సరిగా అమలుకాని జేఎస్ఎస్కే పథకం!
- 20 Views
- September 5, 2016
- జాతీయం
న్యూఢిల్లీ: అందుబాటులో ఉన్నది రూ.2కోట్లు… కానీ, ఖర్చు చేసింది మాత్రం రూ.5లక్షలు. మాతాశిశు సంక్షేమానికి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తూట్లు పొడుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జననీ శిశు సంరక్షణ పథకాన్ని నీరుగారుస్తున్నారు. ఈ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గర్భిణికి పూర్తిగా ఉచితంగా వైద్యం అందించాలి. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. జననీ శిశు సంరక్షణ ఖాతాల్లోలక్షలాది రూపాయలు ఉన్నా ప్రసవానికి వచ్చిన వారితో వేలాది రూపాయలు ఖర్చు చేయిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, నంద్యాలలో జిల్లా ఆసుపత్రి, ఆదోనిలో ఏరియా ఆసుపత్రి, మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్, నంద్యాల, ఆదోనిలలో పీపీ యూనిట్లు, 20 అర్బన్ హెల్త్ సెంటర్లు, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలఉన్నాయి. ఈ ఆసుపత్రులకు వచ్చే గర్భిణిలు ఉచితంగా ప్రసవం చేసుకుని, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా తిరిగి ఇంటికి వెళ్లేలా పథక రూపకల్పన జరిగింది. అంటే ఆసుపత్రికి రానుపోను రవాణా చార్జీలతో పాటు చికిత్సకు అవసరమయ్యే మందులు, వైద్య పరీక్షలకు ఈ పథకం నిధులను ఖర్చు చేయవచ్చు. రక్తం అవసరమైతే ఈ నిధులతో కొనుగోలు చేయవచ్చు.
అయితే జిల్లాలో 95 శాతం ఆసుపత్రులు ఈ నిధులు ఖర్చు చేయకుండా మూలనపెట్టేశాయి. ఈ ఏడాది ప్రభుత్వ ఆసుపత్రులకు జననీ శిశు సంరక్షణ పథకం కింద కేంద్రం రూ.1,21,93,270 కేటాయించింది. గత ఏడాది నిధులు ప్రస్తుతం కలిపి జేఎస్ఎస్కే కింద ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం రూ.2,06,72,362 అందుబాటులో ఉన్నాయి. గత ఏప్రిల్ నుంచి ఆరు నెలల కాలంలో ప్రభుత్వాసుపత్రుల్లో ఈ పథకం కింద ఖర్చు పెట్టింది రూ.5,43,622 మాత్రమే. ఇంకా రూ.2కోట్లకు పైగా నిధులు మూలుగుతున్నాయి.
ఒక్క రూపాయి ఖర్చు చేయని ఆసుపత్రులుజిల్లాలో ఈ ఏడాది 65 పీహెచ్సీలు బనగానపల్లె, కోడుమూరు, అవుకు, పాణ్యం, యాళ్లూరు, ఎమ్మిగనూరు సీహెచ్సీలు, నంద్యాల జిల్లా ఆసుపత్రి, ఆదోని ఎంసీహెచ్ ఆసుపత్రి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ప్రతిరోజూ 30 మందికి పైగా ప్రసవాలు జరిగే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ఈ ఏడాది రూ.56,69,140 అందుబాటులో ఉండగా ఇప్పటి వరకు ఖర్చు చేసింది సున్నా. నిధులున్నా అవగాహన కరువుప్రధాన ఆసుపత్రులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ నిధుల వినియోగంపై అధికారులకు, మెడికల్ ఆఫీసర్లకు కనీస అవగాహన లేదన్న విమర్శలు ఉన్నాయి.
దీంతో నిధులున్నా ప్రసవానికి వచ్చిన వారు ఆసుపత్రిలో లేని మందులు, వైద్యపరీక్షలు, రక్తంను ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ రూ.2వేల నుంచి రూ.8వేల దాకా ప్రసవానికి వచ్చి ఖర్చు చేస్తున్నారంటే ఈ పథకం అమలు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మాతా శిశు మరణాలు తగ్గించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టగా కింది స్థాయిలో మాత్రం ఇవేమీ తాము పట్టించుకోబోమని చెబుతున్నట్లుగా నిధుల వినియోగం ఉంది.


