16న టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సుకు రాత పరీక్ష
నిజామాబాద్, అక్టోబబర్ 4 (న్యూస్‌టైమ్): వేసవి కాలంలో టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోసం శిక్షణ పొందిన అభ్యర్థులకు ఈనెల 16న రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి లింగయ్య మంగళవారం ఇక్కడ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 నిమిషాల వరకు రాతపరీక్షలు నిర్వహిస్తామని అభ్యర్థులు వెబ్సైట్ నుంచి ఈ నెల 5 తరువాత హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అదే విధంగా 2016 లో నిర్వహించబడ్డ టెక్నికల్ టైలరింగ్ సంబంధించిన పాస్ మెమోలు పాసైన అభ్యర్థుల డీఈవో కార్యాలయం నుంచి పొందాలని డిఇవో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు ప్రశ్నపత్రాల ఇండెంట్ జిల్లా విద్యాశాఖ వెబ్సైట్ డీసీఈబీలో ఉందని లింగయ్య వివరించారు.
8న రాజధానిలో ఘనంగా బతుకమ్మల మహాప్రదర్శన
నిజామాబాద్, అక్టోబబర్ 4 (న్యూస్‌టైమ్): బతుకమ్మ సంబురాలలో భాగంగా ఈనెల 8న సాయంత్రం 4 గంటలకు నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్‌తో పాటు కామారెడ్డి అంగడి బజార్ గ్రౌండు నందు బతుకమ్మ మహా ప్రదర్శలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ యోగితారాణా మంగళవారం ఇక్కడ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన సూచనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. మూడువేల మంది మహిళలు ప్రదర్శనలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహాప్రదర్శనను విజయవంతం చేసేందుకు తెలంగాణ ఎన్జీవోల అసోసియేషన్లు, మెప్మా, ఐకేపీ మహిళలు, ఐసీడీఎస్ కార్యకర్తలు,వైద్య, ఆరోగ్య ఉద్యోగులు, కార్యకర్తలు, ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులు,స్వచ్ఛంద సంస్థలు. సంఘాల ప్రతినిధులు ప్రదర్శన విజయవంతం చేసేందుకు సహకరించాలని ఆమె కోరారు.
ఓబీసీ జిల్లా సదస్సును విజయవంతం చేయండి: దండి
నిజామాబాద్, అక్టోబబర్ 4 (న్యూస్‌టైమ్): ఈనెల 8న జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న అత్యంత వెనుకబడిన కులాల సంఘం జిల్లాసదస్సును విజయవంతం చేయాలని ఎంబిసీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు దండి వెంకట్ పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. ఆశయ్య ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో ఉన్న 1056 కులాలను ఎంబీసీలుగా గుర్తించి ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం 30 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌తో ఎంబీసీ ఉద్యమం ప్రారంభమైందని అన్నారు.


