2న చంద్రన్న బీమా ప్రారంభం: జేసీ
ఆదిలాబాద్, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): జిల్లాలోని అన్నీ మండలాల్లో అక్టోబరు 2వ తేదీ దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రతపై ర్యాలీ నిర్వహించాలని జిల్లా సంయుక్త పాలనాధికారి ఏఎండీ ఇంతియాజ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్లో దోమల దండయాత్ర, సంపూర్ణ బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మార్చే అంశం, చంద్రన్న బీమా పథకంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. చంద్రన్న బీమా పథకాన్ని తిరుపతి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని కొత్త జడ్పీ హాల్లో ఈనెల 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రసారం చేస్తారన్నారు. అన్నీ శాఖల అధికారులు అసెంబ్లీ నియోజవర్గాల వారీగా 235 ఇండికేటర్లకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాలకులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో రామిరెడ్డి, ఆత్మగౌరవం కోఆర్డినేటర్ సుస్మిత, కార్మికశాఖ సహాయ కమిషనర్ వెంకటరమణ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల మూసివేత
ఆదిలాబాద్, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): జిల్లాలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం మూసివేశారు. జిల్లాలో 15 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలును చేసేందుకు సన్నాహాలు చేయగా వాటిలో ఆరు కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు సాగాయి. తొలుత కడప వ్యాపారులకు అమ్మగా తర్వాత స్థానిక రైస్‌మిల్లర్లకు కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్మకాలు చేశారు. జిల్లాలో 5,684 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.7.87 కోట్లు వ్యాపారం జరిగింది. కడప జిల్లా వ్యాపారులు అయిదుగురు, జిల్లా వ్యాపారులు ముగ్గురు ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ప్రస్తుతం రూ.5 కోట్లు రైతులకు చెల్లించారు. కోవూరు పరిసరాల ప్రాంతాల్లో ఇంకా కోతలు జరుగుతున్నాయి. అయినా కొనుగోలు కేంద్రాలను మూసివేయడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. దీనిపై పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కొండయ్యను మీడియా వివరణ కోరగా సీజన్ ముగిసిందని రైతుల నుంచి ఏదైనా అభ్యర్థనలు అందితే జిల్లా సంయుక్త పరిపాలనాధికారి దృష్టికి తీసుకెళ్లి పునః పరిశీలిస్తామని వివరించారు.
నకిలీ పాస్‌పుస్తకాల తయారీ ముఠా అరెస్ట్
ఆదిలాబాద్, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): నకిలీ పాస్ పుస్తకాల సాయంతో బ్యాంక్ ద్వారా రుణాలు పొందడానికి యత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల పరిధిలో నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలు, పహాణీలు సృష్టించి అధికారుల ఫోర్జరీ సంతకాల సాయంతో బ్యాంకులో రుణాలు తీసుకునేందుకు యత్నించిన ముఠాకు చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నకిలీ పట్టదారు పాసు పుస్తకాలు, పలు ఆఫీసుల స్టాంపులు, తహశీల్దార్, ఆర్డీవో అధికారుల ఆఫీసు ముద్రలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలను మరికొద్దిసేపట్లో మీడియాకు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. కాగా, మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన జెన్నారం మండలం భాగంపల్లి హైస్కూల్లో గురువారం చోటుచేసుకుంది. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న ఎంఈఓ, స్థానిక ఎస్ఐ విద్యార్థులను పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్టా) అధ్వర్యంలో మహత్మా గాంధీ జయంతి సందర్బంగా ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల గిరిజన గ్రామం రాజురా లో అక్టోబర్ నెల 2వ తేదిన ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనుంది. స్థానిక ప్రభుత్వ హైస్కూల్లో ఆదివారం ఉదయం 8 గంటల నుండి సాయుంత్రం 4 గంటల వరకు ప్రముఖ వైద్యలు తమ సేవలను అందజేస్తారు. స్థానిక డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ కృష్ణం రాజు, డాక్టర్ రామకృష్ణ లతో సహా.. 20 మంది వైద్యులు.. ఇతర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొంటారు. అన్ని రకాల వ్యాధులకు వైద్య సేవలు, మందులు ఉచితంగా ఇవ్వనున్నారు. కార్యక్రమంలో భాగంగా ఉచిత భోజన వసతి ఉంటుందని ఆప్టా అధ్యక్షులు గూడపాటి గోపాల కృష్ణ గూడపాటి తెలిపారు. ఈ శిబిరానికి కావాల్సిన ఆఫ్టా మెడికల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ చైర్ డాక్టర్ కొత్తపల్లి కుమార్, వైస్ చైర్ డాక్టర్ రగుతూ సూర్య లు పంపిణీ చేయనున్నారు. ఎన్నారై పన్నెల జనార్ధన్ శిబిరానికి అవసరం అయిన సహాయ సహకారాలు అందిస్తున్నారని వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే రేఖాశ్యామ్ నాయక్ పాల్గొనున్నారు.


