విశాఖలో అంతరిక్ష వారోత్సవాలు: పోస్టర్ విడుదల చేసిన ఏయూ వీసీ
- 25 Views
- October 5, 2016
- అంతర్జాతీయం
విశాఖపట్నం, అక్టోబబర్ 5 (న్యూస్‌టైమ్): ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను ఆంధ్రవిశ్వవిద్యాలయం వేదికగా విశాఖలో నిర్వహిస్తున్నట్లు ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఉదయం తన కార్యాలయంలో కార్యక్రమాల పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో), సతీష్ థావన్ స్పేస్ సెంటర్(షార్)లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయన్నారు. ముఖ్యంగా యువతకు, విద్యార్థులకు భారతీయ అంతరిక్ష ప్రయోగ సంపత్తిని, శక్తిని తెలియజేసే విధంగా ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను ఏర్పాటుచేస్తున్నామన్నారు. వీడియో ప్రదర్శన, పోస్టర్లు, కరపత్రాలు, రాకెట్ల నమూనాలతో అంతరిక్ష ప్రయోగ విధానాలను వివరించడం జరుగుతుందన్నారు.
పాఠశాలల చిన్నారులకు క్విజ్, వక్తృత్వం, వ్యాసరచన పోటీలను నిర్వహిస్తామన్నారు. ఈసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైన్‌ను సందర్శించాలని సూచించారు. కార్యక్రమ స్థానిక సమన్వయకర్త ఆచార్య కె.వి.ఎస్.ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన ఏయూ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించే ముగింపు వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరవుతారన్నారు. ఈనెల 8వ తేదీన ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశమందిరంలో జరిగే ప్రారంభోత్సవ వేడుకలకు షార్ డిప్యూటి డైరెక్టర్ వి.రంగనాథం, ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు, రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావులు పాల్గొంటారు. కార్యక్రమంలో షార్ అధికారులు పాల్గొన్నారు.


