స్థానికంగానే సమస్యలు పరిష్కరించుకోవాలి: తుమ్మల
- 78 Views
- wadminw
- September 22, 2016
- రాష్ట్రీయం
ఖమ్మం, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్థానిక సమస్యలను అక్కడే పరిష్కరించుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరారవు సూచించారు. గుండుగులపల్లి మండల పరిధిలోని గుండగులపల్లిలోని తన నివాసంలో ఉన్న తుమ్ములను గురువారం జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమపై నమ్మకంతో ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకున్న ప్రజలు కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధిని వేగవంతం చేయాలన్నారు. అధికారులు ధైర్యం చేసి పనులు చేస్త ఆ కీర్తి వారికే దక్కుతుందని, గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు ప్రస్తుతం మంచి స్థానాల్లో ఉన్నారంటే దానికి వారు చేసిన పని విధానమే కారణమన్నారు. పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చునని, ఆ విధంగా అధికారులు పనులు చేయాలన్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు విషయంలో పైరసీలకు ప్రాధాన్యతనిస్తే సహించేది లేదన్నారు. జిల్లావ్యాప్తంగా చేపట్టిన రోడ్ల విస్తరణ పనులను వేగవంతం చేయాలన్నారు.
అశ్వారావు పేటలో కుండపోతగా భారీ వర్షం
ఖమ్మం, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): అశ్వారావుపేటలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ కుండపోతగా కురిసిన భారీ వర్షానికి చెరువులు, వాగులు ఉప్పొంగాయి. చెరువులు నిండి అలుగులు పోస్తూ నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మండలంలోని నరసింహసాగర్, చెన్నయ్యకట్టు చెరువు, పాలవాగు చెరువు, అనంతారం వూరచెరువు, మొద్దులమడ, గెంటేడివాగు నిండుకుండలా మారి వరదనీరు అలుగుల ద్వారా దిగువకు పారుతోంది. పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. గోపన్నగూడెం-కంట్లం, నెమిలిపేట-వాగోడ్డుగూడెం, గుమ్మడవల్లి-రంగాపురం మధ్య వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలు స్తంభించాయి. కాగా, తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని జిల్లాల్లో చెరువులు, వాగులు పొంగిపోర్లుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో చెరువులకు గండ్లు పడడంతో గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు జలదిగ్భంధంలో చిక్కుకున్నారు. నల్లగొండ జిల్లాలో పులిచింతల ప్రాజెక్టుకు గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 54.34 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 48.5 మీటర్లగా ఉంది. నీటి నిల్వ 24.4 టీఎంసీలు ఉండగా ఇన్‌ఫ్లో 10వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. మరోవైపు జిల్లాలో కేతపల్లి మూసీ కుడికాల్వకు గండి పడింది. కొత్తపల్లి గ్రామశివారులో నీరు వృథాగా పోతుంది. ఖమ్మంజిల్లాల్లో తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి తీవ్రంగా ఉండడంతో ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తి 18 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. మరోవైపు, పొరుగున ఉన్న తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షానికి రాజానగరం మండలం సూర్యరావుపేట వద్ద గల 16వ నంబర్ జాతీయ రహదారిపై వరద నీరు కాలువలా ప్రవహిస్తోంది. దీంతో రాజమండ్రి- విశాఖపట్నం మద్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రైతుల కష్టాలు తీరినట్టేనని అధికారులు భావిస్తున్నారు. భారీ వర్షాలతో పలు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. దాదాపు అన్ని చెరువులు, కుంటల్లో నీరు ప్రమాదస్థాయికి చేరుకుంది. ఖమ్మం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు బుధవారం ఉదయం ప్రాజెక్ట్ పదిగేట్లను ఎత్తివేసి… 23,730 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు.
ప్రభుత్వ ప్రయోజనాలు వినియోగిగించుకోవాలి: సామినేని
ఖమ్మం, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): ప్రైవేట్ డెయిరీల ప్రలోభాలకు గురికాకుండా ప్రభుత్వ విజయ డెయిరీకి పాలు పోస్తూ ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను పొందాలని జిల్లా విజయ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షుడు సామినేని హరిప్రసాద్ అన్నారు. ఖమ్మం రోటరినగర్లోని జిల్లా పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ఆవరణలో జిల్లాస్థాయి పాల ఉత్పత్తిదారుల సమావేశం గురువారం ఇక్కడ జరిగింది. ఈ సమావేశంలో హరిప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రాంత ప్రైవేట్ డెయిరీలు రాష్ట్రంలోని పలు గ్రామాల్లో రైతుల వద్ద నుంచి పాలను సేకరిస్తూ తిరిగి ఆ పాలను ఈ ప్రాంత వాసులకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారని అన్నారు. కాని విజయ డెయిరీ లాభాలల్లో 75 శాతం పాడి రైతులకే ఖర్చు చేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రతి లీటరుకు ప్రోత్సాహకంగా రూ. 4 చెల్లిస్తోందని తెలిపారు. ప్రభుత్వం పాల రైతులకు అనేక సబ్సిడీలను కూడా ఇస్తోందని, పాడి గేదెల కోసం వివిధ బ్యాంకుల నుంచి రుణ సాదుపాయం కూడా కల్పిస్తున్నారని వివరించారు. అనంతరం డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ మురళీధర్రరావు, పశు సంవర్ధకశాఖ జేడీ రఘెత్తమరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఉపసంచాలకుడు కె. కామేష్, జిల్లా సహకార బ్యాంక్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి వి. నాగచెన్నారావు, తదితరులు పాల్గొన్నారు.


