స్త్రీ చుట్టూ ఎన్నో కష్టాల ముళ్ల పొదలు…
స్త్రీ చుట్టూ ఎన్నో కష్టాల ముళ్ల పొదలు… ఎటు చూసినా వేదనాభరిత కంచెలు… పిల్లాపాపలకు చెందిన మాతృత్వం, మమకారం నుంచి మొగుడితో కాపురం, ఉద్యోగ బాధ్యత వగైరాల వరకూ ప్రతిదీ ఆమెను కన్నీళ్లకు దగ్గర చేసేదే. ఆమె స్వగతం వినే వాళ్లకు, రోదనలు వద్దన్నా వినబడతాయి… మహిళల విషయంలో దుఃఖపు వాకిలి ఎప్పటికీ తెరిచే వుంటుందేమో అనిపిస్తుంది… ఆమె జీవితం ఒక గాయం నుంచి ఇంకో గాయంలోకి అన్నట్లు అగుపిస్తుంది… ఆరళ్లు, నిందలూ, నిష్టూరాలు, కష్టాలు, కన్నీళ్లు, అత్యాచారాలు, వేధింపులూ అనే ఏడు వూచల్లో ఆమె జీవితం అనునిత్యం బంధీ అయి వుంటుంది.
ఆజన్మ ఖైదీగా ఆమె క్షణక్షణం బాధ అనుభవిస్తూనే వుంది… రక్షించాల్సిన వారే శిక్షించడానికి ప్రయత్నిస్తుంటారు. ఆవేదనలు తట్టుకోలేక ఒక్కోసారి తనకు తానే శిక్ష విధించుకుంటుందామె. ఆత్మహత్యలను ఆశ్రయిస్తుంటుంది… అందుకు గల కారణాలేమిటి? పరిష్కారం మార్గమేమిటి? ఓ స్పెషల్ స్టోరీ. ముగ్గు వేసినంత ఈజీగా, ఆమె మార్గనిర్ధేశనం చేయగలదు. కసువు వూడ్చినంత తేలిగ్గా, ఆమె సమస్యల దుమ్ముదులపగలదు. పాలు పితికినంత సులువుగా, తన చుట్టు పక్కల వారి నుంచి మంచి స్వీకరించగలదు. ఈ మొత్తం ప్రపంచం ఆమె సృజన. కానీ, ఇదంతా ఆమె గొప్పదనం అని అంగీకరించక ఆవేదనలకు గురిచేస్తుంటుందీ సమాజం. సమసమాజం అంటూనే ఆమె పట్ల చూపే అసమానత అసాధారణం- ప్రతినిత్యం ఆమె మీద హింసకు పాల్పడుతూ తమ అమానవీయత చాటుకుంటూనే వుంటుందీ నీచసమాజం. ఈ దారుణాలను ఎక్కువ కాలం భరించలేక తనవు చాలించాలనుకుంటుందామె.
ఆమె అలా ఆత్మహత్యకు పాల్పడ్డంలో తప్పెవరిది? అసలెందుకిలా జరుగుతోంది? అపురూపమైనదమ్మ ఆడజన్మ… అంటూ కవులు రాయగా పాడుకుని మురిసిపోతుంటారు. కానీ, ఆమెను ఆమెలా చూడ్డం మాత్రం మరిచిపోతుంటారు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అంటూ ఆమె చేయాల్సిన వెట్టి చాకిరీలకు ఉన్నతమైన విశేషణాలను చేర్చి రాస్తారు. అవే పెద్ద చట్టాలుగా మార్చుతారు. అదే ఆమె పాలిట శాపంగా మారుతోంది. తనదైన జీవితం తాను జీవించ లేక… శతవిధాలా నష్టపోతోందామె.
