సీఎం చంద్రబాబుకు మావోయిస్టుల హెచ్చరిక
హైదరాబాద్, అక్టోబర్ 26 (న్యూస్‌టైమ్): ఏవోబీ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మావోయిస్టులు తీవ్రంగా హెచ్చరించారు. చంద్రబాబు తేనెపూసిన కత్తి అని, ఆయన ఇంతకింత ఫలితం అనుభవించి తీరుతారని మావోయిస్టు ఏపీ అధికార ప్రతినిధి శ్యామ్ అన్నారు. ఏఓబీలో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని ఆయన మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్ర ఫలితంగానే ఏఓబీ ఎన్కౌంటర్ జరిగిందని ఆరోపించారు. కోవర్టుల ద్వారా అన్నంలో విషం కలిపించి, పడిపోయిన వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపారని ఈ విషయమై బుధవారం విడుదల చేసిన ఒక లేఖలో పేర్కొన్నారు. కోవర్టు హత్యల సృష్టికర్త చంద్రబాబు, అతని హంతక పోలీసు ముఠా ద్వారానే ఏఓబీ దారుణ హత్యాకాండ కూడా జరిగిందన్నారు. చడీప్పుడు లేకుండా చంద్రబాబు జరిపించిన దారుణ మారణకాండ అని అభివర్ణించారు. నయీంను మనిషి రూపంలో ఉన్న రాక్షసుడిగా తయారుచేసి, 15 ఏళ్ల పాటు వందలాది హత్యలు చేయించిన ఘనత చంద్రబాబుదేనని మండిపడ్డారు. తొమ్మిదేళ్లు రక్తం వాసనకు దూరంగా ఉన్న చంద్రబాబు గద్దె ఎక్కిన మర్నాడే 21 మంది ఎర్రచందనం కూలీలను దుర్మార్గంగా తన పోలీసులతో హత్య చేయించారని ఆరోపించారు. కోవర్టు పేరుతో పోలీసులతో వేలాదిమందిని బలితీసుకుని నిత్యం హత్యలతో రక్తం పారిస్తున్నారని అన్నారు. ‘‘అలిపిరిలో తప్పించుకున్నావు గానీ, ఈసారి నీవు, నీ కొడుకు తప్పించుకోలేరు’’ అని మావోయిస్టులు ఆ లేఖలో తీవ్రంగా హెచ్చరించారు. అవసరమైతే ఆత్మాహుతి దాడులు చేస్తామని, పోలీసులు, మిలటరీ ఎల్లకాలం ఆయనను కాపాడలేవని అన్నారు. అయితే, మావోయిస్టుల పేరుతో విడుదలైన ఈ లేఖలో ఉపయోగించిన భాష మాత్రం మావోయిస్టులు తరచుగా ఉపయోగించే భాషలా లేదు. దానికి పూర్తి భిన్నంగా ఉంది. దాంతో అసలు ఈ లేఖ నిజమైన మావోయిస్టులు విడుదల చేసిందేనా? లేదా ఏదైనా ఫేక్ లేఖనా? అనే అనుమానాలు సైతం తలెత్తుతున్నాయి. మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రతను కూడా ఉన్నతాధికారులు బుధవారం సమీక్షించారు. డీజీపీ అందుబాటులో ఉన్న ముఖ్యమైన అధికారులతో మాట్లాడి ప్రస్తుతం ఉన్న భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. అదే విధంగా మంత్రులకు కూడా భద్రత పెంచాలని డీజీపీ సూచించారు. ఇదిలావుండగా, పల్నాడుతోపాటు నల్లమల అటవీ ప్రాంత పరిసరాల్లో మళ్లీ అలజడి మొదలైంది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో సోమవారం భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో అనేకమంది మావోయిస్టు అగ్రనేతలు మరణించడం గమనార్హం. గుంటూరు రేంజ్ పరిధిలోని గుంటూరు రూరల్, ప్రకాశం జిల్లాల పరిధిలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉండడంతో ఇది మావోయిస్టు అగ్రనేతలకు గతంలో షెల్టర్ జోన్‌గా ఉండేది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. గుంటూరు రేంజ్ పరిధిలోని నాలుగు పోలీసు జిల్లాల్లో ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. వారి పర్యటనలపై ఎప్పటికప్పుడు తమకు ముందస్తు సమాచారం అందించాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఏఎన్ఎస్ బృందాలు కూంబింగ్ ముమ్మరం చేసి మావోయిస్టుల స్థావరాల కోసం వెతుకులాట ప్రారంభించాయి. గతంలో ఉన్న ట్రాక్ రికార్డుల ఆధారంగా మావోయిస్టు సానుభూతిపరులపై నిఘా పెట్టారు. మావో అగ్రనేతల ఎన్కౌంటర్ నేపథ్యంలో పల్నాడులోని నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండే గ్రామాలు, తండాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. వినుకొండ, మాచర్ల నియోజకవర్గాల్లోని బొల్లాపల్లి, ఈపూరు, కారంపూడి, దుర్గి, వెల్దుర్తి మండలాల్లో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించిఉండడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 2004కు ముందు మావోల తుపాకి మోతలు, పోలీసుల బూట్ల చప్పుళ్లతో ఈ ప్రాంతం దద్దరిల్లిన విషయం అందరికీ తెలిసిందే. 2014లో గుంటూరు, ప్రకాశం జిల్లాల బోర్డర్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టు నేతలు జానా బాబూరావు, విమలక్క, పద్మక్కలు పోలీస్ ఎన్కౌంటర్లో మృతిచెందిన సమయంలోనూ ఈ ప్రాంతంలో తీవ్ర అలజడి రేగింది. అప్పటినుంచి ప్రశాంతంగా ఉంటున్న నల్లమల సమీప ప్రాంతాల్లో సోమవారం జరిగిన ఎన్కౌంటర్ నిద్రపట్టకుండా చేస్తోంది. పోలీసు ఎన్కౌంటర్లో మృతిచెందిన పృథ్వి అలియాస్ మున్నా మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) తనయుడే. ఆర్కేది రెంటచింతల మండలం తుమృకోట గ్రామం కావడంతో ఆప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పృథ్వి చాలా ఏళ్ల కిందట పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో ఏర్పాటుచేసిన చారుమజుందార్ స్మారక స్థూపం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పదేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చల నిమిత్తం అడవి నుంచి బయటకు వచ్చిన సమయంలో గుత్తికొండ వద్ద ఏర్పాటు చేసిన భారీ మావోయిస్టుల సభలో సైతం ఆయన పాల్గొన్నట్లు ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని పల్నాడు ప్రాంతవాసులు భయపడుతున్నారు. కొందరు గ్రామం వదిలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలావుండగా, మావోయిస్టులపై విషప్రయోగం జరగలేదని ఏపీ డీజీపీ నండూరు సాంబశివరావు బుధవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. కొండపై నుంచి మావోయిస్టులు కాల్పులు జరిపాకే పోలీసులు తిరిగి కాల్పులు జరిపారని డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. ‘‘గాయపడిన వారు ఏవోబీలో తలదాచుకున్నారని సమాచారం అందింది. లొంగిపోతామంటే మీడియాను తీసుకెళ్లి వైద్య సేవలు అందిస్తాం’’ అని డీజీపీ సాంబశివరావు అన్నారు.


