‘హోదా’పై ఎప్డీయే వీధి నాటకం?
తాజాగా కేంద్రమంత్రి సుజనా చౌదరి ప్రత్యేక హోదాపై ఓ సంచలన ప్రకటన చేశారు. త్వరలో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానమంత్రి విదేశీ పర్యటనను నుంచి తిరిగి రాగానే ఈ ప్రకటన ఉంటుంది అని. కానీ తాజా పరిణామాలను గమనిస్తే ఇది కేవలం ఓ వీధి నాటకమేనని ప్రజలను మభ్య పెట్టేందుకే చంద్రబాబు డైరక్షన్లో కేంద్ర మంత్రి సుజనా చౌదరి నాయకత్వంలో ఢిల్లీలో జరుగుతున్నదంతా ఈ నాటకానికి తెర తీశారట. ఒకవైపు స్విస్ చాలెంజ్, మరోవైపు ఓటుకు నోటు వ్యవహారాల్లో కోర్టులు ఇస్తున్న తీర్పులతో సతమత మౌతున్న చంద్రబాబు పరువు కాపాడుకోవడం, ప్రజల దృష్టి మళ్లించడం కోసం ప్రత్యేక హోదా పేరుతో ఢిల్లీలో ప్రత్యేక హోదా పేరుతో దొంగ నాటకాలాడుతున్నారు! రెండున్నరేళ్లుగా చంద్రబాబు ప్రత్యేక హోదాపై ఢిల్లీ నాయకులను అడిగిన పాపాన పోలేదు.
ఇకపోతే మరోవైపు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామని కేంద్ర సర్కార్ చెబుతున్న సంగతి విదితమే. ఇక ప్రత్యేక హోదా సంజీవని కాదు అని వ్యంగ్యంగా మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రంలో హోదా పెరుగుతున్న డిమాండ్‌లో భాగంగానే స్వరం మార్చారు. ఓటుకు నోటు కేసులలో పునర్విచారణకు ప్రత్యేక కోర్టు ఆదేశించగానే మళ్లీ కేంద్రం ముందు మరోసారి మోకరిల్లారు. ప్రత్యేక హోదాపై చర్చలు జరుపుతున్నట్లు బిల్డప్ ఇచ్చారు. మరోవైపు కేంద్రం కొన్ని ప్రతిపాదనలతో ముసాయిదా తయారు చేసిందని అవన్నీ హైదా కన్నా ఎక్కువగానే ఉంటాయని అనుకూల మీడియాలో ప్రచారం చేయించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలుగుతామని మంత్రుల చేత రాజీనామా చేయిస్తామని అల్టిమేటమ్ జారీ చేయడంతో పాటు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి అనేక మార్గాలున్నా వాటిని వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం దాటవేత దొరణి ఎంచుకోవడం నిజంగా మోసపూరితమే. రాష్ట్రానికి 1.60 లక్షల కోట్ల రూపాయల నిధులిచ్చినట్లు కేంద్రం ప్రభుత్వం చెబితే ఎక్కడిచ్చారు?
రోడ్లకు ఇచ్చిన నిధులన్నీ కలిపి చెబుతున్నారని, కేంద్రం మనకకు అన్యాయం చేసిందని చంద్రబాబు ఈ మధ్య కాలంలో కొన్ని ప్రకటనలు చేశారు. ఇక ఓటుకు నోటు కేసులో ఊరట లభించగానే అలాంటి హుంకరింపులు వదిలేశారు. కేసు నుంచి బైటపడటం కోసమే, ఏవో కొన్ని ప్రతిపాదనలతో ఓ మెమోరాండం తీసుకుపోయి కేంద్ర మంత్రులతో, బీజేపీ నేతలతో భేటీలు జరిపి హడావిడి చేశారు. కోర్టు అదేశాలతో ఓటుకు నోటు కేసులో పునర్విచారణ జరగబోతోందన్న భయంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్యాకేజీకి కొన్ని ప్రతిపాదనలు చేసి వాటిని కేంద్రం దృష్టికి తెచ్చే బాధ్యతను సుజనా చౌదరికి సీఎం చంద్రబాబు అప్పగించారని తెలుస్తోంది. తీరా అవన్నీ పాత ప్రతిపాదనలేనని, కొత్తవేవీ లేవని అధికారులంటున్నారు.
