సింగపూర్‌తో భారత్ కీలక ఒప్పందాలు: మోదీ
- 19 Views
- October 4, 2016
- అంతర్జాతీయం
న్యూఢిల్లీ, అక్టోబబర్ 4: భారత్, సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ మీద సింగపూర్‌తో రెండు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నామన్న మోదీ ఆంధ్రపదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ ఇప్పటికే భాగస్వామ్యం అయిందని చెప్పారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడేందుకు నిర్మాణాత్మకమైన కృషి చేస్తామని మోదీ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన రెండు అంశాల మీద ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. వాటిలో ఒకటి ఈశాన్య రాష్ట్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను గౌహతిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రెండోది నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటని ఆయన వెల్లడించారు. ఉదయ్‌పూర్‌లో టూరిజం ట్రైనింగ్ సెంటర్‌ను రాజస్థాన్ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేయనున్నట్లు మోదీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో ఇప్పటికే సింగపూర్ భాగస్వామ్యం అయిందని అన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడేందుకు నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకుంటామని మోదీ పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు సింగపూర్ ప్రధాని లి సియన్, ఇరు దేశాల ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.
మరోవైపు, శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఇరు దేశాల దైపాక్షిక సంబంధాలపై ఆయన చర్చించనున్నారు. ఆపరేషన్ సర్జికల్ అనంతరం సింఘే భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. సార్క్ సమ్మిట్ ఈనెలలో పాకిస్థాన్‌లో జరుగనుంది. ఉడీ ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్ భారత్‌కు మద్దతుగా సార్క్ కు హాజరుకారాదని నిర్ణయించుకున్నాయి. భారత్ ప్రాతినిథ్యం లేకుండా సార్క్ సమావేశం సాధ్యం కాదని విక్రమ సింఘే పేర్కొన్నారు.
కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్గరీ, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కూడా విక్రమ సింఘే సమావేశమవనున్నారు. ఆయన గురువారం ఇండియన్ ఎకనామిక్ ఫోరం సమావేశాన్ని ప్రారంభించిన అనంతరం కొలంబోకు పయనమవుతారు. ఇదిలావుండగా, సర్జికల్ స్ట్రైక్స్‌పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. వీడియో విడుదల చేయాలన్న కేజ్రీవాల్ డిమాండ్‌ను కమలం పార్టీ మంగళవారం ఇక్కడ తోసిపుచ్చింది.
ఇలాంటి చర్యలవల్ల పాకిస్తాన్ వారికి చులకన అయిపోతామని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఇలాంటి దురదృష్టకరమైన వ్యాఖ్యలు మానుకోవాలని ఆయన హితవుపలికారు. ఈ సందర్భంగా రవిశంకర్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ సీఎం దాడులకు సంబంధించిన సాక్ష్యాలు అడుగుతున్నారని మండిపడ్డారు. విదేశీ పత్రికలు కూడా సైనిక చర్యలను ప్రశంసిస్తున్నాయని అన్నారు. పాక్ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని, సైనిక చర్యపై కేజ్రీవాల్‌కు విశ్వాసం ఉందా? లేదా అని రవిశంకర్ ప్రశ్నించారు. అసత్య ప్రచారాలను ఆయన నమ్ముతున్నారని, కేజ్రీవాల్ వైఖరి దురదృష్టకరమని ఆయన అన్నారు.


