హెచ్‌పీఎస్‌పై ‘మాధవరం’ మండిపాటు
- 65 Views
- wadminw
- October 4, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్, అక్టోబబర్ 4 (న్యూస్‌టైమ్): పజల అభీష్టం మేరకు శ్మశాన వాటికకు 3.26 ఎకరాలను కేటాయిస్తే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం(హెచ్‌పీఎస్) అభివృద్ధిని అడ్డుకుంటోందని, వారి చేసే అక్రమాలన్నింటినీ బయటపడతానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. శ్యాంలాల్‌బిల్డింగ్ తాతాచారికాలనీ గ్రౌండ్లో స్థానికులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు.
శవాలను కూడా తీసుకెళ్లనీయకుండా, మహిళలకు కనీసం స్నానాలు గదులు కట్టనీయకుండా చేస్తున్నారని హెచ్‌పీఎస్ యాజమాన్యంపై మండిపడ్డారు. రూ.85 లక్షలతో (ఎమ్మెల్యే, జీహెచ్ఎంసీ నిధులు) 3.26 ఎకరాల్లో హిందూ శ్మశానవాటిక అభివృద్ధి పనులు గత నాలుగు రోజుల క్రితం ప్రారంభించిన విషయం విదితమే. అయితే రెండెకరాల స్థలానికి సంబంధించి కోర్టు స్టే ఉందని, పోలీసుల సహాయంతో హెచ్‌పీఎస్ స్కూల్ వారు పనులను నిలుపుదల చేయిస్తున్నారని మాధవరం కృష్ణారావు తెలుసుకున్నారు.
యాజమాన్యం చేస్తున్న అక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి హెచ్‌పీఎస్‌కు కేటాయించిన స్థల లీజును రద్దుచేయాలని కోరతామన్నారు. లీజును రద్దు చేయించి పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి గానీ, లేదా ఇతరత్రా ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు గానీ వినియోగించేలా కృషి చేస్తానని స్థానికులకు హామీనిచ్చారు. ఇక్కడ పాఠశాల డెరైక్టర్ల బంధువులు, కుటుంబసభ్యుల పిల్లలకే సీట్లు పరిమితమని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతో పాటు స్థానికంగా ఉంటున్న వారి పిల్లలకు చోటు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డెరైక్టర్లుగా చెప్పుకుంటున్న వారు కార్లలో తిరుగుతూ బంగ్లాల్లో ఉంటున్నారని, అసలు వారి ఆస్తులపై విచారణ జరిపే విధంగా ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. శ్మశానవాటికకు కేటాయించిన రెండెకరాల స్థలంపై ఉన్న స్టేను త్వరలోనే ఎత్తివేయించి మొత్తం 3.26 ఎకరాలను అభివృద్ధి చేసేవరకు తాను ఈ సమస్యను వదిలేది లేదన్నారు.
హెచ్‌పీఎస్ యాజమాన్య అక్రమాలపై 3, 4 రోజుల్లో అన్ని రకాల పత్రాలను తీసుకుని సీఎం కేసీఆర్ వద్దకు వెళ్తానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెప్పారు. కార్యక్రమంలో బేగంపేట్ కార్పొరేటర్ ఉప్పల తరుణినాయీ, టీఆర్ఎస్ నాయకులు డీవీ నరేందర్‌రావు, సురేష్‌యాదవ్, యాదగిరిగౌడ్, రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.


