హైదరాబాద్‌ను అల్లాడిస్తున్న వరుణుడు!
- 85 Views
- wadminw
- September 22, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): అల్పపీడనం ప్రభావంతో గురువారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఉదయం కాస్త తేరుకున్న నగరాన్ని భారీ వర్షం మళ్లీ ముంచెత్తింది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, పంజాగుట్ట, అమీర్‌పేట, బేగంపేట, సికింద్రాబాద్, అల్వాల్, జీడిమెట్ల, ఎర్రగడ్డ, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నాంపల్లి, హబ్సిగూడ, నారాయణగూడ, హిమాయత్‌నగర్, కూకట్పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, మలక్‌పేట, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. శుక్ర, శనివారాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలకు అనుగుణంగానే భారీ వర్షం నగరాన్ని వణికిస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైన వర్షం అరగంటలోనే నగరవ్యాప్తంగా 2సెంటీమీటర్లు కురిసింది.
వెస్ట్‌మారేడ్‌పల్లి, చిలకలగూడలో 3 సెంటీమీటర్లు, మాదన్నపేట, నారాయణగూడ, ఫీవర్ ఆస్పత్రి, తిరుమలగిరి, శ్రీనగర్ కాలనీల్లో 2సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మంగళ, బుధవారాల్లో కురిసిన భారీ వర్షాలకు నగరం ఇంకా తేరుకోకముందే మళ్లీ వర్షం ప్రతాపం చూపెడుతోంది. ఇప్పటికీ నగరంలోని అనేక కాలనీలు, బస్తీలు వరదనీటిలోనే నానుతున్నాయి. ముంపు ప్రజలు నిత్యావసర వస్తువులు, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ వర్షం మొదలుకావడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం, జీహెచ్ఎంసీ అధికారులు సహాయచర్యలు చేపడుతున్నప్పటికీ బాధితులకు అవి ఏమాత్రం సరిపోవడం లేదు. మాదాపూర్ పోలీస్టేషన్ నుంచి సైబర్ టవర్స్ వెళ్లే మార్గంలో రోడ్లు దెబ్బతినడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతంలో బుధవారం రాత్రి నుంచే వర్షం జోరుగా కురిసింది. గురువారం ఉదయం నుంచి ఆయా మార్గాల్లో ట్రాఫిక్ నత్తనడకన సాగింది. ప్రధానంగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36, 1, 2, 3, 10, 12లో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. కొన్నిచోట్ల రోడ్లకు మరమ్మత్తులు చేపట్టడంతో వాహనాలను దారి మళ్లించారు. మాదాపూర్ నుంచి వచ్చే వాహనాలను జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10 మీదుగా మళ్లించారు. శాంతి భద్రతల పోలీసులు కూడా ట్రాఫిక్‌ను మళ్లించేందుకు రంగంలోకి దిగారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని లింగంపల్లి, తారానగర్, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, గౌలిదొడ్డి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చందానగర్ వద్ద జాతీయ రహదారిపై వరదనీరు ప్రవహించింది. మాదాపూర్, శిల్పారామం, గౌలిదొడ్డి తదితర ప్రాంతాల్లో రహదారులపైకి వరదనీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, కవాడిగూడ తదితరప్రాంతాల్లో దట్టమైన మేఘాల కారణంగా చీకట్లు అలుముకున్నాయి. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు.
కుండపోత వర్షంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నగర శివారులోని చర్లపల్లి, కాప్రా, ఈసీఐఎల్, నాచారం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో కాప్రా చెరువులోకి భారీగా వరదనీరు వచ్చి ,చేరుతోంది. చెరువు అలుగు నుంచి నీరు ప్రవహిస్తుంది. రోడ్లన్నీ జయమయ్యమయ్యాయి. ఇటీవల కురిసిన భారీ వర్షానికి తార్నాక నుంచి లాలాపేట వెళ్లే దారిలో ఉన్న బ్రిడ్జి ప్రమాదకర స్థితికి చేరడంతో ఇటీవలే అధికారులు కూల్చివేశారు. దీంతో మౌలాలి, ఈసీఐఎల్ వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత వర్షం కారణంగా వాహనదారుల కష్టాలు రెట్టింపయ్యాయి. మలక్‌పేట నియోజకవర్గంలో గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. చాదర్‌ఘాట్, ఓల్డ్‌మలక్‌పేట, సైదాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో చాదర్‌ఘాట్-దిల్సుఖ్నగర్, నల్గొండ చౌరస్తా-సైదాబాద్, దోబీఘాట్ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.


