నెలాఖరుకు ప్రజాసాధికార సర్వే పూర్తి: జేసీ వెల్లడి
- 16 Views
- October 25, 2016
- స్థానికం
కాకినాడ, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): జిల్లాలో ప్రజాసాధికార సర్వే కార్యక్రమాన్ని ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని తూర్పు గోదావరి జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యన్నారాయణ తెలియజేశారు. మంగళవారం మద్యాహ్నం రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కమీషనర్ అనిల్ చంద్ర పునేటా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యన్నారాయణ పాల్గొని జిల్లాలో ప్రజా సాధికార సర్వే పురోగతిని, సత్వరం పూర్తి చేసేందుకు చేపట్టిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆన్లైన్ కనెక్టీవిటీ పరిధిలోని గ్రామీణ కుటుంబాల సర్వే నూరు శాతం పూర్తి చేశామని, వ్యక్తుల వారీ కెవైసి వివరాల నమోదు 86 శాతం పూర్తయిందన్నారు.
అలాగే పట్టన ప్రాంతాల్లో 95.8 శాతం కుటుంబాల సర్వే పూర్తి కాగా, 77 శాతం వ్యక్తులవారీ కేవైసి ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. జిల్లాలోని పట్టన ప్రాంతాల్లో 4 లక్షలు, ఆన్లైన్ కనెక్టీవిటీ పరిధిలో లేని ఏజెన్సీ మండలాల్లో మరో 4 లక్ష 77 వేల జనాభా సర్వే ఇంకా మిగిలి ఉందని, నెలాఖరులోపున ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఏజెన్సీ మండలాల్లో ప్రజాసాధికార నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు ఆఫ్ లైన్ సర్వే ప్రక్రియపై రెండు రోజుల పాటు శిక్షణ నిర్వహించామని తెలిపారు.
పట్టన ప్రాంతాలకు సంబంధించి 12 మున్సిపాలిటీలకు గాను 8 మున్సిపాలిటీలలో సర్వే చురుకుగా జరుగుతోందని, మందకొడిగా సాగుతున్న రాజమండ్రి అర్భన్, ఏలేశ్వరం, పెద్దాపురం పట్టనాల సర్వే ప్రగతిని టెలికాన్ఫరెన్స్ ద్వారా నిత్యం సమీక్షిస్తున్నామని జాయింట్ కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రంపచోడంవరం సబ్‌కలెక్టర్ పి.రవి, కలెక్టరేట్ ఎఓ తేజేశ్వరరావు, సెక్షన్ అధికారులు పాల్గొన్నారు.


