కూచిపూడిలో దొంగ అరెస్టు
- 19 Views
- October 1, 2016
- యువత
గుంటూరు, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): పట్టపగలు దొంగతనాలకు పాల్పడుతున్న గుంటూరు జిల్లా కూచిపూడి గ్రామానికి చెందిన యువకుడిని కూచిపూడి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడితోపాటు 50 గ్రాముల బంగారు వస్తువులను, ్ఘ 15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కూచిపూడి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అవనిగడ్డ డీఎస్సీ ఎస్.ఖాదర్‌బాషా వివరాలు వెల్లడించారు. ఆగస్టు 22న పెడసనగల్లులో కొల్లి సత్యనారాయణ ఇంటి కిటికీ చువ్వలను వంచి రెండు బంగారపు ఉంగరాలు, ్ఘ 7 వేల నగదును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. సెప్టెంబర్ 12న కూచిపూడిలో కందికట్టు వెంకటరత్నమాల ఇంటి తలుపులను పట్టపగలే బంగార వస్తువులతోపాటు ్ఘ 15 వేల నగదును చోరీ చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం కూచిపూడి గ్రామానికి చెందిన గరికె తులసీసాయిరామ్ మోటార్ సైకిల్ కొని విలాసవంతంగా కనిపించడంతో అనుమానం వచ్చిన ఎస్ఐ వి.సతీష్, చల్లపల్లి సీఐ వైవీ.రమణ, సిబ్బంది కలసి యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. సదరు రెండు చోరీలకు అతడే పాల్పడినట్లుగా తేలిందన్నారు. ఆధారాల బృందం సేకరించిన వేలిముద్రల ఆధారంగా కూడా నేరం రుజువైనట్లు తెలిపారు. తల్లిదండ్రులు విడిపోవడంతో కూచిపూడిలోని నాయనమ్మ వద్ద ఉంటున్నాడన్నారు. ఒక పండ్ల దుకాణంలో కూలిగా పని చేస్తున్నాడని వివరించారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను, నగదును, అదుపులోకి తీసుకున్న యువకుడిని అవనిగడ్డ కోర్టులో హాజరు పరస్తున్నామని డీఎస్పీ పేర్కొన్నారు. ఏఎస్ఐ సత్యనారాణ, సిబ్బంది ప్రసాద్‌లు పాల్గొన్నారు.
వర్సిటీ రూపురేఖలు మారుస్తాం: వీసీ
గుంటూరు, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వచ్చే ఏడాదిలోగా సమూల మార్పులు చేసి రూపురేఖలు మారుస్తామని వర్సిటీ ఉపకులపతి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం డైక్మెన్ ఆడిటోరియంలో 39, 40వ వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని వివరించారు. ఈ 40 ఏళ్లలో ఇక్కడ చదివిన వారు ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ఖ్యాతి గడించారన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ నాగేశ్వరరావులు ఇక్కడ విద్యార్థులేనని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఏ విశ్వవిద్యాలయానికి లేని వనరులు ఇక్కడ ఉన్నాయన్నారు. వర్సిటీకి ప్రపంచ ర్యాకింగ్‌లో స్థానం, ఐఎస్ఓ గుర్తింపు పత్రం రావడం ఎంతో సంతోషంగా ఉందని…..ఈ ఘనత వెనుక అధ్యాపకులు, పరిశోధకులు, బోధనేతర సిబ్బంది కృషి చేశారన్నారు. విద్యావిధానంలో అంతర్జాతీయ స్థాయి వసతులు, ఆహ్లాదకర వాతావరణం తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ఇక్కడే చదువుకోవాలి అనుకునేలా మార్పులు చేస్తామన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో అవార్డులందుకున్న అధ్యాపకులను ఉపకులపతి సత్కరించారు. వీరితోపాటు ఉత్తమ అధ్యాపకులు, ఉత్తమ పరిశోధకులకు అవార్డులు ప్రదానం చేశారు. వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనున్న ఆచార్యులను సన్మానించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన 22మందికి ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ సాంబశివరావు, రిజిస్ట్రార్ జాన్‌పాల్ పాల్గొన్నారు.
పార్టీని యువత ముందుకు తీసుకెళ్లాలి: సురేష్హెగ్డే
గుంటూరు, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): స్వాతంత్య్రం నుంచి ఉన్న పార్టీ కాంగ్రెస్ అని, ఆటుపోటులనేవి సహజమేనని, ఇటువంటి సమయంలోనే యువత పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని ఏఐసీసీ కార్యదర్శి సురేష్హెగ్డే పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో యూత్‌కాంగ్రెస్ నాయకుల సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. సమావేశానికి యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అమరనాథ్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి సురేష్హెగ్డే మాట్లాడుతూ యువత తలచుకుంటే ఏదైనా సాధించవచ్చని, అటువంటి యువత నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పలు కార్యక్రమాలకు నేడు పేరు మార్చి చెబుతూ, ప్రచారాల కోసం అధిక ఖర్చు చేస్తున్నారన్నారు. అనంతరం యూత్ కాంగ్రెస్ నాయకులు సురేష్హెగ్డేను గజమాలతో సత్కరించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, నగర అధ్యక్షుడు ముత్యాలరావు, యూత్ కాంగ్రెస్ నాయకులు సవరం రోహిత్, రాష్ట్ర నాయకులు రాజీవ్‌రతన్, మదనమోహన్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలి, మహిళా నాయకురాలు ఉషారాణి, కొరివి వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


