లతో అలంకరించింది. స్నపన తిరుమంజనం సమయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామికి వివిధ రకాల ఎండు ఫలాలైన నల్లదాక్ష, ఎండు ద్రాక్ష, యాలకులు, వట్టివేర్లు, బాదం పప్పులు, ముత్యాలతో తయారు చేసిన కిరీటాలను వినియోగిస్తున్నారు. తిరుమంజనం సమయంలో స్వామివారికి అలంకరించిన కిరీటాలు అద్భుతంగా ఉంటున్నాయి.
అమెరికా, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి అరుదైన పండ్లను ప్రత్యేకంగా తెప్పించారు. దాతల సహకారంతో విదేశాల నుంచి తెప్పించిన పండ్లను స్వామివారికి నైవేద్యంగా వినియోగిస్తున్నామని ఉద్యానశాఖ ఉపసంచాలకులు శ్రీనివాసులు తెలిపారు. మరోవైపు, తిరుమల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు రాత్రి మలయప్పస్వామి ఉభయ దేవేరులైన శ్రీదేవి, భూదేవిలతో కలిసి తిరుమాడవీధులు ముత్యపు పందిరి వాహనంలో విహరించారు. ముత్యాలు చల్లదనానికి ప్రతీక. వాన చినకులు ముత్యపుపందిరిలో పడి ముత్యాలుగా మారుతాయి.చల్లని శరన్నవరాత్రుల్లో ముత్యపుపందిరిపై విహరించిన స్వామి తన చల్లటి చూపులతో భక్తులను అనుగ్రహిస్తాడు. నీటిబొట్టు తామరపై వుంటుంది. అదే నీటిబొట్టు ముత్యపుచిప్పలో ముత్యంగా మారుతుంది. భక్తులు కూడా శ్రీనివాసుని సన్నిధి చేరి ఆయన చల్లని చూపుల్లో సాంత్వన చెందాలి. పరమాత్ముని సందేశం ఇదే. శ్రీనివాసుడిని మౌక్తికసగ్వి అంటారు. దీనర్థం ముత్యాలహారాన్ని ధరించినవాడని.


