నిర్మల్ జిల్లా వద్దు: సంరక్షణ సమితి
- 14 Views
- September 5, 2016
- తాజా వార్తలు
ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయవద్దని జిల్లా సంరక్షణా సమితి నాయకులు వినాయక విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ కూడలిలో జిల్లా సంరక్షణాసమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు సోమవారానికి ఏడవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లా సంరక్షణా సమితి కన్వీనర్ ఈర్ల సత్యన్నారాయణ, బీసీ సంఘం జిల్లా నాయకులు అన్నదానం జగదీశ్వర్, సామల ప్రశాంత్, బాలశంకర్క్రిష్ణలు దీక్షా శిబిరంలో ప్రతిష్టించిన వినాయకుని విగ్రహానికి నిర్మల్‌జిల్లా చేయవద్దని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మల్ జిల్లా ఏర్పాటు వల్ల ఆదిలాబాద్ ప్రాంత వాసులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం, జిల్లా మంత్రులకు నిర్మల్‌జిల్లా ఏర్పాటు చేయకూడదని జ్ఞానోదయం కలిగించాలని వినాయకుడిని వేడుకున్నారు. కాగా ఏడోరోజు దీక్షలో జావా స్వచ్ఛంద సంస్థ నాయకులు పయాజ్అహ్మద్, అబ్దుల్ రహీం, షేక్మసూద్, షేక్ చోటు, సయ్యద్ ఫరూక్, సామాజిక కార్యకర్త బండారు దేవన్న, ఉద్యమకారుడు బండ గంగన్న తదితరులు కూర్చున్నారు. కాగా, కడెం మండలంలోని బుట్టాపూర్ గ్రామానికి చెందిన దళితులు సోమవారం తహసీల్దారు కార్యాలయం ఎదుట బైఠాయించి తమ నిరసన తెలిపారు. ‘దళిత బస్తీ’ పథకం కింద ఇచ్చిన భూములను అర్హులైన వారికి కాకుండా ఇష్టారీతిన లబ్ధిదారులను ఎంపిక చేశారని నిరసిస్తూ దళితులు తహసీల్దారు కార్యాలయానికి వచ్చారు. కార్యాలయం ఎదుట కొద్దిసేపు బైఠాయించి సెలవు కావటంతో రేపు మరలా ఆందోళన చేపడతామని చెప్పి వెళ్లిపోయారు.
మైనార్టీ కమిషన్ రాష్ట్ర ఛైర్మన్ హబిద్ రసూల్‌ఖాన్ సోమవారం కడెం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన్ను స్థానిక ముస్లిం మైనార్టీలు ఘనంగా సన్మానించారు. కడెంలో అసంపూర్తిగా ఉన్న షాదీఖానా భవనాన్ని పూర్తి చేయించాలని ఈ సందర్భంగా పలువురు ఆయన్ను కోరారు. కార్యక్రమంలో సర్పంచి చిన్నయ్య, ఎంపీటీసీ సభ్యుడు గంగాధర్, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.


