స్టాక్ మార్కెట్లను కుదిపేసిన టాటా గ్రూప్ నిర్ణయం
- 86 Views
- wadminw
- October 25, 2016
- అంతర్జాతీయం
ముంబయి, అక్టోబర్ 25: సంస్థను స్థిర పరించేందుకే తాను తాత్కాలింగా చైర్మన్ బాధ్యతలు చేపట్టానని రతన్ టాటా తెలిపారు. టాటా గ్రూపున చైర్మన్‌గా తన బాధ్యతలు తాత్కాలికమేనిన ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే కొత్త చైర్మన్‌ను ఎన్నుకుంటారని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా టాటా వివాదం కోర్టుకు చేరింది. ఇప్పటి వరకు టాటా గ్రూపునకు చైర్మన్‌గా వ్యవహరించిన సైరస్ మిస్త్రీ ముంబైకోర్టులో కేవీఎస్ పిటిషన్ దాఖలు చేస్తూ చైర్మన్ పదవి నుంచి సంస్థ తొలగించడంపై మిస్త్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా టాటా గ్రూప్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా మంగళవారంనాడు సంస్థ సీఈవోలు, అధికారులతో సమావేశమయ్యారు. కాగా, మార్కెట్ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి రేపుతూ టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తనను ఉన్న పళంగా తొలగించడంపై వస్తున్న పుకార్లను సైరస్ మిస్త్రీ కొట్టిపారేశారు. మంగళవారం ఓ మీడియా ప్రకటనను విడుదల చేశారు. ఈ 24 గంటలు జరిగిన తతంగమంతా ఆశ్చర్యకరమైనది కానప్పటికీ, చాలా సెన్సిటివ్ అని మాత్రం మిస్త్రీ పేర్కొన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అగౌరవమైన రీతిలో మిస్త్రీని తొలగించడంపై బోర్డు నిర్ణయంపై పల్లోంజి గ్రూప్, మిస్త్రీ కోర్టులో సవాలుచేయనున్నట్టు పలు టీవీ చానెల్స్ రిపోర్టు చేశాయి.
కానీ వ్యాజ్యాన్ని దాఖలు చేయడానికి పబ్లిక్ ప్రకటన తప్పనిసరి అని షాపూర్జీ పల్లోంజి గ్రూప్, మిస్త్రీ పేర్కొన్నారు. షాపూర్జీ గ్రూప్ కానీ, సైరస్ మిస్త్రీ గ్రూప్ కానీ ఇప్పటివరకు కోర్టుకు వెళ్తున్నట్టు ఎలాంటి ప్రకటన చేయలేదని, వ్యాజ్యాన్ని దాఖలు చేస్తాం అనే మీడియా ఊహాగానాలకు ఎలాంటి ఆధారాలు లేవని పల్లోంజి గ్రూప్ తెలిపింది. కోర్టుకు వెళ్లాలంటే పబ్లిక్ ప్రకటన తప్పనిసరి అని గ్రూప్ అధికార ప్రతినిధి తెలిపారు. మరోవైపు టాటా గ్రూప్, సైరస్ మిస్త్రీలు కోర్టులో తమ వాదనలు వినిపించుకోవడానికి ముందస్తుగా జాగ్రత్తులు పడినట్టు తెలిసింది.
టాటా గ్రూప్ హైకోర్టులో ముందస్తుగా ఓ కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేయగా మిస్త్రీ కూడా టాటా సన్స్‌కు, రతన్‌టాటాకు, సర్ దోరబ్జీ ట్రస్ట్‌లకు వ్యతిరేకంగా నాలుగు కేవియట్ పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేసినట్టు వార్తలొచ్చాయి. కానీ తాను ఎలాంటి కేవియట్ పిటిషన్లను దాఖలు చేయలేదని మిస్త్రీ పేర్కొన్నారు. ఏకపక్షంలో వాదనలు మాత్రమే వినకుండా ఇతరుల అభిప్రాయాలను కూడా కోర్టు పరిగణలోకి తీసుకునేలా ఈ కేవియట్ పిటిషన్లు దోహదం చేయనున్నాయి. సోమవారం జరిగిన అనూహ్య నిర్ణయాల నేపథ్యంలో టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా, తన గ్రూప్ సీఈవోలందరితో భేటీ అయ్యారు. గ్రూప్ హెడ్ ఆఫీసు బొంబాయిలో ఈ భేటీ జరిగింది.
ఇదేమీ యజమాన్య పరంగా వస్తున్న యుద్ధం కాదని మిస్త్రీ తొలగింపుపై రతన్ టాటా వ్యాఖ్యానించారు. సంబంధిత వ్యాపారాల్లో సహ అధినేతలు ఎక్కువగా దృష్టిసారించాలని రతన్ టాటా ఆదేశించారు. తన ఎంపిక స్వల్పకాలం మాత్రమేనని, కొత్త చైర్మన్ ఈ పదవికి త్వరలోనే ఎంపికవుతారని పేర్కొన్నారు. మార్కెట్ పొజిషన్‌పై దృష్టిసారిస్తూనే, పోటీవాతావరణంపై కూడా ఫోకస్ చేయాలని గ్రూప్ సీఈవోలకు రతన్ టాటా తెలిపారు. ఓ వైపు టాటా గ్రూప్ దెబ్బ.. మరోవైపు ఎఫ్ఎమ్సీజీ, ఐటీ స్టాక్స్‌ల ఒత్తిడి మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ 87.66 పాయింట్ల నష్టంతో 28,091.42 వద్ద స్థిరపడగా నిఫ్టీ 8700 దిగువన 8691.30 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఏషియన్ పేయింట్స్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు టాటా గెయినర్లుగా లాభాలు పండించగా, మహింద్రా అండ్ మహింద్రా, టాటా స్టీల్, గెయిల్, హెచ్‌యూఎల్, ఓఎన్జీసీలు నష్టాలను గడించాయి. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తప్పిస్తూ టాటా సన్స్ ఊహించని నిర్ణయం తీసుకోవడం, టాటా గ్రూప్ స్టాక్స్‌పై, స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది.
టాటా గ్రూప్ అన్ని కంపెనీల్లో టాటా స్టీల్ ఎక్కువగా నష్టాలను చవిచూసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీలో ఈ కంపెనీ షేర్లు దాదాపు 3 శాతం కిందకి దిగజారాయి. ఇతర కంపెనీలు టాటా పవర్, టాటా కన్సల్టెన్సీ సర్వీసు, టాటా మోటార్స్ 1-2శాతం నష్టాల్లో ముగిశాయి. ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో పెట్టుబడిదారులు టాటా స్టాక్స్‌లో లాభాల స్వీకరణకు మొగ్గుచూపారని, దీర్ఘకాలికంగా ఈ పరిణామాలు చోటుచేసుకోవని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఆసియన్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి. మూడో క్వార్టర్లో దక్షిణ కొరియా ఆర్థిక వృద్ధి నెమ్మదించిందని డేటా వెలువడగానే, ఆ దేశ షేర్ మార్కెట్లు పడిపోయాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.84గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.63 లాభంతో 29,826గా నమోదైంది.