ప్రేమ, పెళ్లి… ఎంతో కమ్మనివి. ఆమె బతుకు మీద మాత్రం విషం కక్కడంలో నమ్మినబంట్లుగా మారుతుంటాయవి… ప్రేమ ఒప్పుకోలేదని ఆసిడ్‌తో దాడి చేసే వాడొకడు… గొంతు కోసే వాడు మరొకడు… సరే, ప్రేమ ఫలించి పెళ్లి వరకూ వచ్చిందనుకుందాం… ఆ పెళ్ళి కూడా ఫలించి గర్భం దాల్చిందే అనుకుందాం… ఆ గర్భం ఒక్కో సారి ఆమె ప్రాణం తీస్తుంది… ఆ గండం కూడా గడిచిందనుకుంటే, ఆడపిల్లను కన్న పాపానికి జీవితం కష్టాల పాలు కాక తప్పదు… ఇవన్నీ గడపలోపల. గడప దాటాక ఏర్పడే విపత్తులు కూడా అంత సామాన్యంగా వుండవు.
ప్రతి అంశమూ ఆమె పాలిట ఆశనిపాతమే అవుతుంది. అర్బన్ లైఫ్‌లో చేయాల్సిన ఉద్యోగాలు… ఆఫీసులో బాసుల అఘాయిత్యాలు, తోటి వుద్యోగుల వెక్కిరింతలూ… ఆమెను వెంటాడుతూనే వుంటాయి. గ్రామాల్లో ధనికులు, పెత్తందార్లు, వడ్డీ వ్యాపారులూ ఆమె జీవితంతో ఒక ఆట ఆడుకుంటారనే చెప్పాల్సి ఉంటుంది. వీటితో పాటు నిరక్షరాస్యత, కుటుంబ సమస్యలు, మానసిక రుగ్మతలూ ఉండనే వున్నాయి. ప్రతి ఒక్క విషయమూ స్త్రీని ఇబ్బందుల్లోకి నెట్టడానికే అన్నట్టుంటాయి. అవే వారిని ఆత్మహత్యల వూబిలోకి దింపుతుంటాయి. ఈ ప్రపంచాన్ని ‘ఉమెన్ ఫ్రెండ్లీ వాల్డ్’ను చేయడానికి చేయని ప్రయత్నం లేదన్నట్టు వుంటుందీ సమాజం. అబ్బో ఒకటా రెండా కావలసినన్ని చట్టాలు.
చట్టాలను ఎన్ని రకాలుగా పక్కతోవ పట్టించాలో పట్టించేస్తూ స్త్రీలను ఎంతగా బాధిస్తుందో కదా ఈ సొసైటీ అనిపిస్తుంది. గృహహింస వంటి ఎన్నో చట్టాలు ఆమెకు రక్షణ కల్పించడంలో తీవ్రంగా విఫలమవుతున్న దాఖలాలు అనేకం చూస్తూనే వున్నాం. అవి ఆమెకు రక్షణ కల్పిస్తాయనే కంటే కూడా ఎక్కువగా బాధిస్తాయని కూడా చెప్పవచ్చు. ప్రీవెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ది క్యూర్ అన్న సిద్ధాంతం అనుసరించి అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినం వంటి వెన్నో తెరమీదకు వచ్చాయి. ప్రతి ఏటా నవంబరు- 25ను ‘ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయోలెన్స్ అగైనెస్ట్ విమెన్’గా పాటిస్తారు.
ఫాదర్స్ డే, మదర్స్ డే, ఫ్రెండ్షిప్ డేల్లా… ఈ దినాన్ని జరపుకోవడం 1999 నుంచీ ఆనవాయితీగా మారింది. ఒక దేశ మహిళ స్థితిగతులను చూసి-ఆ దేశ పరిస్థితి ఇట్టే చెప్పవచ్చని అంటారు పండిట్ నెహ్రూ. అలా, మన దేశంలోని మహిళల దుస్థితి చూసి వారిక్కడ ఎంత భద్రంగా వుంటున్నారో. ఎంత సుఖంగా బతుకుతున్నారో తెలుసుకుని ఒక అంచనాకు రావచ్చు. దేశంలో ప్రతి 4 నిమిషాలకు ఒక ఆత్మహత్య జరుగుతోంది. అందులో సగానికి సగం మూడుపదులు దాటని యువత సంఖ్యే అధికం. మొత్తంగా ప్రతి రోజూ 130 మంది స్త్రీలు బలవన్మరణాలకు గురవుతున్నారట.