రాష్ట్రానికి ఇస్తున్న నిధులు, విభజన చట్టంలోని హామీల అమలుకు ప్రతిపాదనలతో కూడిన ప్రకటనే కేంద్రం ఇచ్చే ప్యాకేజీ అని కొందరు బ్యూరోక్రసీలు భావిస్తున్నారు! అయితే ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఇస్తున్న నిధులను 90 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందట! ప్రస్తుతం కేంద్రం ప్రాయోజిత పథకాలకు కేంద్రం 60 శాతం నిధులు ఇస్తుండగా రాష్ట్రం 40 శాతం నిధులను భరించాల్సి వస్తోంది. ఇందుకు బదులు కేంద్రమే 90 శాతం నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ విధంగా ఇస్తే కేంద్రం నుంచి అదనంగా ఏడాదికి 3,000 కోట్ల రూపాయలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. దీనిని ఐదేళ్ల పాటు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదని తెలుస్తోంది.
విదేశీ ఆర్థిక సాయం ప్రాజెక్టుల్లో 90 శాతం కేంద్రం భరించాలన్న రాష్ట్ర ప్రతిపాదనను కూడా ముందుగానే కేంద్రం తోసి పుచ్చింది. ఇకపోతే పారిశ్రామిక రాయితీల కోసం ఏడాదికి రూ. 500 కోట్ల చొప్పున ఐదేళ్ల పాటు ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనిపై కూడా కేంద్రం ఇంకా అంగీకారం తెలపలేదు. వెనుక బడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఏడాదికి జిల్లాకు 50 కోట్ల రూపాయల చొప్పున ఏడు జిల్లాలకు 350 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం కొనసాగించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇది కొత్తదేమీ కాదు ఇప్పటికే గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఏడు జిల్లాలకు 700 కోట్ల రూపాయలను కేంద్రం ఇచ్చింది. ఆ నిధులను ఆ జిల్లాలకు ఖర్చు చేయనే లేదు.
వెనుకబడిన జిల్లాలకు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇచ్చిన 700 కోట్ల రూపాయల్లో ఇప్పటికి కేవలం 14.56 కోట్ల రూపాయలనే ఖర్చు చేసినందున ఈ ఆర్ధిక సంవత్సరంలో 350 కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించినప్పటికీ కేంద్రం విడుదల చేయలేదు. ఇక రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు సంబంధించి సవివరమైన ప్రాజెక్టు నివేదికను డిజైన్లను పంపిస్తేనే తదుపరి నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. తాత్కాలిక రాజధాని నిర్మాణాలకు నిధులు ఇవ్వబోమని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం ఇచ్చిన 1,050 కోట్ల రూపాయల వినియోగ పత్రాలను పంపించేందుకు వీలుపడని పరిస్థితి నెలకొంది. ఈ నిధులను శాశ్వత రాజధాని భవనాలకు వినియోగించిన తరువాత ఆ వినియోగ పత్రాలను పంపిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇస్తామన్న రూ. 450 కోట్లను కేంద్రం విడుదల చేస్తుందని తెలుస్తోంది.
మొత్తంమీద హస్తినలో ప్రత్యేక హోదాను పక్కనపెట్టి ప్యాకేజీ నాటకానికి తెర తీసిందనడంలో సందేహం లేదు. ఇదిలావుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేనట్టేనా? భారీ ప్యాకేజీతోనే ఏపీ ప్రజలను కేంద్రం మెప్పిస్తుందా? ప్రత్యేక హోదా కంటే భారీ ప్యాకేజీతోనే మెరుగైన మేలు జరుగుతుందన్న మాటలో వాస్తవం ఉందా? ఇంతకీ ప్రత్యేహోదా బెటరా? లేక భారీ ప్యాకేజీ సూపరా? ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేంద్రం ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. హోదా కంటే మించి ప్యాకేజీని ఏపీకి ఇచ్చేందుకు కేంద్రం కసరత్తుల్లోకి దిగిపోయిందట. ఈ విషయమై మూడు నాలుగు రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబుతో, కేంద్రమంత్రి సుజనా చౌదరితో కేంద్రమంత్రులు జోరుగా సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రత్యేక హోదా బదులు అంతకు మించిన ప్యాకేజీ ఇస్తామని కేంద్రమంత్రులు చంద్రబాబుకు, సుజనాకి చెప్పినట్లుగా తెలుస్తోంది.
