19న విశాఖలో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ
- 87 Views
- wadminw
- December 15, 2016
- రాష్ట్రీయం
విజయనగరం, డిసెంబర్ 14 (న్యూస్టైమ్): దివంగత కాంగ్రెస్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 19న విశాఖపట్నంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఉత్తరాంధ్ర జిల్లాల కాంగ్రెస్ ప్లీనరీని నిర్వహిస్తున్నట్లు మాజీ కేంద్రమంత్రి, విజయనగరం జిల్లా కాంగ్రెస్ పరిశీలకులు కిళ్లి కృపారాణి తెలిపారు. ఇక్కడి డిసిసి కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల సదస్సుకు మండలానికి కనీసం 10 మందికి తక్కువ కాకుండా క్రియాశీల కార్యకర్తలు వచ్చే విధంగా ఏర్పాటు చేశామన్నారు.
ఏడు అంశాలపై చర్చిస్తామన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటకు కాంగ్రెస్ హయాంలో ఏం చేసింది, మూడేళ్ల బిజెపి పాలనలో ఏం చేసిందీ చర్చకుతీసుకొస్తామన్నారు. ఈ సదస్సుకు ఎపిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి, ఢిల్లీ నుంచి కాంగ్రెస్ నాయకులు హాజరవుతారన్నారు. కాంగ్రెస్లో ద్రోణం రాజు సత్యనారాయణకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకొని దీన్ని నిర్వహిస్తున్నామన్నారు. డాక్టర్ రామ్మోహనరావు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.