వారిలో 69 మంద గృహిణులున్నారట. దీన్ని బట్టీ… మన దేశంలో ఆడవాళ్లు ఎంత ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఆ పరిస్థితి నివారించడానికే స్త్రీ హింసా వ్యతిరేక దినాల ఏర్పాటని చెప్పవచ్చు. అయినా ఏం ఉపయోగం? దేశ జనాభాలో దాదాపు సగం వుండే మహిళలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. అయినప్పటికీ జాతీయ స్థాయిలో మహిళామణులు అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నారు. సామాన్య మహిళగా మనగలగడానికే ఆమె ఆపసోపాలు పడుతుంటే… ఈ సమాజం నుంచి పొందాల్సిన ఛీత్కార సత్కారాలను పొందుతుంటే… ఆ స్థాయిలో రాణించాలంటే అందులో ఎంత వ్యతిరేకత ఉంటుందో వూహించుకోవచ్చు. అసలామె బతుకు ఆసాంతం ముళ్లమీదే వుంటుందన్న మాట కొట్టిపారేయలేమని చెప్పాల్సి వస్తుంది.
తొలినాళ్లలో సమాజం మాతృస్వామ్యంలో ఉండేది. అన్నింటా ఆమె తన అజమాయిషీ సాధించేది. తరువాత్తరువాత కూడా స్త్రీ- పురుషులతో సమానంగా ఉండేది. రాచరికపు రోజుల్లో స్వయంవరం ద్వారా ఆమెకు ఎంత స్వేచ్ఛ వుండేదో అవగతమే. అర్ధాంగిగా గొప్ప హోదా అనుభవించింది కూడా. వైదిక యుగం ప్రారంభం నుంచీ స్త్రీ స్థాయి తగ్గిందని చెబుతారు కొందరు సామాజిక వేత్తలు. మధ్యప్రాచీన కాలం నాటికి మహిళల స్థితి-గతుల్లో గణణీయమైన తేడాలొచ్చాయి. నిజానికి ఆమె విషయంలో చీకటి కోణం మొదలైంది అప్పటి నుంచే. రాను రాను స్త్రీ అనేక సామాజిక ఆర్ధిక, రాజకీయ, విద్యా సమస్యలను ఎదుర్కుంటూ వస్తోంది. గృహహింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, నానాటికీ ఎక్కువవుతూ వస్తున్నాయి.
ఆత్మనూన్యతా భావానికి లోనవుతూ మహిళలు ఆత్మహత్యలు చేసుకోవడం అధికమవుతోంది. వీటిని అరికట్టే ప్రయత్నంలో భాగంగా 1990 డిసెంబరు 17న ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసింది. ప్రతి సంవత్సరం నవంబరు 25న స్త్రీ హక్కుల పరిరక్షణ, స్త్రీ హింసా వ్యతిరేక దినంగా పాటించడానికి తీర్మానం జరిగింది. మహిళలూ మీరు మహరాణులు అంటూ వారిని మనం ఉత్తేజపరచడంలో ఎక్కడో లోపముంది. ఆమె విషయంలో మాటకు పెట్టి- చేతకు కొట్టే ప్రయోగమేదో నిర్విఘ్నంగా సాగుతున్నట్టుంది. లేకుంటే ఆమెకు ఈ ప్రపంచం మీద, తన చుట్టూ వున్న వారి మీద ఇంత వ్యతిరేకత ఎక్కడిది?
ఇంత వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పేదొకటీ-చేసేదొకటిగా మారడం వల్లే ఆమె మరణానికి అతిగా త్వరపడుతోంది. ఈ కష్టాలతో వేగలేక కాటికేగడానికే ఎక్కువగా ఇష్టపడుతోంది. ఆమె ఇలా ఆత్మహత్యలు చేసుకుంటూ పోతే… ఈ ప్రపంచపు తలరాత అంతకన్నా వేగంగా తారుమారు కావడం ఖాయంగా తెలుస్తోంది. ఒక్కోసారి మహిళ మరీ అధ్వాన్నంగా ఆలోచిస్తోందా అనిపిస్తుంది. అవును నిజమే. తను చావడమే కాకుండా తన పిల్లలను సైతం ఆత్మహత్యకు పురిగొల్పుతోంది. వారి ఇష్టాఇష్టాలతో పనిలేకుండా… తాను లేకుండా వీరు ఈ భూమ్మీద బతకడం అనవసరమనుకుని బలిపీఠం ఎక్కించేస్తోంది.