హోదాకు బదులు ఏపీకి ఇచ్చే ప్యాకేజీని కేంద్రం సిద్ధం చేస్తోందని, ఇందుకు సంబంధించి ఇటీవల మరింత కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. ప్యాకేజీ పైన కసరత్తు నేపథ్యంలోనే కేంద్రమంత్రులు, చంద్రబాబు, సుజనలతో చర్చలు జరుపుతోంది. అమరావతికి 5 వేల కోట్ల రూపాయల వరకు ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేనందున, అదేవిధంగా భారీ ప్యాకేజీ ఇవ్వాలని భావిస్తున్నందున ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం 4 వేల కోట్ల రూపాయల నుంచి 5 వేల కోట్ల వరకు ప్రత్యేకంగా కేటాయించాలని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది. ప్రత్యేక ప్యాకేజీకి అధిష్టానం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని తెలుస్తోంది. ఏపీ కోసం ఇచ్చే హామీలు ఇలా ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీకి రెవెన్యూ లోటు భర్తీ చేయడం.
ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీల కన్నా మెరుగైనవి ఇవ్వడం. రాజధాని అమరావతి నిర్మాణానికి 4 వేల రూపాయల నుంచి 5 కోట్ల ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం వంటి హామీలు ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ బీజేపీ నేతలతో చర్చలు ప్రత్యేక హోదా బదులు భారీ ప్యాకేజీ విషయమై కసరత్తు చేస్తున్నామని, తుది దశకు చేరుకుందని ఏపీ బీజేపీ నేతలతోను అధిష్టానం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఏం చేయాలో ఏపీ నేతలతో చర్చిస్తున్నారని తెలుస్తోంది. అయితే హోదా విషయంలో ఎట్టి పరిస్థితుల్లోను రాజీ పడే ప్రసక్తి లేదని సీఎం చంద్రబాబు అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు, రాజధానికి నిధులు, ఆర్థిక లోటు భర్తీ, బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ కావాలని బాబు కోరుతున్నారు.
అయితే ప్రత్యేక హోదాను మరిపించే మెగా ఫ్యాకేజీతో ఏపీ ప్రజలను సంతృప్తి పరచాలన్న నిర్ణయంతో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం చెబుతున్న ఆ భారీ ప్యాకేజీ తీసుకోవాలా? లేక ప్రత్యేకహోదా తీసుకుంటేనే మేలు జరుగుతుందా? రెండింటిలో ఏదీ బెటర్ అనే సందిగ్ధత పలు పార్టీల నేతలతో పాటు ప్రజల్లోనే నెలకొని ఉంది. ప్రత్యేక హోదా వల్ల ప్రత్యేక లాభాలు, సదుపాయాలు పొందుతున్న విషయాలను ఒకసారి పరిశీలిస్తే, దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ప్రత్యేకహోదా రాష్ట్రాలకు కేంద్ర గ్రాంట్లు 90 శాతం వరకు వస్తాయి. 10 శాతం మాత్రమే లోన్ వస్తుంది. గ్రాంట్ల ద్వారా వచ్చిన సొమ్మును తిరిగి చెల్లించనక్కర్లేదు. లోన్ ద్వారా ఐతే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాల్లోని పరిశ్రమలకు భారీగా రాయితీలు లభిస్తాయి.
100 శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా 100 శాతం రాయితీ ఉంటుంది. పన్ను మినహాయింపులు, ప్రైట్ రీయింబర్స్ మెంట్లు దక్కితే పారిశ్రామికవేత్తలు రెక్కలు కట్టుకొని వచ్చి వాలిపోతారు. ప్రత్యేక హోదాతో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వస్తాయి. అంతేకాదు భారీ స్థాయిలోనే ఉద్యోగవకాశాలు సమకూరుతాయి. పన్నురాయితీలు, ప్రోత్సహకాల వల్ల కొనుగోలు చేస్తున్న అనేక వస్తువుల ధరలు తగ్గుతాయి. కరెంటు చార్జీలు కూడా తగ్గుతాయిది. వీటితో పాటు మరికొన్ని ప్రయోజనాలు కూడా హోదాతో పొందవచ్చు. ప్రత్యేకహోదా వల్లే ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో రెండు వేల పరిశ్రమలు వచ్చాయి. దాంతో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి.
