19న అర్చకుల సమస్యలపై ప్రత్యేక సమావేశం
- 69 Views
- wadminw
- December 15, 2016
- తాజా వార్తలు
శ్రీకాకుళం, డిసెంబర్ 14 (న్యూస్టైమ్): దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అర్చకుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 19వ తేదీన విశాఖపట్నంలోని దేవాదాయశాఖ కమిషనర్ అనూరాధ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారని, దీనికి ఉత్తరాంధ్రలోని అర్చకులంతా హాజరై తమ సమస్యలను లిఖితపూర్వకంగా విన్నవించవచ్చని ఉత్తరాంధ్ర అర్చక సంఘం ప్రధానకార్యదర్శి అయిలూరి శ్రీనివాస దీక్షితులు, అరసవల్లి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మలు పేర్కొన్నారు.
శ్రీకాకుళం నగరంలోని స్థానిక ఎన్జీవో హోంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. అర్చకులందరికీ నెలకు రూ. 10 వేల జీతం ఇవ్వాల్సి ఉన్నా క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని, దీనిపై ఫిర్యాదు ఇవ్వవచ్చన్నారు. అదేవిధంగా ఆలయాల్లోని కార్యనిర్వాహక అధికారులు, మేనేజరులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. సర్వీసు ఇనాం భూములు ఉన్న అర్చకుల విషయంలో అర్చకుని అనుభవదారునిగా గుర్తిస్తూ పట్టాదారు పాసు పుస్తకాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.
19న విశాఖపట్నంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించే సమావేశంలో ఈ సమస్యలను కమిషనర్ అనూరాధ, అర్చక సంక్షేమ సంఘ బోర్డు ఛైర్మన్ ఐ.వై.ఆర్.కృష్ణారావుల దృష్టికి తీసుకుని వెళ్లనున్నట్టు చెప్పారు. సమావేశానికి దేవాదాయశాఖ ఈవోలు, మేనేజర్లు, ఏసీలు, డీసీలు తదితరులు హాజరవుతారన్నారు. అర్చక సంఘం ప్రతినిధులు పెంట శ్రీనివాస శర్మ, చామర్తి జగలప్పలాచార్యులు, రేజేటి శ్రీరామాచార్యులు, ఎ.వి.వి.ఎస్.కామేశ్వరశర్మ, కె.మురళీకృష్ణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


