2 లక్షల మంది హస్తకళాకారులకు చేయూత
- 64 Views
- wadminw
- October 25, 2016
- రాష్ట్రీయం
ఏలూరు, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలో రెండు లక్షల మంది హస్తకళాకారులు ఉన్నారని, వారు తయారు చేసే చేనేత హస్తకళలకు దేశ, విదేశాలలో మంచి గుర్తింపు ఉందని గనులు-భూగర్భం, మహిళా సాధికారం, శిశు సంక్షేమం, వయోవృదుల సంక్షేమం శాఖల మంత్రి పీతల సుజాత చెప్పారు. ఆమె మంగళవారం మేరిస్ స్టేడియం లో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్, నలురు బోర్డు డైరెక్టరుగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పనిచేసేవారిని ప్రోత్సహించటానికి రాష్ట్ర హస్తకళల సంస్థ చైర్మన్‌గా పాలి ప్రసాద్ నియామకమే ఒక చక్కని ఉదాహరణ అని మంత్రి చెప్పారు.
రాష్ట్ర హస్తకళల సంస్థ చైర్మన్ పాలి ప్రసాద్ పశ్చిమ గోదావరి జిల్లాలో హస్తకళాకారులకు నోట్లో నాలుకలా వ్యవహరిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో రాష్ట్ర హస్తకళల సంస్థ చైర్మన్, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని, ఇంత చక్కని కార్యక్రమానికి రావటం చాలా సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. పనే దైవంగా భావించి పనిచేసే పాలి ప్రసాద్ లాంటి వ్యక్తులు వల్ల సమాజానికి చాలా మంచి జరుగుతుందని, దీనివల్ల భవిష్యత్తులో చేనేత హస్తకళలు కార్పొరేషన్ చాలా అభివృద్ధి సాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
చేనేత హస్తకళాకారులు తయారు చేసే వస్తువులు సమాజంలో ఎక్కువగా సంపన్నవర్గం వారు వినియోగించే విధంగా ఉంటున్నాయని, ఇవి అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ప్రచారం కల్పించాలని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రెండు లక్షల మంది చేనేత హస్తకళాకారులు ఉన్నారని తెలిపారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు మంత్రి పీతల సుజాత ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన వెంకటేశ్వర స్వామికి రాష్ట్ర హస్తకళల సంస్థ చైర్మన్, బోర్డు డైరెక్టర్లతో కలసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర హస్తకళల సంస్థ చైర్మన్, నలురు బోరు డైరెక్టర్లు చేత ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి పీతల సుజాత సభ్యులకు, చైర్మన్‌కు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సభ్యులు, చైర్మన్ అందరూ కూడా మంత్రి పీతల సుజాతను సత్కరించారు. రాష్ట్ర హస్తకళల సంస్థ చైర్మన్ పాలి ప్రసాద్ మాట్లాడుతూ ఏపీహెచ్డీసీ కార్పొరేషన్ 2015-16లో 34 కోట్ల టార్గెట్ పెట్టుకోగా, రూ. 3447 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిందని తెలిపారు. తన ట్రేడ్ మార్క్ లేపాక్షిద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 13 సేల్స్ ఎంపోరియంలను ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలో దీని సేల్స్ పెంచటంతోపాటు అందరికీ అందుబాటులో ఉంచడానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. 2016-17లో లేపాక్షి ఎంపోరియంల ద్వారా 38 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు. రాబోయే కాలంలో అన్ని వర్గాల ప్రజలకు చేనేత హస్తకళలను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు నలురు బోరు డైరెక్టరుగా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. నిరంతరం ప్రజల కోసం పనిచేసి తమ కార్యదీక్షను నిరూపించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విప్రా మ్మోహన్, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమశెట్టి రామానుజయ, శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, చింతమనేని ప్రభాకర్, బడేటి తోట రామారావు, పల్లెల రాంప్రసాద్, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, ఆంజనేయులు, జవహర్, రామ్మోహన్ శ్రీనివాస్, గాంధీ, ఎమ్మెల్సీ షరీఫ్, ఆర్ఎస్ మాస్టారు, స్థానిక కార్పొరేటర్ సాంబశివరావు తదితరులతో పాటు హస్తకళల సంస్థ డైరెక్టర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
గుర్రాల వాగులో పడి వ్యక్తి మృతి
ఏలూరు, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): ప్రకాశం జిల్లా దెందులూరు మండలం సింగవరంలోని గుర్రాల వాగులో పడి నారి రమణ(33) అనే వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం తెల్లవారుజామున ఇంటి నుంచి టీ తాగి వస్తానని హోటల్‌కు వెళ్లిన రమణ తెల్లవారినా ఇంటికి రాలేదు. దీంతో బంధువులు అతని కోసం గాలించగా గుర్రాల వాగులో మృతదేహమై కన్పించాడు. ఏఎస్సై ప్రసాదరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కాగా, అత్త,భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటనలో వారికి పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన దేవరపల్లి వాణిరత్నకుమారి (22)కి, అదే గ్రామానికి చెందిన పడాల చిన్నబాబుతో రెండేళ్ల కిందట వివాహమైంది.తమ భర్త చిన్నబాబు, అత్త భూలక్ష్మిలు వేధింపులకు గురిచేస్తున్నారని 2012లో వాణిరత్నకుమారి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆమె తల్లి దేవరపల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై ఎం.కేశవరావు కేసు నమోదు చేయగా డీఎస్పీలు కె.శ్రీనివాసరావు, వి.రాజుగోపాల్లు విచారణ చేపట్టారు. అనంతరం కోర్టులో వాదోపవాదనల అనంతరం నిందితులైన పడాల చిన్నబాబు, పడాల భూలక్ష్మిలకు నాల్గోఅదనపు జిల్లాజడ్జి జి.గోవిందకేశవరావు పదేళ్లజైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానావిధిస్తూ తీర్పునిచ్చారు.


