‘హోదా’కు తిలోదకాలు!
అంతా అయిపోయింది. 5 కోట్ల తెలుగు ప్రజలు ఏదైతే వద్దనుకున్నారో అదే జరిగింది. ఏదైతే కావాలనుకున్నరో దానికే తిలోదకాలిచ్చాయి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా మొన్నీమధ్యే ప్రకటించేసింది. భావితరాలు పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతయ్యాయి. విభజన కష్టాలతో సతమతమౌతున్న రాష్ట్రానికి సంజీవని వంటి ప్రత్యేక హోదా ఆశను సమాధి చేశాయి. 2014 ఎన్నికల మెనిపేస్టోలో పెట్టి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని పట్టపగలు దొంగ నాటకాలడుతూ ప్రజలను ఉత్కంఠకు ఎదురుచుస్తుంటే చావు కబురు రాత్రి సయయంలో చిలగా వినిపించాయి.
కలిసి పోటీ చేసిన బీజేపీ, తెలుగుదేశం పార్టీలు ఎన్నికల సభల్లో ప్రత్యేకంగా ఊదరగొట్టి ప్రత్యేక హోదాకు మంగళం పాడేశాయి. ప్రత్యేక హోదా ఇవ్వలేమని, విభజన చట్టం హామీలనే అమలు చేస్తున్నామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదన్న కేంద్రం ప్రకటనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యతిరేకించకపోగా జైట్లీ మొక్కుబడి ప్రకటనపైనే సుదీర్ఘంగా మాట్లాడడమే కాకుండా తాజాగా నిన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫోన్ చేసి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేశారు. దీనిని బట్టి కేంద్రంతో కలిసి సీఎం చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను దారుణంగా వంచించిన విషయం తేట తెల్లమైపోయింది.
ప్రత్యేక హోదా సాధ్యం కాదని పార్లమెంట్లో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చెబుతుంటే రక్తం మరిగిపోయిందన్న చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాకు చరమ గీతం పాడేసి రోజంతా అదే జైట్లీతో ప్యాకేజీ ముచ్చట్లు సాగించారు. ప్రకటన పాఠాన్ని ముందుగా చంద్రబాబుకు పంపి ఆయన ఆమోదించిన తర్వాతనే జైట్లీ ప్రకటించారని తెలుస్తోంది. అయితే పైకి మాత్రం ప్రత్యేక హోదా ప్రకటిస్తానంటేనే ఢిల్లీకి వస్తానని చంద్రబాబు నాటకాలు ఆడారని ప్రచారం సాగింది. చివరకు ప్రత్యేక హోదా లేదని ప్రకటించి ప్రత్యేక ప్యాకేజీ కూడా లేదని తేల్చేసి కేంద్రం చేతులు దులుపుకుంది. ఆంధ్రప్రదేశ్‌కి ఏదో ప్రత్యేకంగా ప్రకటించబోతున్నారంటూ హస్తినలో రోజంతా హడావిడి నడిచింది.
చంద్రబాబుతో ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్ ఫోన్లో సంభాషించారు. ఆ నేపథ్యంలో మెరుగైన ప్యాకేజీ కోసం కేంద్రంతో లాబీ చేస్తున్నారని మీడియాలో ప్రచారం కూడా ఉవ్వెత్తున జరిగింది. ప్యాకేజీపై కేంద్రప్రభుత్వానికి, చంద్రబాబుకు మధ్య ఏకాభిప్రాయం కుదరిందని, చంద్రబాబుతో చర్చించే ప్యాకేజీకి కేంద్రం తుదిరూపు ఇస్తున్నదని చివరికి ప్రచారం విస్తృతం చేశారు. సుజనాచౌదరి, సీఎం రమేశ్, కొనకళ్ల నారాయణ తదితరులు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీతో చర్చలు జరిపారు. తొలుత సాయంత్రం 6.30 గంటలకు జైట్లీ ప్రకటన ఉంటుందన్నారు. తర్వాత అది రాత్రి 8.00 గంటలకు మారింది. చివరకు 11.00 గంటలకు విలేకరుల సమావేశం జరిగింది.