దాంతో చిరుప్రాయంలోనే ఆ చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. చనిపోయాక ఆమె అనుభవించే నరకం ఏపాటిదో తెలియదు కానీ, ఆ పసివాళ్ల ఉసురు తీసే ముందు ఆమె అనుభవించే వేదనను అర్ధం చేసుకుంటే గుండె పగిలిపోవడం ఖాయం. ఆఖరున చనిపోయే ముందు కూడా ఆమెకు మనశ్శాంతి లేకుండా పోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నిండా ముప్పై ఏళ్లు రాకముందే, నిండునూరేళ్లు నిండిపోతున్నాయి మరో తల్లిగా భాసిల్లల్సిన అత్త… యముడి మహిషపు లోహపు గంటలు మోగించడంలో అత్యుత్సాహం చూపుతోంది ఆ క్రమాన్ని వ్యతిరేకించాల్సిన భర్త మౌనాన్ని ఆశ్రయిస్తూ-తన నిరాశ్రయాన్ని ఎత్తి చూపుతుంటాడు ఒక్కోసారి భరించువాడైన భర్త, నేరుగా భాధించువాడిగా మారుతుంటాడు.
కొన్ని సార్లు అదే భర్త నేరుగా బాధించకుండా అక్రమసంబంధం వంటి మాయోపాయాలతో అవమానపరుస్తుంటాడు కూడా. ఇవన్నీ ఆమెను తీవ్రమైన ఆవేదనకు గురి చేస్తుంటాయి. అవే కారణాలు ఆమె ఆత్మహత్య చేసుకోడానికి దారితీస్తుంటాయి. కొన్ని సార్లు చాలా చాలా సింపుల్‌గా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు స్త్రీలు. ఆలుమగల మధ్య వచ్చే అభిప్రాయబేధాలు కూడా ఆత్మహత్యలుగా కన్వర్టవుతుంటాయి. ఇష్టం లేని పెళ్లిళ్లు వారిని కలహాలకు మరింత దగ్గర చేస్తుంటాయి. అవి ఎంతకీ తెగక… ఆమెకు ఆత్మహత్యే శరణ్యమవుతుంటాయి.
ఎక్కువ మంది క్షణికావేశంలోనే ఆత్మహత్యలు చేసుకుంటారు. అప్పుటికప్పుడు వారిని ఎవరైనా ఆపితే ఆ క్షణం గడిచిపోతుంది. వాళ్ళు మళ్ళీ ఆత్మహత్య గురించి ఆలోచించరు. పని ఒత్తిడి, పరిమితి లేని కోర్కెలు, చిన్న విషయానికే ఆవేశకావేశాలకు లోనుకావడం, మనస్థాపానికి గురవ్వడం, అసూయ వంటి మానసిక రుగ్మతలు తగ్గించుకోవాలి. బిడ్డల భవిష్యత్తు, జీవితాంతం కష్టసుఖాల్లో కలకాలం కలిసి ఉంటామని అగ్నిసాక్షిగా చేసుకున్న ప్రమాణాలు, ఇతర ఆప్యాయతానుబంధాలను గుర్తుచేసుకోవాలి. సమస్యలను తల్లిదండ్రులు, మిత్రులు, ఆత్మీయులతో పంచుకోవాలి.
