సీపీఐ ఆరోపణల్ని తిప్పికొట్టిన కామినేని
- 117 Views
- wadminw
- September 6, 2016
- అంతర్జాతీయం
హౌస్టన్, సెప్టెంబర్ 6: ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ సీట్ల కేటాయింంపులో 500 కోట్ల రూపాయిల కుంభకోణం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ చేసిన ఆరోపణలను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఖండించారు. అంతా పారదర్శకంగా నిర్వహిస్తూన్న తమపై ఆరోపణలు తగదని హితవు పలికారు. అమెరికాలోని హౌస్టన్‌లో పర్యటనలో ఉన్న మంత్రి కామినేని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపణలపై మంగళవారం స్పందించారు. ‘చెప్పేదే చేయడం, చేసిందే చెప్పడం ప్రభుత్వ విధానం’ అని కామినేని తెలిపారు. 371డీ కింద ప్రైవేట్ యాఙమాన్య సీట్ల కేటాయింపు గతంలోనూ లేదని మంత్రి పేర్కొన్నారు. బీ కేటగిరి సీట్ల కేటాయింపు కులం, ప్రాంతీయతల ఆధారంగా చేయడం లేదన్నారు.
నీట్ కేటాయింపుల ప్రకారం ఆన్లైన్లో మెరిట్ ఆధారంగా జాబితా సిద్ధం చేసి ఉంచామని చెప్పారు. పారదర్శకతపై బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి ప్రకటించారు. మెడికల్ సీట్ల అమ్మకం వెనుక మంత్రులు వున్నారని ఆరోపించడం చీకటిలో ఒక రాయి విసరడమేనన్నారు. ముందు వెనుక చూడక ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. మెడికల్ కౌన్సిలింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేయడం అర్థరహితమని కామినేని స్పష్టం చేసారు. ప్రభుత్వ ఉత్తర్వులు, కోర్టు ఆదేశాల ప్రకారమే సీట్ల కేటాయింపు జరిగిందని కామినేని వివరించారు.
వైట్‌హౌస్‌లో దక్షిణాసియా యువ సదస్సు
వాషింగ్టన్, సెప్టెంబర్ 6: అమెరికా వైట్‌హౌస్‌లో దక్షిణాసియా యువ సమ్మేళన సదస్సు ఘనంగా జరిగింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్), గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సొసైటీ దీన్ని సంయుక్తంగా నిర్వహించాయి. అమెరికా జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వైట్‌హౌస్ పబ్లిక్ ఎంగేజ్మెంట్ సీనియర్ అసోసియేట్ డైరక్టర్ జాకీ బర్ జింగి ప్రారంభ ఉపన్యాసం చేశారు. కో ఆర్డినేటర్‌గా రావులింగా వ్యవహరించారు. ప్రజాసేవ, జీవితం, నాయకత్వ పురోభివృద్ధి, సమాజంలోని వేధింపులు, బులియింగ్ కే12 అనే అంశాలతోపాటు మిషెల్ ఒబామా ప్రారంభించిన లెట్స్ మూవ్ ఉద్యమంపై కూడా చర్చ ఇందులో జరిగింది. వైట్ హౌస్ బిజినెస్ కౌన్సిల్ అసిస్టెంట్ డైరక్టర్ జాయెద్ హసన్, వైట్ హౌస్ సీనియర్ అడ్వైజర్ బెస్పీ చాన్, డిప్యూటీ అసోషియేట్ కౌన్సిల్ రుక్కు సింగ్లా, మిలియనిల్ యాక్షన్ ప్రాజెక్ట్ ప్రెసిడెంట్ అండ్ కో పౌండర్ స్టివెన్ ఒలికరా, వినయ్ తుమ్మలపల్లి సెలక్ట్ యూఎస్ఏ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, ప్రెసిడెంట్ ఫర్ హైయ్యర్ ఎడ్యుకేషన్ స్పెషల్ అసిస్టెంట్, అజితా మీనన్, వైట్ హౌస్ డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్, ఎడ్యుకేషన్ పాలసీ సీనియర్ అడ్వైజర్ మారియో కార్డోనా, వైట్ హౌస్ ఇనిషియేటివ్స్ ఆన్ ఏసియన్ అమెరికన్స్ అడ్వైజర్ డేవిడ్ లూ, నాట్స్ ప్రెసిడెంట్ మోహన కృష్ణ మన్నవ తదితరులు యువతకు విలువైన సలహాలు, సూచనలు అందించారు. నాట్స్ ఈ సందర్భంగా ఓ సావనీర్‌ను ఆవిష్కరించింది. వైట్‌హౌస్ నావీ స్టెప్స్ వద్ద ఫోటో సెషన్ కూడా జరిగింది. సింపోజియంను ఘనంగా నిర్వహించినందుకు వైట్‌హౌస్ ఆవరణలో న్యూజెర్సీ గవర్నర్ క్రిస్క్రిస్టి నాట్స్‌కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రావు లింగా, శ్రీనివాస్ మద్దాళి, మోహన మన్నవ, రమేష్ నూతలపాటి రాధిక గుంటూరు, పద్మిని నిడుమోలు, ప్రవీణ్ నిడుమోలు, జయశ్రీ పెద్దిబొట్ల, కవిత ఎనిగండ్ల, పవన్ బెజవాడ, అశోక్ అనమలశెట్టి, సంజీవ్ నాయుడు,కామరాజు వాడ్రేవు, అంగెల ఆనంద్, ఆనంద్ నాయక్, లక్ష్మి లింగా, బాపయ్య చౌదరి, శ్రీనివాస్ చౌదరిలు పాల్గొన్నారు.
చైనాపై ఫిలిప్పీన్స్‌కు అండగా జపాన్
టోక్యో, సెప్టెంబర్ 6: చైనాతో దక్షిణ చైనా సముద్ర ప్రాదేశిక జలాల విషయంలో పోరాడుతున్న ఫిలిప్పీన్స్‌కు జపాన్ బాసటగా నిలిచింది. దక్షిణ చైనా సముద్రంపై తన వాటా కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ఫిలిప్పీన్స్‌కు అండగా ఉంటామని, వారి సేనలకు తాము యుద్ధ నౌకలతోపాటు నిఘా విమానాలను పంపిస్తామని చెప్పింది. ఈ మేరకు జపాన్ ప్రధాని షింజో అబే మంగళవారం ఒక ప్రకటన కూడా చేశారు. రెండు పెట్రోల్ యుద్ధ నౌకలను, ఐదు నిఘా యుద్ధ విమానాలను ఫిలిప్పీన్స్‌కు సహాయంగా పంపించేందుకు తాము అంగీకరిస్తున్నట్లు జపాన్ ప్రధాని తెలిపారు. దక్షిణ చైనా సముద్రంపై చైనాతో ఉన్న వివాదాన్ని శాంతియుత పరిష్కరించే క్రమంలో భాగంగా ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డుటెర్టీ, జపాన్ ప్రధాని షింజో ఒక ఒప్పందానికి వచ్చినట్లు జపాన్ డిప్యూటీ కేబినెట్ చీఫ్ సెక్రటరీ కోయిచి హగుదా చెప్పారు. ఇదిలావుండగా, ఉగ్రవాదులు కారు బాంబుతో దాడికి పాల్పడటంతో దాదాపు 7 మంది మృతిచెందగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో చోటుచేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గత జూలైలో బాంబు దాడి జరిగి 300కు పైగా ప్రాణాలను బలిగొన్న ఏరియాకు సమీపంలోనే ఈ దుర్ఘటన జరగడం గమనార్హం.నిన్న అర్ధరాత్రి దాటాక కారు బాంబు పేల్చివేయడంతో దాదాపు ఏడుమంది వ్యక్తులు దుర్మరణం పాలవ్వగా, 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అబ్దెల్ మజీత్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమీపంలోని కొన్ని షాపులు దగ్ధమయ్యాయి. ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థ ఈ చర్యకు బాధ్యత వహించలేదని ఇరాక్ అధికారులు వివరించారు. ఐఎస్ఎస్ ఉగ్రసంస్థ గతంలో ఇలాంటి దాడులకు పాల్పడిందని అధికారులు చెప్పారు.


