హైదరాబాద్‌ను విడగొట్టడంపై మంత్రి నాయిని గుర్రు
- 60 Views
- wadminw
- October 4, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్, అక్టోబబర్ 4 (న్యూస్‌టైమ్): ముసాయిదా నోటిఫికేషన్లో ప్రకటించిన 17 జిల్లాలు కాకుండా మరో నాలుగు ప్రాంతాల నుంచి వచ్చిన జిల్లా ఏర్పాటు డిమాండ్లను పరిశీలించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి కమిటిని ఏర్పాటు చేశారు. ఎంపీ కె.కేశవరావు నాయకత్వంలోని ఈ కమిటీలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు జగదీష్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, జోగు రామన్న సభ్యులుగా ఉంటారు. ముసాయిదా నోటిఫికేషన్లో 17 కొత్త జిల్లాలను ప్రభుత్వం ప్రతిపాదించింది.
జనగామ, సిరిసిల్ల, గద్వాల, అసిఫాబాద్ జిల్లాల ఏర్పాటు కోసం ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి డిమాండ్లు వచ్చాయి. ఈ డిమాండ్లు పరిశీలించాల్సిందిగా ప్రభుత్వం హైపవర్ కమిటీని కోరింది. ప్రజల డిమాండు మేరకు ఈ నాలుగు జిల్లాలు ఏర్పాటు అంశాలపై కమిటీ అధ్యయనం జరిపి ఈ నెల7వ తేదీ మధ్యాహ్నంలోగా నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కొత్త జిల్లాల పరిశీలనకు అత్యవసర సమావేశాలు నిర్వహించుకుని వేగంగా ప్రక్రియను ముగించాలని హైపవర్ కమిటీని ముఖ్యమంత్రి కోరారు.
మరోవైపు, హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా మంగళవారం ఆయన పలువురు నేతలతో తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజల డిమాండ్ల మేరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. హుజూర్‌నగర్‌కు రెవెన్యూ డివిజన్‌కు ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు.
చారిత్రాత్మకంగా బహుగోళికంగా విద్యాపరంగా, వ్యవసాయ రంగపరంగా హుజూర్‌నగర్‌కు రెవెన్యూ డివిజన్‌కు ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని, మ్యాప్ ద్వారా సిఎస్ రాజీవ్‌శర్మకు వివరించినట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఉండాలితప్ప రాజకీయకోణంలో చూడవద్దని అన్నారు. ప్రజల అభ్యర్ధనను, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ చేస్తే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని రాజీవ్‌శర్మకు తెలిపినట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
ఇదిలావుండగా, హైదరాబాద్ జిల్లాను ఒక్కటిగానే ఉంచాలని, విడగొట్టవద్దని తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కోరారు. కొత్త జిల్లాలపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీకి ఆయన నివేదిక సమర్పించారు. ముఖానికి ముక్కు ఎంత ముఖ్యమో తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ అంతే ముఖ్యమని అన్నారు. తన గ్రామం నల్గొండ జిల్లాలోని నేరడిగొమ్మును మండలం చేయాలని కోరితే ముఖ్యమంత్రి ఆమోదించారని చెప్పారు. దేవరకొండను జిల్లాగా చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు, బంజారాహిల్స్‌లోని ఎంపీ కె.కేశవరావు నివాసంలో మంగళవారం ఉన్నత స్థాయి కమిటీ సమావేశమైంది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లు సహా ఏఏ మండలాలతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న అంశాలను కమిటీ పరిశీలించింది. ముసాయిదా నోటిఫికేషన్లో ప్రకటించిన 17 జిల్లాలు కాకుండా మరో నాలుగు ప్రాంతాల నుంచి వచ్చిన జిల్లా ఏర్పాటు డిమాండ్లను పరిశీలించడానికి సీఎం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఎంపీ కె.కేశవరావు నాయకత్వంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు జగదీష్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, జోగు రామన్న సభ్యులుగా ఉన్న విషయం తెలిసిందే.


