సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
- 79 Views
- wadminw
- September 14, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపిస్తున్న సీజనల్, అంటువ్యాధులపై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయింది. ఈమేరకు కిందిస్థాయి అధికారులను మేల్కొలిపే చర్యల్లో భాగంగా ఏపీవైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనమ్ మాల కొండయ్య హైదరాబాద్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్‌రావు ఆదేశం మేరకు ఏజెన్సీ ప్రాంతాలలో సీజనల్ వ్యాధులపై సమగ్ర విచారణ చేసేందుకు 5బృందాలను నియమించడం జరిగిందన్నారు.
ఏజెన్సీ ప్రాంతాలలో 24 గంటలు సంచార వైద్య సేవలు అందుబాటులో ఉండేలా జిల్లా వైద్యాధికారులను ఆదేశించడం జరిగిందని, డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు, డయేరియా వంటి సిజనల్ వ్యాధులు రాకుండా ముందస్తుగా ఎఎన్ఎమ్, ఆశా వర్కర్లు ద్వారా సీజనల్ వ్యాధులపై ఇంటి ఇంటికి వెళ్ళి అవగాహాన కల్పించాలన్నారు. రాష్ట్రంలో వైరల్ జ్వరాలు ఎక్కువుగా ఉన్నందున తక్షణమే సెలవులపై ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బంది విధులకు హాజరుకావాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించడం జరిగిందని పూనం తెలిపారు. మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖతో కలిసి పారిశుధ్యంపై ప్రత్యేక కార్యరచరణ రూపొందిస్తున్నామన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో చేరిన రోగులకు డెంగ్యూ అని నిర్ధారిస్తే ప్లెట్లేట్స్ కూడా ఉచితంగా ఇచ్చేందుకు అన్ని బ్లాడ్ బ్యాంకులతో మాట్లాడమని జిల్లా వైద్యాధికారులను ఆదేశించామన్నారు. ఈ నెల 19 నుండి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో 5000 సిబ్బందితో మొబైల్ మలేరియా, డెంగ్యూ యూనిట్స్‌ను ప్రారంభిస్తున్నామన్నారు. ఈ మొబైల్ మలేరియా, డెంగ్యూ యూనిట్స్ కోసం 200 వాహానాలను ఏర్పాటు చేస్తున్నట్లు వీడియో కాన్ఫరెన్స్‌లో పూనం తెలిపారు. ఈ వాహనాలలో మందులు, ఎన్ఎస్ఎన్ కిట్స్తోపాటు మలేరియాపై ప్రచార, కరపత్రాలతో 3 నెలలపాటు వైద్యసేవలు అందించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని ప్రకాశం, అనంతపురం, కడప, కర్నూల్, చిత్తూరు జిల్లాలలో మైనింగ్ నిర్వహించిన బావులలో నీరు చేరి అంటువ్యాధులు వ్యాపిస్తున్నందున మైనింగ్ శాఖ సహకరంతో అంటూవ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారులకు సూచించామన్నారు. డాక్టర్లు లేని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను గుర్తించి వెంటనే డాక్టర్లను నియమించాలని పూనమ్ మాల కొండయ్య జిల్లా వైద్యాధికారులకు సూచించారు.


