తుపాను ముప్పు పట్ల యంత్రాంగం అప్రమత్తం: కమిషనర్
- 16 Views
- October 26, 2016
- తాజా వార్తలు
విశాఖపట్నం, అక్టోబర్ 26 (న్యూస్టైమ్): భారత వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరికల నేపధ్యంలో గురువారం నుండి నగర పరిధిలో ఈదురు గాలులు, భారీ వర్షాలకు అవకాశం ఉన్నందున ప్రజలు, అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వుండాలని జీవీఎంసీ కమిషనర్ ఎం.హరినారాయణన్ పేర్కొన్నారు. క్షేత్ర పర్యటనలో భాగంగా బుధవారం అన్ని జోన్ల అధికారులు, ఏఎంహెచ్ఓలు, ఇంజనీర్లు, ప్రజారోగ్య అధికారులకు సెట్లో హెచ్చరించారు. గురువారం నుండి తుఫాన్ ముప్పు వుండే అవకాశం వున్నందున అందరు అధికారులు సిబ్బంది సహకరించాలని పేర్కొన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా వుండాలని సూచించారు. అనంతరం పిఠాపురం కాలనీలో నేతాజీనగర్, కాయగూరల మార్కెట్, 16వ వార్డులలో పర్యటించి పలు సూచనలు చేసారు. జీవీఎంసీ వీధులలో పరిసరాల పరిశుభ్రత, డ్రెయిన్ క్లీనింగ్, శివాజీపాలెం ప్రాంతాలలోని గెడ్డలు, డ్రెయిన్లను క్లియర్ చేయాలని ఆదేశించారు. ఖాళీ స్థలాలు గలీజుగా వుండడంతో ఆ ప్రదేశాన్ని పరిశుభ్రం చేసి జరిమానా విధించాలని సూచించారు. అనంతరం శివాజీ పార్కును సందర్శించారు. పార్కులను సమర్ధవంతంగా నిర్వహించి, సందర్శకులు పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు ఉత్తమ సేవలందించడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. పర్యటనలో జోన్-2 కమిషనర్ పి.నల్లనయ్య, ఏఎంహెచ్ఓ ఎల్.కె.సుధాకర్, ఇఇ వెంకటి, ఏసీపీ వెంకటేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ చిరంజీవితదితరులు పాల్గొన్నారు.


