హోదా ఎందుకు అడుగలేదు: బొత్స
- 80 Views
- wadminw
- September 14, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (న్యూస్‌టైమ్): ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో ఫోన్లో సంభాషించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారని, కానీ, వారం కిందట కేంద్ర ఆర్థిక మంత్రి ఆరుణ్‌జైట్లీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనంటే ఎందుకు ఆనంద పడుతున్నారో అర్థం కావట్లేదని వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. హైదరాబాద్‌లోని వైకాపా కేంద్ర కార్యాలయంలో బుధవారం బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ అనుమతుల ఇబ్బంది బాధ్యతలన్నీ తామే తీసుకొని పోలవరం ప్రాజెక్టు కడతామని కేంద్రం ప్రకటిస్తే కమిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వద్దంటుందన్నారు.
పోలవరం ప్రాజెక్టు కోసం ప్రత్యేక హోదాను పణంగా పెట్టారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో నిందితుడుగా ఉన్న చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు పెట్టారన్నారు. కాపర్డ్యామ్తోనే పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతుందనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం 42శాతం వాటాకు గాను రూ. 12000 కోట్లు ఖర్చు పెట్టనుందన్నారు. సింగపూర్ కంపెనీ 58శాతం వాటాగా ఉన్నా మౌళిక సదుపాయాల ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే పెట్టడం దోపిడీకి నిదర్శనం అన్నారు. 14వ ఆర్థిక సంఘం చెప్పిన నిధులే ప్రత్యేక ప్యాకేజీలో ఇస్తున్నారని చెప్పారు. చంద్రబాబునాయుడు చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని బొత్స అన్నారు.
తన స్వార్థ ప్రయోజనాలకోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని చెప్పినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానికి థ్యాంక్స్ చెప్పారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలవరం కాంట్రాక్టు కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పరిధిలో ఉన్న ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. టెండర్లు లేకుండా పోలవరం ప్రాజెక్టుకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చారని, సీఎం స్థాయి వ్యక్తి సబ్ కాంట్రాక్టులు డిసైడ్ చేయడం దారుణం అన్నారు. చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగలడం ఖాయం అని జోస్యం చెప్పారు.
పోలవరం మెయిన్ ప్రాజెక్టును పక్కకు పెట్టి ఇప్పుడు కాపర్ డ్యాం నిర్మిస్తామంటున్నారని, అసలు మీ ఆలోచన ఏమిటని, రాష్ట్రాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. మీ దోపిడీని అడ్డుకుంటే పోలవరానికి, రాజధాని నిర్మాణానికి ప్రతిపక్షం అడ్డుతగులుతుందని రాద్ధాంతం చేస్తున్నారని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. తాబేదార్లకు, బూట్లు మోసేవారికి, సంచులు మోసేవారికోసమే చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కుంభంకోణం కేసులో దొంగలా దొరికిన చంద్రబాబు అందులో నుంచి బయటపడేందుకు హోదాను అమ్మేశాడని అన్నారు.


