సిక్కోలులో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
- 93 Views
- wadminw
- September 5, 2016
- తాజా వార్తలు
శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలో గల మునసబుపేటలోని ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నక్కల్ల కల్పన (17) అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కళాశాలలోని వసతి గృహంలో ఉంటున్న కల్పన కడుపునొప్పి తాళలేక తాను ఉంటున్న గదిలోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని అఘాయిత్యానికి పాల్పడింది. ఉదయం స్టడీ అవర్‌కు రాకపోవడంతో ఏం జరిగిందని చూసేందుకు సహచర విద్యార్ధులు ఆమె ఉంటున్న గదికి వెళ్లారు. అప్పటికే ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. విషయాన్ని కళాశాల యాజమాన్యానికి విద్యార్థులు తెలియజేయడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం నగరంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కల్పనది సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామం. తండ్రి అప్పారావు, బంధువు రామకృష్ణ రిమ్స్‌కు చేరుకుని బోరున విలపించారు. ఆమె ఇటీవలే స్వగ్రామం తాళ్లవలసకు వెళ్లివచ్చిందని తోటి విద్యార్థులు తెలిపారు. తండ్రి అప్పారావు ఫిర్యాదు మేరకు స్థానిక రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