వెనకబడిన రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌కు ప్రత్యేకహోదా వల్ల పది వేల పరిశ్రమలు వచ్చాయి. అలాంటిది 5 కోట్ల ప్రజానీకం గల 972 కి.మీ. సముద్రతీరం ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లభిస్తే అది పెద్ద సంజీవనే అవుతుందని ఏపీ ప్రజలు అంటున్నారు. నిజానికి ప్రత్యేక ప్యాకేజీ కావాలని ఏపీ ప్రజలంతా కోరుకుంటున్నారు. ప్రత్యేక ప్యాకేజీ వస్తే రాష్ట్రంలో తమ జీవితాలు బాగుపడుతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం హోదా కంటే భారీ ప్యాకేజీ అంటూ రెడీ అవుతుండటం చర్చనీయాంశమవుతోంది. మొత్తానికి కేంద్రం అధికారికంగా వెలువరించే చివరి నిర్ణయం ఏముంటుందనే దానిపైనే ఏపీ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
తమ మనసును ఏ మాత్రం నొప్పించినా వారికి కూడా కాంగ్రెస్ లాంటి గతే పట్టించాలని ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది వాస్తవం. ప్రత్యేక హోదా గురించి గట్టిగా ఉద్యమం లేచేలా ఉన్న తరుణంలో ప్యాకేజీ భూటకంతో ఏపీ ప్రజలని చంద్రబాబు ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం మభ్యపెట్టే పనిలో బిజీగా ఉన్నారు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సుజన చౌదరి నోటి వెంట ఈ మధ్య ప్యాకేజీ అనే పదం విపరీతంగా వినిపిస్తోంది. ప్రత్యేక హోదా లేదు, ఇవ్వలేం అని డైరెక్ట్‌గా చెప్పకుండా హాదా కంటే కూడా ప్యాకేజీ నే గొప్ప, అధికం, ఉపయోగకరం అనే విధంగా ఉంటున్నాయ సుజన మాటలు. హోదా రాకపోతే ఏముందు, దానికంటే అదుర్స్ అనిపించే ప్యాకేజీ మనకి రాబోతోంది అని సుజనా స్వయంగా అంటున్నారు.
దీన్ని టీడీపీ మీడియా ఫుల్‌గా కవర్ చేస్తూ జనాలతో హోదా అనే మాట మర్చిపోయేలా చెయ్యడానికి చాలా కృషి చేస్తోంది. హోదానా, ప్యాకేజా అనే విషయాలు పక్కన పెడితే ఈ రెండింటి గురించి మాట్లాడుతున్న కేంద్ర మంత్రి సుజనా చౌదరిని ఎంతవరకూ నమ్మచ్చు అనేది ప్రశ్న. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన కేంద్ర మంత్రే కావచ్చు కానీ ఆయన మీద చాలానే విమర్శలు ఉన్నాయి. పేరుకి కేంద్ర మంత్రే గానీ కేంద్రంలో ఏం జరుగుతోందో కూడా తెల్యాడు ఆయనకీ అని చెబుతూ ఉంటారు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అనీ ఆయన ఏది చెప్తే ఈయన అదే మాట్లాడతారు అనీ అంటూ ఉంటారు. కేంద్రంలో జరిగే పరిణామాలు తెలుసుకోవడంలో కూడా సుజన చాలా వెనకపడి ఉన్నారు అని విశ్లేషకులు అంటుంటారు. పోలవరం విషయంలో సుజన మనసులో మాటలు అప్పట్లో బయటపడి ఆయన నిజ స్వరూపాన్ని చూపించాయి.