కానీ ఇవేమీ ఆ సమయంలో ఆచరయోగ్యం కావడం లేదు. ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన సన్నివేశం ఆత్మహత్య… అత్యంత దారుణమైన మానసిక స్థితికి మారుపేరు ఆత్మహత్య… అత్యంత నీచమైన పరిష్కారానికి మరోమార్గం ఆత్మహత్య… తనకు తానే కాదు తన వాళ్లకూ చేజేతులా చేసే ద్రోహానికి పర్యాయపదం ఆత్మహత్య… నమ్ముకున్నవాళ్లను నట్టేట ముంచే ఒకానొక తంతు ఆత్మహత్య… నవ్విన నాపచేను పండుతుందని తెలుసుకోలేక పోవడానికి నిదర్శనం ఆత్మహత్య… పరుగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగుదామని గుర్తుకు రాకపోవడం వల్ల ఏర్పడే విపత్తు ఆత్మహత్య…
అటునుంచి నరుక్కు రావడమెలాగో తెలియక పోవడం వల్ల ముంచుకొచ్చే ముప్పు ఆత్మహత్య… బతికుంటే బలుసాకు తిని బతకవచ్చనే సామెతను ఆ క్షణం గుర్తుకు చేసుకోలేక పోవడం వల్ల చెల్లించే పరిహారం ఆత్మహత్య… చచ్చిన సింహం కన్నా బతికి వున్న కుక్క మేలన్న నానుడి తెలియక పోవడం వల్ల వచ్చే అనర్ధం ఆత్మహత్య… చచ్చి ఏం సాధిస్తావు… అన్న మాట ఏ కోశానా ప్రభావం చూపలేక పోవడం వల్ల వచ్చే ఆలోచన ఆత్మహత్య… నా దాసులు తొందరపడి తనను తాను చంపుకుంటే, వారికి పరలోక ప్రవేశం ఉండదు అంటుంది ఇస్లాం. ఏ వస్తువుతో ఆత్మహత్య చేసుకుంటారో పునరుత్థాన దినాన అదే వస్తువుతో హింసించబడతారంటుంది క్రైస్తవం. ఆత్మహత్య మహాపాతకం అంటుంది హైందవ ధర్మశాస్త్రం.
ఇన్ని మతాలు నిషేదించిన ఒకానొక ప్రక్రియ ఆత్మహత్య. కానీ ఇవేమీ తెలుసుకోకుండా తమను తాము మరణంలోకి నెట్టేసుకుంటున్నారు… స్త్రీలు. ఎలాంటి మత విశ్వాసాలు కూడా వీరిని అకాల మరణం నుంచి కాపాడలేక పోతున్నాయి. మరి ఆత్మహత్యలు చేసుకునే వారిని వారించడానికి సహకరించే విధానమే లేదా? వారి తరఫున ఆలోచించగలిగే వారే లేరా? వారి బాధను తమ బాధగా తీసుకునే వారే లేరా? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ ప్రపంచానికి తెలియదా? తెలిసినా రోజుకు ఇన్ని వందల మంది మహిళలు ఎందుకు చనిపోతున్నట్టు? మొన్నటికి మొన్న ఒక ముక్కు పచ్చలారని బాలికను- హత్య చేసి అస్థిపంజరం చేసేసారు.
మరొక ముసలమ్మను తన్ని తగలేసారు. పుట్టింది ఆడపిల్లలని తెలిసినంతనే జన్మనిచ్చిన ఆసుపత్రి కాంపౌండే వారి పాలిట వల్లకాడుగా మారిపోతోంది. ఆడపిల్ల పుట్టిందని తెలియగానే పురిట్లోనే చిదిమేయడం దగ్గర నుంచి పుట్టగానే చంపేసే దాఖలాలు కూడా అనేకం. ఇలా ఎవరికి వారు ఆడపిల్ల అన్న శబ్ధం ఎక్కడ ఉద్భవించినా వూరుకోక తమ తమ పనితనం చూపిస్తున్నారు. దానికి తోడు తమకు తాము ఆత్మహత్యలతో ద్రోహం చేసుకుంటూ పోతుంటే వచ్చే రోజుల్లో ఈ భూమ్మీద స్త్రీ అన్న మాటకే అవకాశం లేకుండా పోతుందేమో. ఆమే లేకుంటే ఏ జీవికీ జన్మమనేదే వుండదని తెలుసుకోలేక పోతోందీ సమాజం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఇంతకీ ఆత్మహత్యలను నిరోధించడానికి ఏం చెయ్యాలి?
