జనసేన సభ నిర్వహణకు ప్రత్యేక కమిటీలు
- 18 Views
- September 6, 2016
- రాష్ట్రీయం
కాకినాడ, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): రాష్ట్రానికి ప్రత్యేక ¬దా కల్పించాలనే డిమాండ్‌తో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉద్యమబాట పట్టారు. మార్పుకు తూర్పు గోదావరి వేదికనే అభిప్రాయంతో ఏ పార్టీ పెద్దలైనా జిల్లా నుంచే తమ కార్యక్రమాలను ప్రారంభిస్తారనే సెంటిమెంటు ఉన్న నేపథ్యంలో జనసేన ఉద్యమాలను కూడా ఈ జిల్లా నుండే ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు తిరుపతిలో ప్రకటించిన మూడంచెల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా తన తొలి అడుగు,కార్యక్రమాలను జిల్లా కేంద్రమైన కాకినాడ నుండే ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 9వ తేదీన ఆంధ్రుల ఆత్మగౌరవ సభ పేరిట నిర్వహించే ప్రత్యేక¬దా ఉద్యమ కార్యాచరణకు జెఎన్టియు కాకినాడ క్రీడా ప్రాంగణం వేదికైంది. జనసేన పార్టీ కోశాధికారి రాఘవయ్య నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటై సభ పనులు ప్రారంభమయ్యాయి.
చింతపల్లి బన్ని, కామిరెడ్డి రాజేష్, అడ్డాల శ్రీధర్, చింతపల్లి అర్జున్‌లతో జనసేన పార్టీ కోశాధికారి రాఘవయ్య ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయగా మంగళవారం ఉదయం మూహూర్తం నిర్ణయించి రాట పనులు ప్రారంభించారు. చిన్న రాష్ట్రాలతోనే పరిపాలనా సౌలభ్యం ఉంటుందనే అభిప్రాయంతో భారతీయ జనతా పార్టీ గతంలోనే రాష్ట్రాల విభజనకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే కాకినాడలోనే ఒక ఓటు – రెండు రాష్ట్రాలు అనే నినాదంతో రాష్ట్రాల విభజనకు శ్రీకారం చుట్టింది. అయితే ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన సీమాంధ్రకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కల్పించకపోవడాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తప్పుపడుతూ ఉద్యమాన్ని ప్రారంభించారు. అదే కాకినాడలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం పలు ప్రసంశలు పొందింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపు సామాజికవర్గానికి చెందిన నాయకులు పలువురు ఉండటంతో పవన్ కళ్యాణ్ సభకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి.
అంతేగాక పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కులాలకు అతీతంగా సభకు వచ్చేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వినాయక చవితి ముగియగానే పనులు ముమ్మరం చేసేందుకు జనసేన పార్టీ పెద్దలు, పవన్ కళ్యాణ్ అభిమానులు సభ పనులు ప్రారంభించడంతో పాటు రాబోయే మూడు రోజుల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాకై ఉద్యమిస్తున్న ఈ అంశం రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశం కావడంతో మేథావి వర్గాల ఆమోదం పొందింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించిన పవన్, పార్టీ అభిమానులు సభను విజయవంతం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
పార్టీ పరంగా ఇప్పటి వరకూ ఎటువంటి సంస్థాగత నిర్మాణం పూర్తి కాకపోయినా పవన్ పిలుపిస్తే లక్షలాది మంది రాజకీయ, కుల, మతాలకు అతీతంగా స్పందిస్తారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నిర్వహించిన నామమాత్రపు సభలతోనే రెండు శాతం ఓట్లు తారుమారైనట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఈ రెండు శాతం ఓట్లతోనే టిడిపి అధికారంలోకి వచ్చినట్టుగా రాజకీయ మేథావులు వ్యాఖ్యానించారు. కేవలం సినీ నటుడిగా పవణ్ కళ్యాణ్‌కున్న చరిష్మా రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీగా ఏర్పాటయ్యే జనసేనకు ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.


