స్వర్ణకారుల సంక్షేమానికి ప్రత్యేకంగా పథకాలు
స్వర్ణకారుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పథకాలను రూపొందిస్తున్నామని చేతి వృత్తుల అభివృద్ధి శాఖ సహాయ సంచాలకులు (అసిస్టెంట్ డైరెక్టర్) డి.వి. శ్రీనాథ్ తెలిపారు. కామాటివీధిలోని కృష్ణమందిరం కల్యాణమండపంలో మంగళవారం ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2015లో చేతి వృత్తుల అభివృద్ధి శాఖలో స్వర్ణకారులను కేంద్ర ప్రభుత్వం చేర్చిందన్నారు. స్వర్ణకారులైన వారందరికి గుర్తింపు కార్డులను ఉచితంగా అందిస్తామన్నారు.
గుర్తింపు కార్డులు పొందిన 18-60 ఏళ్ల లోపు వారికి ఉచితంగా జీవితబీమా సంస్థ ద్వారా ప్రమాద బీమా, పాక్షిక అంగవైకల్యం, సాదారణ మరణానికి రూ.1.50 లక్షల నుంచి రూ.60 వేల లోపు బీమా సౌకర్యం లభిస్తుందన్నారు. ప్రత్యేక స్వర్ణకారులకు నైపుణ్యాభివృద్ధికి శిక్షణను అందించే కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. చేనేత అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రదర్శనల్లో స్టాళ్లను ఏర్పాటు చేసుకుని ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం కల్పిస్తామన్నారు. క్లస్టర్ల ఏర్పాటు ద్వారా స్వర్ణకారులకు అవసరమై భారీ యంత్రాలను సమకూర్చుకునేందుకు తమ సహకారం అందిస్తుందన్నారు.
అర్హులైన వారందరూ గుర్తింపు కార్డులను పొంది ప్రభుత్వం వారు వివిధ రకాలుగా అందిస్తున్న అన్ని విధాల చేయూతను స్వర్ణకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ తమ బ్యాంకు సేవలను స్వర్ణకారుకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నగదు రహిత లావాదేవీల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీవెంకట రమణ గోల్డు జ్యూయలరీ తయారీ సంఘం గౌరవాధ్యక్షులు ఇందుకూరు రమేష్‌కుమార్ ఆచారి, అధ్యక్షుడు దండపాణి సురేష్ ఆచారి, కార్యదర్శి బల్లవోలు రమణయ్య ఆచారి, పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ కార్యనిర్వాహణ కార్యదర్శి పేట మాధవయ్యఆచారి, అఖిల భారత విశ్వకర్మ పరిషత్ జిల్లా అధ్యక్షుడు కళ్యాణ్‌కుమార్ ఆచారి, ఎస్వీఎస్ బట్టీ అధ్యక్షుడు ఖాజన వెంకటశేషయ్య ఆచారి, స్వర్ణమథనం బట్టీ అధ్యక్షుడు పొట్లూరి రామకృష్ణ, స్వర్ణకార పరిషత్ జిల్లా ఆర్కాట్ మురుగేష్ ఆచారి, స్వర్ణకార మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు సుభానీ తదితరులు మాట్లాడారు. పెద్ద ఎత్తున జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన స్వర్ణకారులు పాల్గొన్నారు.


