సింగరేణిలో ఎన్నికపై త్వరలో షెడ్యూల్ ఖరారు
- 15 Views
- September 5, 2016
- రాష్ట్రీయం
ఆదిలాబాద్: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రతి నాలుగేళ్ళకోసారి ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. గత జూన్ మాసంతో గడువు ముగియడంతో కొత్తగా ఎన్నికలు నిర్వహించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల్లో పాల్గొనే వివిధ కార్మిక సంఘాల నుంచి నివేదికలను కోరింది.
ఇందుకోసం ఆగస్టు 23, 28 తేదీలను చివరి గడువుగా విధించినప్పటికీ ఈనెల 3న కూడా నివేదికలు సమర్పించేందుకు అవకాశం కల్పించింది. ఈ ఎన్నికల్లో పదహారు కార్మిక సంఘాలు పాల్గొనేందుకు నివేదికలను సమర్పించడంతో ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ మరింత వేగమవుతోంది. కార్మిక సంఘాలు ఇచ్చిన వార్షిక నివేదికలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలను సరిచూసుకునేందుకు కార్మికశాఖ అధికారులకు మూడు రోజులపాటు సమయం పడనుంది.
పూర్తి వివరాలపై స్పష్టత వచ్చిన తర్వాత కార్మికశాఖ కేంద్ర కార్మికకు సమర్పించనుంది. వీటిని పరిశీలించిన తర్వాత ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన తుదిచర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగా ఈ ఎన్నికలకు సంబంధించి అధికారిని పది రోజుల్లో నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం యాజమాన్యం, వివిధ కార్మిక సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించనుంది. ఎన్నికపై ఇప్పటికే సింగరేణి వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


