హథీరాం బాబా మఠం ఆస్తులు హం ఫట్
- 128 Views
- wadminw
- September 3, 2016
- రాష్ట్రీయం
తిరుమలేశుని పరమ భక్తాగ్రేశ్వరుడు హథీరాం బాబా మఠం ఆస్తులు కబ్జాకు గురవుతున్నాయి. ఇప్పటికే హథీరాం బాబా మఠానికి చెందిన వేల ఎకరాలు కబ్జా కోరుల కోరల్లో చిక్కి రూపురేఖలు మారిపోయాయి. దాదాపు ఏడు వందల ఎకరాల భూములను కబ్జా చేసిన భూబకాసురులు రాత్రికి రాత్రే కబ్జా చేసిన భూముల్లో వాలిపోయి. తెల్లారగానే కోర్టు ఆదేశాలను తెచ్చుకుని దర్జా వెలగబెడుతున్నారు. ఇప్పటికైనా కోట్ల విలువైన మఠం భూములను కాపాడకపోతే ఈ ఆక్రమణల పరంపర ఇలాగే కొనసాగే ప్రమాదం ఉందని భక్తులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ జాగ కనబడితే కబ్జా గజం భూమి ఉన్నా ఆక్రమణ కబ్జాకోరుల చేతుల్లోకి ఏడు వందల ఎకరాల మఠం భూములు ఇదీ హథీరాం బాబాజీ మఠం భూముల స్వాహా అయిన వ్యవహారం.
వందల సంవత్సరాల చరిత్ర గల హథీరాం బాబాజీ మఠానికి వేల ఎకరాల భూములు ఉన్నాయి. తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో సైతం వందలాది ఎకరాల భూములు ఉన్నాయి. ఇప్పుడా భూముల్లో వందల ఎకరాల కబ్జా కోరుల చేతుల్లో ఆక్రమణకు గురయ్యాయి. కోట్లాది రూపయాల విలువైన ఈ భూములు భారీగా కబ్జాకు గురైనా ప్రభుత్వం, అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోతున్నారు. విజయనగర సామ్రాజ్య హయాంలో ఆలయానికి దక్షిణ భాగాన హధీరాంజీ మఠం నిర్మాణం జరిగింది. చాలా ఏళ్ల వరకు తిరుమల శ్రీవారి ఆలయం హథీరాంజీ మఠం పర్యవేక్షణలోనే ఉండేది.
మఠం నిర్వాహకులే ఆలయంలో అన్ని రకాల కైంకర్యాలు నిర్వహించేవారు. శ్రీవారి దర్శనం కోసం దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి, ఈ మఠానికి దానధర్మాలు ఇచ్చేవారు. అలా ఈ మఠానికి కోట్లాది రూపాయల ఆస్తులు సమకూరాయి. 1933లో శ్రీవారి ఆలయ నిర్వహణ బాధ్యతలు టీటీడీ ఆధ్వర్యంలోకి వెళ్లాయి. అయితే అప్పటికే మఠానికి చెందిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు అన్యాక్రాంతానికి గురయ్యాయి. ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఇప్పటి వరకు సుమారు 700 ఎకరాలు అక్రమణకు గురయ్యాయంటే భూ కబ్జాకోరుల ఆగడాలు ఏ స్థాయిలో శృతి మించాయో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ఇలా ఆక్రమణకు గురైన భూముల ఖరీదు దాదాపు వేయి కోట్ల రూపాయల పై మాటే.
కబ్జా చేసిన మఠం భూముల్లో ఇప్పటికే భవనాలు, కార్యాలయాలు, ఇళ్లు వెలిశాయి. రాత్రికి రాత్రి కబ్జా చేయడం, ఉదయం కల్లా కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకోవడం కబ్జాకోరులకు పరిపాటిగా మారింది. హథీరాం మఠం భూముల కబ్జాకోరుల్లో రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులతో పాటు పోలీసులు, పారిశ్రామికవేత్తలు ఎందరో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు స్వయంగా మఠం సిబ్బంది సైతం ఆక్రమణదారులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వందల ఎకరాలు కబ్జా చేస్తున్నా కబ్జా కోరుల ఆగడాలను మఠం సిబ్బంది గానీ, ప్రస్తుత మఠం కస్టోడియన్గా వ్వవహరిస్తున్న అర్జున్దాసు మహంత్ గానీ ఆపలేకపోతున్నారు. చాలా భూములు లీజులో ఉన్నాయి.
కొన్ని భూములు ఇప్పటికే లీజు ముగిసినా మఠానికి తిరిగి ఇవ్వడం లేదు. లీజుదారులు కూడా కోర్టులను ఆశ్రయించి మఠం భూములను అనుభవిస్తున్నారు. ప్రత్యేక కమిటీ వేసి మఠం భూముల్ని పరిరక్షించాలని స్థానిక బీజేపీ నేతలు కోరుతున్నారు. ఎంత కట్టుదిట్టంగా వ్యవహరించినా ఆక్రమణలను అరికట్టలేకపోతున్నామని, సిబ్బంది కూడా తగినంత లేరని ఉద్యోగులు అంటున్నారు. భూ కబ్జా కోరుల్లో బడా బాబులే ఉన్నారని హథీరాంబాబాజీ మఠం ముఖ్య కస్టోడియన్ అర్జున్ దాస్ మహంతు అంటున్నారు.
భూముల పరిరక్షణకు సాయశక్తులా కృషి చేస్తున్నామని మఠం సూపరింటెండెంట్ శ్రీనివాసులు తెలిపారు. ఓ వైపు మఠంలో సమర్థవంతమైన నిర్వహణ కొరవడడం, మరోవైపు ప్రభుత్వ పర్యవేక్షణ లోపించడంతో మఠం భూములు దోపిడీకి గురవుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వం కల్పించుకుని ఆక్రమణకు గురైన భూములు తిరిగి స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, లేకుండే భవిష్యత్లో హథీరాంజీ మఠం ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉందని భక్తులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


