స్వయం ఉపాధి పధకాలు… యువతకు ఆశ కిరణాలు
ఏలూరు, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): పెద్దగా చదువుకోలేదు… కుటుంబ జీవనానికి స్ప్రేయర్ల మరామ్మత్తు షాపులో మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నాడు… ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలనే తపనైతే ఉందిగానీ పేదరికం సహకరించక నిరాశ చెందాడు… ఓ ఐడియా విూ జీవితాల్ని మార్చేస్తుంది అన్నట్లు ఓ స్నేహితుడి సలహా అతని జీవన విధానాన్ని మార్చేసింది.
ఓ స్నేహితుడు ఇచ్చిన మంచి సలహాతో ప్రభుత్వ పధకం గురించి తెలుసుకున్నానని రావూరి సురేష్ చెప్పారు. ప్రభుత్వ పధకంతో అభివృద్ధి చెందిన తీరు అతని మాటల్లోనే… నా పేరు రావూరి సురేష్. దెందులూరు మండలం సత్యనారాయణపురం మా గ్రామం. పేదరికం… కాలే కడుపు… ఇదీ ఒకప్పటి నా జీవితం… కానీ ప్రభుత్వ పధకంతో నా జీవితంలో వెలుగు కిరణాలు నిండాయి. నెలకు రూ. 5 వేలకు స్ప్రేయర్ల దుకాణంలో మెకానిక్‌గా పనిచేసే నేను, నేడు ప్రభుత్వ ప్రోత్సాహంతో స్వంతంగా స్ప్రేయర్ల మరామ్మత్తుల షాపు పెట్టి యజమానిగా మారాను.
ప్రభుత్వ ప్రోత్సాహంతోనే తాను ఆర్ధికంగా అభివృద్ధి సాదించాను. 7వ తరగతి వరకే చదివిన తాను ఏలూరులోని వైయంహెచ్ఏ హాలు సవిూపంలోని స్ప్రేయర్ల మరామ్మత్తు దుకాణంలో మెకానిక్‌గా పనిచేస్తుండేవాడిని. కుటుంబ జీవనానికి రూ. 5 వేలు చాలకపోవడంతో ఇబ్బందులు పడుతూ కాలం నెట్టుకొచ్చాను. అయితే తాను స్వంతంగా స్ప్రేయర్లు రిపేరు షాపును పెట్టుకుని యజమానిగా మారాలని, మరికొందరికి ఉపాధి చూపించే స్ధాయికి ఎ దగాలని పట్టుదలతో ఉండేవాడిని. నా పట్టుదలకు తోడు ప్రభుత్వం అండగా నిలవటంతో నా ఆశలు ఫలించాయి.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న స్వయం ఉపాధి పధకం క్రింద రుణం పొంది నా భవిష్యత్తును మార్చుకున్నాను. నా స్నేహితుడు చెప్పిన సలహాను పాటిస్తూ ఎస్సీ కార్పోరేషన్ అధికారులను సంప్రదించి స్వయం ఉపాధి పధకంలో రుణం మంజూరు చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నాను. ఈ ధరఖాస్తును పరిశీలించిన అధికారులు రుణం మంజూరుకు ఏలూరులోని ఇండియన్ బ్యాంక్‌కు పంపారు.
ఆ బ్యాంకు నాకు రూ. 60 వేలు రుణం మంజూరు చేయడంతో వెంటనే పాత బస్టాండ్ వద్ద క్రొత్తగా స్ప్రేయర్ల రిపేరు షాపును ఏర్పాటు చేసుకున్నానని, నేడు ఉపాధికి కొదవ లేకుండా ఆనందంగా ఉంటున్నానని సురేష్ తెలిపాడు. వ్యవసాయ సీజన్‌లోని ఎనిమిది నెలల్లో నెలకు సుమారు రూ. 30 వేలు సంపాదించి నా స్వంత కాళ్లపై నిలబడే స్ధాయికి చేరానని చెబుతున్నాడు.
అంతేకాదు మరో నలుగురికి ఉపాధి చూపించాననే ఆనందాన్ని వ్యక్తం చేసాడు. నాలాంటి నిరుపేద యువకుల కలలను నెరవేర్చిన, నెరవేరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు అని సురేష్ ఆనందం వ్యక్తం చేసాడు. ఇలాంటివి పరిశీలించే రాష్ట్ర ప్రభుత్వం ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపేందుకు కొత్తగా ఎస్సి., ఎస్టి. ఉపప్రణాళికలు తీసుకు రావడం అభినందనీయం.


