సెయింట్ థెరిసాకు మరో గౌరవం
- 98 Views
- wadminw
- September 5, 2016
- అంతర్జాతీయం
సెయింట్ హోదా పొందిన మదర్ థెరిసాకు భారత తపాళా సంస్థ తన కృతజ్ఞతను ప్రకటించింది. వాటికన్ సిటీలో భారతరత్న, నోబెల్ శాంతి బహుమతి విజేత మదర్ థెరిసాకు ఆదివారం వాటికన్ సిటీలో సెయింట్‌హుడ్ బహూకరించారు. రోమన్ కేథలిక్ చర్చి పోప్ ఫ్రాన్సిస్ ఈ అరుదైన బిరుదును ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారత తపాళా సంస్థ ఆమె జ్ఞాపకార్థం ఆదివారం పోస్టల్ స్టాంపును ఇక్కడ విడుదల చేసింది. కేంద్ర సహాయ మంత్రి మనోజ్ సిన్హా ఈ స్టాంపును డివైన్ చైల్డ్ హైస్కూల్లో విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి మిషనరీ ఆఫ్ చారిటీస్ అధికార ప్రతినిధులుగా బిషప్ ఆగ్నెలో గ్రాసియస్, సిస్టర్ రూబెల్లా హాజరయ్యారు.
కాగా, రోమన్ కేథలిక్ చర్చి పోప్ ఫ్రాన్సిస్ ఈ గొప్ప బిరుదును ఇచ్చారు. ఈ మహత్కార్యక్రమానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్, ఢిల్లీ, బెంగాల్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, మమత బెనర్జీ తదితరులు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా థెరిసా అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్యాణం తర్వాత ఎవరైనా మదర్, ఫాదర్లు తమను కొలిచిన వారికి అనారోగ్యాన్ని నయం చేయటం, సమస్యలనుంచి గట్టెక్కించటం చేస్తే వారికి ఈ అరుదైన గౌరవాన్ని అందిస్తారు. ఒక అద్భుతం చేసినట్లు గుర్తిస్తే పవిత్రమూర్తిగా (బీటిఫైడ్), 2 అద్భుతాలు జరిగితే దేవతామూర్తిగా (సెయింట్)గా గుర్తిస్తారు. సాక్ష్యాలు సేకరించి వాటిని ధృవీకరించుకున్నాకే పేరును ప్రకటిస్తారు.
1910 ఆగస్టు 26న జన్మించిన థెరిసా జన్మస్థలం మెసడోనియా రాజధాని స్కోప్జె. ఆమె తల్లిదండ్రులు నికోలా బొజాక్షియు, డ్రేన్. ఆమె అసలు పేరు ఆగ్నెస్ గోన్షా బొజాక్షియు. థెరిసాగా పేరు మార్పు 1929లో భారత్‌కు వచ్చాక జరిగింది. కలకత్తాలోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో 1931-48 మధ్య ఉపాధ్యాయురాలుగా పనిచేసిన థెరిసా సొంత చారిటీ సంస్థ ‘ద మిషనరీస్ ఆఫ్ చారిటీ’ను 1950 అక్టోబర్ 7న ప్రారంభించారు. మెగసెసే(1962), నోబెల్ బహుమతి (1979), భారతరత్న (1980) వంటి అత్యుత్తమ పురస్కారాలను అందుకున్న ఆమె పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో 1997 సెప్టెంబర్ 5న ప్రాణాలు విడిచారు.


