హక్కుల పరిరక్షణ కోసం రిలేదీక్షలు
- 116 Views
- wadminw
- September 3, 2016
- రాష్ట్రీయం
ఆదిలాబాద్: ఆదివాసీల హక్కులకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాలు ఆందోళన చేస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బేల మండల కేంద్రంలో అధికారుల తీరును నిరసిస్తూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు శనివారంనాటికి పదమూడవ రోజుకు చేరుకున్నాయి. వీరికి మద్దతుగా ఆదిలాబాద్, బేల, జైనత్, తలమడుగు మండలాల్లో ఆదివాసీ సంఘాల నాయకులు, ప్రజలు పాదయాత్ర, ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించి సంపూర్ణమద్దతు ప్రకటించారు.
ఆదివాసీల హక్కులను కాలరాసే విధంగా అధికారులు ఇష్టానుసారంగా ప్రభుత్వ పథకాలను ఇతరులకు మంజూరు చేయడం, నివాస ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రాలను మంజూరు చేస్తూ ఆదివాసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ గత పది రోజులుగా దీక్షలు చేపట్టినా ప్రజాప్రతినిధులు గానీ, ఉన్నతాధికారులు గానీ పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. తమ ఉద్యమాన్ని జిల్లావ్యాప్తంగా కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
ఇప్పటికే అన్ని రంగాల్లో ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా దూరంగా ఉన్న ఆదివాసీలకు అధికారుల పనితీరుతో మరింత నష్టం కలుగుతుందని అన్నారు. తమకు న్యాయం జరిగేంతవరకు ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని తమ హక్కులను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


