మోదీ ప్రత్యేక శ్రద్ధచూపుతున్నారు: వెంకయ్య
- 24 Views
- September 14, 2016
- యువత
విశాఖపట్నం, సెప్టెంబర్ 14 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శద్ధ చూపుతున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు బుధవారం ఉదయం ఆయన విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ విమానాశ్రయంలో భాజపా శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఎంపీ హరిబాబుతో పాటు పలువురు భాజపా నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ కంటే ఎన్నో ప్రయోజనాలు కలిగిన ప్రత్యేక ప్యాకేజీ సాధించారని కేంద్రమంత్రి వెంకయ్యకు ఆపార్టీ నేతలు ధన్యవాదాలు తెలిపారు.
విమానాశ్రయం నుంచి బీచ్‌రోడ్డులోని ఎంపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రత్యేక హోదాకు పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదన్నారు. హోదాకు బదులుగా రాష్ట్రాన్ని కేంద్రం ప్రత్యేకంగా గుర్తించిందని తెలిపారు. హోదా ఇస్తేనే పెట్టుబడులు పెడతామని పారిశ్రామికవేత్తలు అనలేదన్నారు. రెవెన్యూ లోటు ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ‘‘రెవెన్యూ లోటు భరించాలని ఆనాడు ఎవరు అడిగారు? మేం కాదా’’ అని ప్రశ్నించారు. ‘‘పోలవరం ప్రాజెక్టు పూర్తికాకపోతే తాగు, సాగునీటికి ఇబ్బంది ఉంటుందని పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులను ముందుగానే తొలగించాం.
1981లో పోలవరానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకూ పూర్తి చేయనేలేదు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో పోలవరానికి రూ.850 కోట్లు ఇచ్చాం’’ అని వెంకయ్య తెలిపారు. రైల్వే జోన్‌పై చర్చలే జరగకపోతే లేని పోని విమర్శలు చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌పై ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారని తెలిపారు. ప్రత్యేక హోదాకు బదులుగా రాష్ట్రాన్ని ప్రత్యేకంగా గుర్తించామన్నారు. హోదాకు, పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదని వెంకయ్య ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రెవెన్యూ లోటును ఐదేళ్లపాటు కేంద్రమే భరిస్తుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులు అన్ని ముందుగానే తొలగించామని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇస్తేనే పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఏ పారిశ్రామికవేత్త చెప్పలేదన్నారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అని మరోసారి వెంకయ్య స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రాష్ట్రంలో సాగు, తాగునీటికి ఇబ్బంది ఉండదని తెలిపారు. ఏపీ మంత్రులు డాక్టర్ కామినేని శ్రీనివాస్‌రావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, విశాఖ ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబుతో, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, పలువురు భాజపా నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ కంటే ఎన్నో ప్రయోజనాలు కలిగిన ప్రత్యేక ప్యాకేజీ సాధించారని కేంద్రమంత్రి వెంకయ్యకు ఆపార్టీ నేతలు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వెంకయ్యనాయుడు విశాఖపట్నం సిరిపురం జంక్షన్‌లోని ఆకాశవాణి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రిని ఏఐఆర్ అధికారులు, ఉద్యోగులు సత్కరించారు.


