రైల్వే బడ్జెట్‌కు ఇక చెల్లుచీటీ!
- 14 Views
- September 21, 2016
- జాతీయం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వినిపిస్తున్న సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ విలీనం మాట ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ పరిధిలోకి రైల్వేను తీసుకువస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం ఇక్కడ జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై ప్రత్యేకించి చర్చించాక త్వరలోనే ఈ ప్రక్రియకు తుదిరూపు ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ నిర్ణయం అమలులోకి వస్తే, కేంద్రం ఇక నుంచి రైల్వేకి సంబంధించిన వ్యవహారాలను బడ్జెట్ రూపంలో ప్రత్యేకించి ప్రవేశపెట్టదు. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి రైల్వే బడ్జెట్‌ను యూనియన్ బడ్జెట్లో కలిపివేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం లభించిన నేపథ్యంలో త్వరలోనే దీనిపై కార్యాచరణ పూర్తిచేసి జనవరి నాటికి ఆదాయ, వ్యయాలకు సంబంధించిన అంచనాలను సాధారణ బడ్జెట్ తయారీకి అందజేయాల్సి ఉంటుంది. 92 ఏళ్ల నుంచి యూనియన్ బడ్జెట్‌కు ముందు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆచారంగా వస్తోంది.
దేశంలో ఎక్కువ మంది ఉద్యోగులు భారతీయ రైల్వేలోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఏడో వేతన సంఘ సిఫార్సులతో అదనంగా రూ.40,000 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి రైల్వేలకు నెలకొంది. దీనికి తోడు ఇప్పటికే ప్రయాణికులకు ఇస్తున్న రాయితీ ఖాతా కూడా దాదాపు రూ.33,000 కోట్లు దాటింది. ప్రస్తుతం రైల్వేశాఖ 458 ప్రాజెక్టులకు సంబంధించి రూ.4.83లక్షల కోట్ల భారాన్ని మోస్తోంది. దీంతో ఆదాయంలో తగ్గుదల, మూలధన వ్యయం పెరగటంతో రైల్వేశాఖను ఆర్థిక శాఖ పరిధిలోకి తీసుకురాక తప్పలేదని ఉన్నతస్థాయి అధికారుల మాట.
ఇప్పటివరకు నిర్ణయించిన దాని ప్రకారం రైల్వే, యూనియన్ బడ్జెట్లను కలిపి కేంద్ర ఆర్థిక మంత్రి వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెడతారు. జనవరి 25నాటికే ఈ బడ్జెట్ల విలీనాల ప్రతిపాదనకు పార్లమెంట్ ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. అందుకే ఈ సారి బడ్జెట్ కసరత్తు కూడా దాదాపు మూడు వారాల ముందే మొదలుపెడుతున్నారు.


