హైదరాబాద్‌లో హై అలర్ట్
- 81 Views
- wadminw
- September 22, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. మంత్రి కె.టి. రామారావు, జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ జనార్దన్‌రెడ్డి, మేయర్ బొంత రామ్మోహనరావు తదితరులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పాత భవనాలను ఖాళీ చేయించాలని అన్నారు. నాలాలకు ఇరువైపులా ఉన్న వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, విద్యాసంస్థలకు, ఆఫీసులకు సెలవు ప్రకటించాలని జనార్దన్‌రెడ్డి అధికారులకు సూచించారు. మరోవైపు, హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరదనీరు పెరిగింది. లుంబిని పార్కులోకి వరదనీరు చేరింది. 15 ఏళ్ల తర్వాత పార్కులోకి వరదనీరు మళ్లీ వచ్చిందని, ఔట్‌ఫ్లో పెంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
కేవలం గంట వ్యవధిలో భాగ్యనగరంలో మూడు సెంటీమీటర్ల వర్షం పడింది. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాధారణంగా ఉన్న వాతావరణం అ తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, పెరుపులతో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, అమీర్‌పేట, బాలానగర్, షాపూర్ నగర్లో జడివాన కురిసింది. నగర శివారు ప్రాంతంలోనూ వర్షం ప్రతాపం చూపించింది. ఇప్పటికీ పలు కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. తాజా వర్షంతో ఆయా ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. నీటి ముంపులో చిక్కుకున్న నిజాంపేట బండారులేఔట్లో జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నిజాంపేటలో ఇప్పటికీ విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు అతలాకుతలం అయిన భాగ్యనగరంపై వరుణుడు మరోసారి ప్రతాపం చూపిస్తున్నాడు.
ఇప్పటికే వర్ష బీభత్సానికి పలు కాలనీలు నీట మునగగా ఈరోజు కురుస్తున్న కుండపోత వర్షానికి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కోఠి, నాంపల్లి, దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్, సెక్రటేరియట్, హిమాయత్‌నగర్, ఈసీఐఎల్, కుషాయిగూడ, ఉప్పల్, తార్నాక, నిజాంపేట్, అల్వాల్, పంజాగుట్ట, జీడిమెట్ల, బోయిన్పల్లి, వనస్థలిపురం, బాలానగర్, కుత్బుల్లాపూర్, షాపూర్‌నగర్, చింతల్, జీడిమెట్ల, కూకట్‌పల్లిలో భారీ వర్షం కురుస్తోంది. ఆగకుండా కురుస్తున్న వర్షంలో జనం అవస్థలు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నగరం అంతా జలదిగ్బంధంలోనే ఉండిపోయింది. రోడ్లపైన నిలిచిన నీరు ఇంకా తొలగించకముందే మళ్లీ వర్షం కురుస్తోంది. నాలాలన్నీ పొంగిపొర్లుతున్నాయి.
లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నిన్న కురిసిన వర్షానికి కాలనీలన్నీ నీటమునగగా మరోసారి ఇదే కుండపోత వర్షానికి హైదరాబాదీలంతా భయబ్రాంతులకు గురవుతున్నారు. డాబాలపైకి ఎక్కి తలదాచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కురిసిన వర్షానికి ఇళ్లలోకి నీరు చేరడంతో నిత్యావసర వస్తులు నీట మునిగాయి. మరోసారి వర్షం పడుతుండటంతో నగర ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. కేవలం పది నిమిషాల్లోనే కుండపోత వర్షంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు భారీగా కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షంతో నగరంలోని అన్ని ప్రాంతాలు జలమయమవుతున్నాయి. నాలాలోని నీరు బయటకు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో కాలనీల్లోకి చొచ్చుకు వచ్చే పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు హుస్సేన్‌సాగర్ పరిస్థితి దారుణంగా ఉంది. ఒక్కసారిగా కుండపోత వర్షం కురుస్తుండటంతో ఎగువప్రాంతాల నుంచి వర్షపు నీరు హుస్సేన్‌సాగర్‌లోకి వెలుతోంది. హుస్సేన్‌సాగర్ నుంచి వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు మార్గం చాలా తక్కువగా ఉంది. ఔట్‌ఫ్లో పెంచేందుకు అధికారులు యత్నిస్తున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని జీహెచ్ఎసీ కమిషనర్ తెలిపారు. అయినప్పటికీ వరద నీరు అధికంగా వస్తుండటంతో హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మారింది. దీంతో చుట్టపక్కల కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. మరోపక్క వర్షాలపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ వర్షాలపై రివ్యూ నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయక చర్యలు అందజేయాల్సిందిగా సీఎంతో పాటు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలని ఆదేశించారు.