ముఖ్యంగా మహిళలను ఆత్మహత్యలకు దూరం చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి? చెల్లిగా-తల్లిగా-భార్యగా-వదెనగా-ఆమె తన వాళ్లకు ఎంతో ఆప్యాయతానురాగాలను పంచుతూ పోతుందే. ఆమె పట్ల ఎవ్వరికీ బాధ్యత లేదా? ఎవ్వరూ కూడా ఆమె మరణానికి దగ్గర కాకుండా అడ్డుకోలేరా? మా ఆశలు మావి అన్న మాట తప్పించి-నీ చావుతో మాకు పనేమిటి అన్నట్టే వుంటారా? నీ జీవితంలో అడుగడుగునా తారసపడే స్త్రీని నువ్వు కాక ఎవరు రక్షిస్తారన్న ధ్యాసే వీళ్లెవరికీ లేదా? స్త్రీని ఈ ఆత్మహత్యా ప్రమాదం నుంచి తప్పించే దారేది? ఎలా చేస్తే మహిళ మేలుకుంటుంది.
మహిళల స్థితిగతుల మీద స్పష్టమైన అధ్యయనం జరగాలి. వారిలో మనోధైర్యం పెంపొందించాలి. విద్యాబోధన కాలంలోనే మానసిక శాస్త్ర బోధన విధిగా జత చేయాలి. ముఖ్యంగా ఆమెను గృహహింసకు దూరం చేయాలి. అందులోంచి బయట పడ్డానికి ఆమెకు తగిన చిట్కాలను నూరిపోయాలి. అన్ని స్థాయిల్లో మహిళ మీద జరుగుతున్న అత్యాచారాలు, ఇతర హింసలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం ఉదాసీనంగానే వ్యవహరిస్తోందనడానికి భారతదేశమంతటా కావలసినన్ని ఉదాహరణలున్నాయి. రోజుకు అధికారికంగా-అనధికారికంగా సుమారు 150 మంది స్త్రీలు కాటికేగుతుంటే, ఆమె పట్ల మన పట్టీ-పట్టనితనానికి ఇకనైనా స్వస్థి చెప్పాలి. అది జరగాలంటే ముందు ఎక్కడికక్కడ చైతన్యం రావాలి.
దగ్గర్లో వున్న అధికార యంత్రాంగానికి సమాచారం అందించడం ద్వారా స్త్రీ మీద జరుగుతున్న హింసను ఆపవచ్చు. తద్వారా ఆమెను చావు కొని తెచ్చుకోవడానికి ఆత్మహత్యను ఆశ్రయించే పనికి స్వస్థి పలికేలా చేయవచ్చు. ఆత్మహత్య చేసుకోవడం అంటువ్యాధిలా ప్రబలిపోతోంది. ఆత్మహత్యలను ఎవ్వరూ సీరియస్‌గా తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికే జనాభా నిష్పత్తిలో స్త్రీల శాతం సగభాగానికి పడిపోయింది. ఇదిలాగే కంటిన్యూ అయితే రేపటి ఆకాశం నుంచి కురిసేవి వానలు కావు-అగ్నివర్షాలు. ఈ ప్రపంచానికి స్త్రీ చాలా ఇచ్చింది. మీరు పుట్టించే ఉద్యమాలకు తను పురిటినొప్పులు పడింది. తను వూపిరులూది కన్న బిడ్డల అసువులు ధారాదత్తం చేసింది. అందుకు మానసికంగా, శారీరకంగా ఎన్నెన్నో గాయాలను అనుభవించింది.
వాటికి బోనస్‌గా ఆమె ఆత్మహత్య చేసుకునే అవకాశాలనూ అధికం చేస్తోందీ సమాజం. ఇది నిజంగా దారుణం. అన్యాయం. ఈ ఘోరం- ఈ నేరానికి అడ్డుకట్ట వేయకపోతే ఈ భూమి రుద్రభూమి కాక తప్పదు. అనుక్షణం ఆమె గుండెకు చేసే గాయం-పెనువిపత్తును మోసుకొస్తుంది తస్మాత జాగ్రత్త.. అంటోంది స్త్రీవేదంలోని ఆత్మహత్యలనే ఆరవఅధికరణం. స్త్రీని పూజించిన చోట మంచి జరుగుతుందన్నదానిలో ఎంత నిజముందో తెలియదు కానీ, వేధించే చోట మాత్రం చెడు జరుగుతుందన్నది వాస్తవం.


