హోదా ప్రయోజనాలన్నీ ప్యాకేజీతో: సీఎం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 100 శాతం నిధులు ఇస్తామన్నందుకు ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక హోదా వస్తే ఏ ప్రయోజనాలు సమకూరుతాయో అంతే సమానమైన ప్రయోజనాలు ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలిపారు. హోదాకు సమానంగా ప్రత్యేక ప్యాకేజీ కింద ఐదేళ్ల పాటు నిధులు ఇస్తామని చెప్పారని, ఇందుకు గాను ప్రధానికి కృతజ్ఞతలు తెలిపినట్లు వెల్లడించారు.
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నాటి నుంచి అయ్యే మొత్తం ఖర్చును కూడా కేంద్రమే భరిస్తుందని ప్రధాని చెప్పినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులపై ఇకపై ప్రతి సోమవారం సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. నీటి సమస్యతో ప్రజల్లో అభద్రతా భావం రాకూడదని చంద్రబాబు పేర్కొన్నారు. అభద్రతా భావం ఏర్పడితే ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ఘటనలే ఉదాహరణ అని ఆయన స్పష్టం చేశారు. నీటి సంక్షోభం వస్తే ఎలాంటి దుష్ఫలితాలు ఎదురవుతాయో చెప్పేందుకు కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులే నిదర్శనమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
నీటి కోసం ప్రజల మధ్య ఘర్షణలు ఏర్పడి అశాంతికి దారితీయడం బాధాకరమన్నారు. అక్కడ పరిస్థితులు మనకు ఓ పాఠం కావాలన్నారు. రాష్ట్రంలో భావితరాలకు నీటి సంక్షోభం తలెత్తకూడదనే నీరు-ప్రగతి కార్యక్రమానికి ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. నీరు-ప్రగతి కార్యక్రమంపై సీఎం మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వాననీటి సంరక్షణ, భూగర్భజలాల పెంపు కార్యక్రమంలో ఇంజనీరింగ్ విద్యార్థుల సేవలు వినియోగించుకోవాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ కనీసం 10 చెరువుల పునరుద్ధరణ జరగాలన్నారు.