అరుణ్‌జైట్లీ ప్రకటించే సమయంలో అక్కడ చంద్రబాబు కూడా ఉండాలని కేంద్రం భావించింది. అయితే అందుకు చంద్రబాబు సిద్ధపడలేదు. హోదా ప్రకటిస్తామని చెబితేనే తాను ఢిల్లీ వస్తానని చంద్రబాబు అన్నట్లుగా మీడియాలో ప్రచారం చేయించారు. వాస్తవానికి చంద్రబాబు చెప్పినట్లుగానే, ఆయన ఆశించిన విధంగానే జైట్లీ ప్రకటన ఉన్నపుడు జైట్లీ ప్రకటన చేసే సమయంలో అక్కడ ఉండడానికి చంద్రబాబుకు అభ్యంతరం ఎందుకో బీజేపీ నాయకులకు అర్ధం కాలేదు. ప్రత్యేక హోదా కోసం ప్రజలలో భావోద్వేగాలు పతాకస్థాయిలో ఉన్న ప్రస్తుత సమయంలో బీజేపీపైనే జనాగ్రహం ఉండాలనేది చంద్రబాబు వ్యూహంగా కనబడుతోంది. తాను చివరి నిమిషం వరకు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తూనే ఉన్నానని, కేంద్రమే ఈ మొక్కుబడి ప్రకటన చేసిందని ప్రచారం చేయించి తప్పుకోవాలనేది చంద్రబాబు పథకంగా కనిపిస్తోంది.
అయితే ప్రత్యేక హోదా లేదని ప్రకటించడానికే కేంద్రమంత్రులు పరిమితమయ్యారు. మరోవైపు, విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేస్తున్నామని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. అరుణ్‌జైట్లీ, వెంకయ్య చెప్పిన అంశాలలో కొత్తవి ఏవీ లేవని, అన్నీ విభజన చట్టంలో ప్రస్తావించినవేనని విశ్లేషకులంటున్నారు. ఆ హామీలకు దేనికెంత అవుతుందో తెలుపుతూ వాటి గురించి వెబ్సైట్లో కూడా పెట్టారు. విభజన చట్టం హామీలన్నీ అమలు చేయాలంటే దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు మనకు కేంద్రం నుంచి రావలసి ఉంటుందని అంచనా.
ప్రత్యేక హోదా కన్నా కేంద్రం ప్రకటించబోతున్న ప్యాకేజీయే మెరుగైనదంటూ రెండింటినీ ఒకదానికొకటి ప్రత్యామ్నాయమన్నట్లుగా ప్రచారం సాగించారు. కానీ విభజన చట్టంలోని హామీలన్నిటినీ అమలు చేస్తూనే ప్రత్యేక హోదా ఇస్తామన్నది కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాట. అవే హామీలతో తెలుగుదేశం, బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మరీ ఓట్లడిగాయి. ఇపుడు అదే వాగ్దానానికి ఆ రెండు పార్టీలు తిలోదకాలిచ్చేశాయి. ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలను దేనితోనూ పోల్చలేమని నిపుణులంటున్నారు.
ప్రత్యేకహోదాతో వచ్చే పన్ను రాయితీల వల్ల వచ్చే పరిశ్రమల సంఖ్యను, ఉపాథి అవకాశాల సంఖ్యను అస్సలు అంచనా వేయలేమని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సహజవనరుల విస్తృతి దృష్ట్యా ప్రత్యేకహోదా ఉంటే అనతికాలంలోనే రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుందని వారంటున్నారు. విభజన చట్టంలోని హామీలకే నిధులు అంచనా వేసి వాటినే ప్యాకేజీగా ప్రకటిస్తే రాష్ట్రానికి అదనంగా వచ్చే ప్రయోజనమేమీ లేదని వారు పేర్కొంటున్నారు. కలసి పోటీ చేసిన బీజేపీ, తెలుగుదేశం ఎన్నికల ప్రచారసభల్లో ప్రత్యేక హోదాపై ఊదరగొట్టాయి. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారపగ్గాలు చేపట్టిన తర్వాత హోదాను గాలికొదిలేశాయి.
ప్రత్యేక హోదా అనేది పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కి లభించిన హక్కు. కానీ చంద్రబాబునాయుడు ఏనాడూ అందుకోసం కేంద్రంపై ఒత్తిడి చేసిన పాపాన పోలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడి కాశ్మీర్ పర్యటన సందర్భంగా ఆ రాష్ట్రానికి రూ.70 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. బీహార్ పర్యటనలో ఆ రాష్ట్రానికి రూ. 1.65లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. కేంద్రంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇలాంటి ప్రత్యేక ప్యాకేజీ ఏమన్నా సాధించారా అంటే లేదు. ప్రధాని తలచుకుంటే అది అసాధ్యం కాదు కదా?
కానీ మనకు ఇప్పటి వరకు అలాంటి అదనపు ప్రయోజనమేమీ లభించలేదు. విభజన చట్టం హామీలు మన హక్కు. ప్రత్యేక హోదా మనకు పార్లమెంటు సాక్షిగా లభించిన హామీ. అలా కాకుండా ప్రత్యేక హోదాకు మంగళం పాడేసి అంతకన్నా మెరుగైనదంటూ విభజన చట్టంలోని హామీలకు ప్యాకేజీ ముసుగేసి ప్రకటించడం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినట్లు కాదా? మొత్తంమీద ఈ హోదా పాపం మిత్ర పక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీకే తగులుతుంది.