పోలవరం ప్రాజెక్ట్‌కి కేంద్రం డబ్భై శాతం రాష్ట్ర నిష్పత్తి ముప్పై శాతంగా ఇవ్వాల్సి ఉండగా తాము తొంభై, పది ప్యాకేజీకి ఒప్పించాం అని చంద్రబాబు, సుజన చెబుతారు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ఎప్పుడో ప్రకటించారు. ఏ జాతీయ ప్రాజెక్టుకి అయినా సరే 90 : 10 నిష్పత్తిలోనే కేంద్రం నిధులు భరించాల్సి ఉంటుంది. దాంట్లో విశేషం ఏమీ లేదు. ఇది అన్ని రాష్ట్రాల్లో జరిగేదే కానీ అదేదో తమ గొప్పతనం అన్నట్టు మాట్లాడతారు వీరిద్దరూ. లక్షల కోట్ల రూపాయలు ఏపీకి ఒచ్చేస్తున్నట్టు ఎదో ఒక హడావిడి తప్ప అంకెల గారడీలో మనల్ని ముంచుతారు అని విశ్లేషకులు బల్లగుద్ది చెబుతున్నారు. రెండు సంవత్సరాల కాలంలో ప్రత్యేక హోదా కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం, రాజధాని కోసం, రైల్వే జోన్ కోసం పోరాడుతూనే వున్నామని సుజనా చౌదరి చెబుతున్నారు. మరి వీటిలో ఒక్కటి కూడా సాధించలేదు ఆయన, కనీసం ఒక్కొక్క పోరాటంలో బండి ఎంతవరకూ కదిలింది ఎన్ని సాధించాం అంటే ఏం చెప్తారు? పోరాడుతున్నాం అంటారు తప్ప పని జరగడం లేదు.
ఈ కొత్త డ్రామా అంతా ప్రత్యేక హోదాని మర్చిపోయి అంకెల లెక్కలు ప్రకటించి అప్పుడు కాస్తా అప్పుడు కాస్తా విదిలించడం కోసం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. కనీసం ప్రత్యేక హోదా దక్కితే ఈ రాష్ట్రం వంక పరిశ్రమలూ, పెట్టు బడిదారులూ చూస్తారు, రాయతీలు ఇవాళ కాపోతే రేపైనా ఒస్తాయి అని నమ్మచ్చు కానీ నిథులు? అవి ఇప్పుడప్పుడే ఒచ్చేవా? ప్రత్యేక హోదా విషయంలో ఎప్పుడు క్లారిటీ రానుంది? ప్రత్యేక హోదా వస్తుందనే నమ్మకాలు ప్రజల్లో లేకపోయినా ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతం వల్ల కేంద్రప్రభుత్వం మరోసారి పునరాలోచిస్తుందా? అసలు హోదా ఇచ్చే ఉద్దేశ్యంలో కేంద్రం లేదంటే ప్యాకేజీకి ఒప్పుకోక తప్పదా? ఒక్కసారిగా ఉప్పెనలా ముంచుకొచ్చిన ఉపద్రవం ప్రత్యేక హోదా అంశం. విభజన చట్టంలో పొందుపర్చాల్సినపుడు మౌనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుండి ఇటీవల రెచ్చిపోయింది.
ఆ తర్వాత ఎవరికి వారు తమ పార్టీని ప్రజలు ఎక్కడ పక్కన పెడతారో అనే భయంలో అందరూ ప్రత్యేక హోదా పల్లవి అందుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో హోదా ఇచ్చే ఉద్దేశ్యం బీజేపీ సర్కారుకు లేదు. పైగా రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఇవ్వడం సాధ్యంకానిపని. దీంతో మొదటి నుంచి బీజేపీ సైతం ఇదే విషయం చెబుతుంది. ఏపీకి మంచి ప్యాకేజీ ఇస్తామని చెప్పుకొస్తుంది. కానీ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న రాద్ధాంతం వల్ల ఎవరికి వారు హోదాపై గందరగోళం సృష్టించక తప్పడంలేదు. కాగా, ప్రత్యేక హోదా అంశంలో అతి త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. హోదా ఇస్తారనే అంచనాలు అతి తక్కువగా కనిపిస్తున్నాయి. ఇది మొదటి నుంచీ వినిపిస్తున్న వాదనే.
హోదా ఇచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు. అయితే టీడీపీ మాత్రం హోదాతో పాటుగా ప్యాకేజీ కూడా కావాలని కోరుతూ వస్తుంది. ఈ రెండూ జరిగేపనులు కాదని అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఎలాంటి ప్యాకేజీ ఇవ్వనున్నారనేదానిపైనే మిత్రపక్షాలు చర్చించుకుంటున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటాల దృష్ట్యా. క్రెడిట్ వారి ఖాతాలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.


