ఆకట్టుకున్న అమరావతి షాపింగ్ ఫెస్టివల్
- 15 Views
- October 12, 2016
- రాష్ట్రీయం
విజయవాడ, అక్టోబర్ 12 (న్యూస్‌టైమ్): పిడబ్యూడి గ్రౌండ్లో మంగళవారం జరిగిన అమరావతి షాపింగ్ ఫెస్టివల్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. వేడుకలలో పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్, శాసనమండలి సభ్యుడు బుద్దావెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో ప్రప్రధమంగా భారీ ఎత్తున షాపింగ్ ఫెస్టివల్ నిర్వహణను చేపట్టామన్నారు. నగర ప్రజలకు ఇప్పటివరకు ప్రకాశం బ్యారేజీ, అమ్మవారి ఆలయాలు మాత్రమే చూసేందుకు వెళ్ళేవారని, ఇప్పుడు నగరం మొత్తం సందర్శించేలా వాతావరణం కల్పించడంలో ప్రభుత్వం విజయవంతమైందన్నారు.
నగరానికి ఒక విశిష్టతను తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి ప్రతి నెల నగరంలో ఎదో ఒక్క కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారన్నారు. షాపింగుతో పాటు నగర ప్రజలకు బహుమతులు కూడా అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు ప్రజలలో అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌పై మంచి స్పందన వస్తోందని, ప్రతి ఒక్కరు ఈ వేడుకలలో భాగస్వాములు కావాలని కేశినేని శ్రీనివాస్ నగర ప్రజలను కోరారు. మానసిక విలాసానికి ఇటువంటి ప్రాంతాలలో కుటుంబ సభ్యులతో కలసి పర్యటించాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా మంగళవారం కొనుగోలుదారుల నుంచి విజేతలను ఎంపిక చేసే లక్కీ డిప్‌ను తీశారు. ఈ సందర్భంలో మంగళవారం కోనుగోలు చేసిన కొనుగోలుదారుల్లో ఎన్.కృష్ణారావు, ఏసువాణిలు లక్కీడిప్‌లో విజేతలుగా నిలిచారు. ఈ వేడుకల నేపధ్యంలో మంగళవారం ప్రముఖ సినీ నేపధ్య గాయకుడు బాబా సెహగల్ పాటలతో ప్రాంగణాన్ని ఉరూత్తలూగించారు. నంద కిషోర్ యాంకర్‌గా, పార్థసారధి, శ్రీలేఖ గాయనీ, గాయకులుగా ఎ.ఎస్.ఎఫ్ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వీరికి సహాయ గాయకులుగా భాస్కర్, ప్రమోద్, కార్తిక్, అనూష, విషుప్రియ వ్యవహరించారు.


