హజ్‌యాత్రకు పేరిట రూ.2 కోట్లు వసూలు
- 119 Views
- wadminw
- September 6, 2016
- తాజా వార్తలు
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): హజ్ యాత్రకు తీసుకెళ్తామని సుమారు రూ.2 కోట్లు వసూలు చేసి చేతులెత్తేసిన ట్రావెల్ సంస్థ నిర్వాకులపై హుమాయున్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హుమాయున్‌నగర్ స్టేషన్ ఎదురుగా ఉన్న అజీజియా మసీదు సమీపంలో సయ్యద్ నుస్రత్ అలీ అతని సోదరులు ‘అర్ఫా ట్రావెల్స్’ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. హజ్ యాత్రకు తీసుకెళ్తామని ప్రచారం చేయడంతో సమీప మసీదుకు ప్రార్థనల కోసం వచ్చే వారితో పాటు నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన ముస్లిం సోదరులు సయ్యద్ నుస్రత్ అలీని సంప్రదించారు. మార్చి నెల నుంచి సుమారు 50 మంది అతడిని సంప్రదించగా ఒక్కోక్కరి నుంచి సుమారు రూ.4 లక్షల నగదు, పాస్ పోర్టులు తీసుకున్నాడు. హజ్‌కు పంపించే ప్రక్రియ ప్రారంభించినట్లు నమ్మపలికి వారందరికి వైద్య పరీక్షలు సైతం చేయించాడు.
ఇలా 50 మంది బృందం గత ఆదివారం హజ్‌యాత్రకు వెళ్లాల్సి ఉంది. ఆమేరకు శనివారం ఉదయం నుంచి నుస్రత్ అలీని సంప్రదించేందుకు వారంతా ప్రయత్నించగా ఆయన అందు అందుబాటులో లేరు. ఆదివారం సాయంత్రం నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్‌తో కలిసి బాధితులు హుమాయున్‌నగర్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలి టెలికం కాలనీకి చెందిన విశ్రాంత ఉద్యోగి మహ్మద్ అహ్మదుద్దీన్(59), ఇతర బాధితులు పోలీసులకు జరిగిన మోసంపై లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. నిందితుడు సయ్యద్ నుస్రత్ అలీ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ప్రస్తుతం అతడు నానల్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నుస్రత్అలీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ రవీందర్ వివరించారు.
నాంపల్లి కోర్టులో ప్రాంగణంలో హై సెక్యూరిటీ
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై గతంలో పాతబస్తీలో బార్కస్ ప్రాంతంతో హత్యాయత్నం జరిగిన కేసుపై మంగళవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. కోర్టులో అక్బరుద్దీన్ వాంగ్మూలం ఇచ్చారు. అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం చేసిన వారు కూడా కోర్టుకు వచ్చారు. న్యాయస్థానంలో అక్బరుద్దీన్ పాక్షిక వాంగ్మూలం ఇచ్చారు. తనపై దాడి జరిగిన తీరును వివరించారు. దాడికి పాల్పడిన పదమూడు మందిని కోర్టులో గుర్తించారు. అనంతరం కోర్టు కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. అక్బరుద్దీన్‌తో పాటు నిందితులు కోర్టుకు హాజరైన నేపథ్యంలో కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉదయం భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు అక్కడ భారీ సంఖ్యమో మోహరించారు. ఇదిలావుండగా, హైదరాబాద్ నగరంలోని బోడుప్పల్లో 17 ఏళ్ల సాహితి అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెను ఆస్తి కోసం మేనత్త, మేనమామ హత్య చేశారని సాహితి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మేడిపల్లికి చెందిన సాహితి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మతో కలిసి ఉంటోంది. అయితే మేనమామ నివాసానికి వచ్చిన సాహితి గతరాత్రి బాత్రూమ్లో జారిపడి మృతి చెందినట్లు ఆమె మేనత్త చెప్పటం పలు అనుమానాలకు తావు ఇస్తోంది. అంతేకాకుండా గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా మరో పదిరోజుల్లో సాహితికి మైనార్టీ తీరునున్న నేపథ్యంలో ఆస్తి కోసమే హతమార్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చిన్న జిల్లాలతోనే అభివృద్ధి: ఎమ్మెల్సీ ప్రభాకర్
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): జిల్లాల ఏర్పాటుపై ప్రతిపక్షాలు అవగాహన లేకుండా వ్యతిరేకత తెలుపుతున్నాయని ఎమ్మెల్సీ కె.ప్రభాకర్ మండిపడ్డారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. మంగళవారం టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చిన్న జిల్లాల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు. ప్రభుత్వ పనులను, పథకాలను విమర్శించడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయని దుయ్యబట్టారు. ప్రజా సంక్షేమం కోసం ఏయే కార్యక్రమాలు చేపడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో వాటినే సీఎం కేసీఆర్ ప్రవేశ పెడుతున్నారని వివరించారు. కాగా, అన్ని మతాలు సంఘటితమై మతోన్మాదంపై పోరాడాలని, శాంతి, ప్రేమ, మానవతను పెంపొందించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. చాంద్రాయణగుట్టలో జమాతే ఇస్లామీహింద్ సంస్థ ‘శాంతి-మానవత’ అంశంపై నిర్వహించిన సదస్సులో విభిన్న మతాల గురువులు, విద్యావేత్తలు ప్రసంగించారు. విద్యా గణేశ్ సంస్థ అధిపతి విద్యా గణేశ్భారతి మాట్లాడుతూ అన్ని చెడులకు మూలమైన మద్యాన్ని నిషేధించాలన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం ఆచార్యులు అపూర్వానంద్ ఝా మాట్లాడుతూ మతోన్మాద శక్తులు మైనారిటీ, దళితుల ఆహారపు అలవాట్లు, సంస్కృతిపై పెత్తనం చెలాయిస్తున్నాయన్నారు. అధ్యక్షత వహించిన హమీద్ మహమ్మద్‌ఖాన్ మాట్లాడుతూ జమాతె ఇస్లామీహింద్ మతాల మధ్య మైత్రి కోసం దేశవ్యాప్తంగా ‘శాంతి-మానవత’ ఉద్యమాన్ని చేపట్టిందన్నారు. కేంద్ర కమిటీ సభ్యులు అమీనుల్ హసన్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు హాఫిజ్ రషాదుద్దీన్, హర్బజన్‌సింగ్, బురమ్ అభినవ్, జియువుద్దీన్ నయ్యర్, మలిక్ షారిక్ పాల్గొన్నారు.


