అసలు తిరకాసు వ్యవస్థదే…
- 18 Views
- December 23, 2016
- సంపాదకీయం
గత ఏడాది జరిగిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో ఒక్క మిజోరం మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. అయితే దేశ రాజధాని ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో మాత్రం ప్రజలు కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించినా బీజేపీ, ఆమ్ఆద్మీ పార్టీలలో దేనికీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినంత మెజారిటీ ఇవ్వకపోవడంతో ఫలితాలు వెలువడి దాదాపు ఏడాదిన్నర అవుతున్నా అంతుచిక్కని అంశం. ఇటువంటి పరిస్థితిని దేశంలోని ఏ రాజకీయ పార్టీ గతంలో గమనించి ఉండదు.
ఎవరికీ మెజారిటీ రానప్పుడు సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతాయి. కానీ ఢిల్లీలో ప్రత్యక్ష మద్దతుతో కానీ, వెలుపలి మద్దతుతో గానీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం కనిపించడం లేదు అప్పట్లో. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని పార్టీకి ప్రభుత్వం ఏర్పాటులో మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ ముందుకు వచ్చినా కేజ్రీవాల్ నిరాకరించారు. ఎవరికీ మెజారిటీ రాని స్థితిలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పూర్వోదంతాల ఆసరాగా అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.
కానీ తమకు స్పష్టమైన మెజారీటీ లేనందువల్ల ఆ పని చేయలేమని ఆ పార్టీ తేల్చి చెప్పింది. ఆ తర్వాత నజీబ్ జంగ్ కేజ్రీవాల్‌ను ఆహ్వానించారు. ఎన్నికలు పూర్తైన తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు సకల ప్రయత్నాలూ చేయడం గవర్నర్ విధి. అందులో నజీబ్ జంగ్ ఏ లోపమూ చేయలేదు. ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇవ్వడానికైనా తీసుకోవడానికైన కేజ్రీవాల్ 18 షరతులు విధించారు. ఈ షరతులు నిరాకరించదగినవీ కాదు, ఆయన కోర్కెలు అసంబద్ధమైనవీ కాదు. కాని వాటిని కాంగ్రెస్, బీజేపీ కూడా తిరస్కరించాయి.
అయినా ఆ షరతులు ప్రస్తుత పరిస్థితుల్లో ఊహాలోకంలో విహరించేవిగానే కనిపిస్తాయి. మన వ్యవస్థ ఉన్న స్థితి అలాంటిదే మరి. అతిపెద్ద పార్టీగా అవతరిచిన బీజేపీకే ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి లేనప్పుడు కేజ్రీవాల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసి చూపించాలని కోరడం కజ్జాకోరుతనమే. ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి అవసరమైంది నాలుగు సీట్లే. కేజ్రీవాల్‌కు కావాల్సింది ఎనిమిది సీట్లు.
అప్పుడు కేజ్రీవాల్ ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేయగలరో బీజేపీ ఆలోచించలేదని అనుకోలేం. కాంగ్రెస్ మద్దతుతో ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అవినీతి వ్యతిరేక పోరాటయోధుడినని టముకు వేస్తున్న పెద్దమనిషి పచ్చి అవినీతికరమైన కాంగ్రెస్‌తో పొత్తుకూడారు చూశారా? అని దెప్పి పొడవడానికే బీజేపీ కేజ్రీవాల్ మీద ఒత్తిడి చేస్తున్నట్టుంది. ఆ పార్టీ రాజకీయ దూరదృష్టి అంత పదునైందనుకోవాలా? కేజ్రీవాల్ ఇలాంటి షరతులు పెట్టడం ప్రభుత్వ ఏర్పాటు బాధ్యత నుంచి తప్పించుకోవడానికి అనుసరిస్తున్న ఎత్తుగడ మాత్రమే నని రెండు పార్టీలూ దుయ్యబడుతున్నాయి.
కాంగ్రెస్, బీజేపీ రెండూ అవినీతికర పార్టీలే గనక, రెండింటి సిద్ధాంతాలూ ఒకటే గనక ఆ పార్టీల మద్దతు తీసుకోం అన్నది కేజ్రీవాల్ వాదన. కేజ్రీవాల్ సగటు రాజకీయ నాయకుడిగా వ్యవహరించ దలచుకోలేదు. ఆయన నిఖార్సైన వాడినని నిరూపించుకోవాలనుకుంటున్నట్టుంది. మంచిదే కానీ రాజకీయాలు ఎల్ల వేళలా రూళ్ల కర్రల మధ్య ఇమడవు. సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకోవడం అవసరం. అసాధ్యాన్ని సాధ్యం చేయడం కూడా రాజకీయ విద్యలో భాగమే. తాము చెప్పేది ఎంత మహత్తరమైనదైనా ప్రజలు దానికి అనుగుణంగానే తీర్పు చెప్పాలని బలవంత పెట్టడం ప్రజాస్వామ్యంలో అయితే కుదరదు. కుదరాలనుకుంటే అది ప్రజాస్వామ్యంగా మిగలదు.
ప్రజా తీర్పు తాము ప్రతిపక్షంలో కూర్చోవడానికేననీ, అయినా ఇది చరిత్రాత్మకమైన తీర్పు అనీ, ప్రస్తుత వ్యవస్థతో ప్రజలు విసిగిపోయారనీ, నీతి నిజాయితీలకు కట్టుబడిన రాజకీయాలకు శూన్యత ఉందనీ కేజ్రీవాల్ అంటున్నారు. కానీ అదే నోటితో బీజేపీ కాంగ్రెస్‌లో ఊపిరి సలపకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటే తమతో చేతులు కలపాలని కూడా ఆహ్వానిస్తున్నారు. ఎన్నికైన శాసనసభ్యులు కొత్త శాసనసభ ఏర్పడక ముందు పార్టీ మారినా ఫిరాయింపుల చట్టం వర్తించదన్న ధర్మసూక్ష్మాన్ని కేజ్రీవాల్ బాగానే గ్రహించారు.
అక్కడ ఆయన నైతికతకు భంగం కలగడంలేదు కాబోలు. మినహాయింపులతో కూడింది రాజకీయం అవుతుంది గానీ నిఖార్సైన నీతి కాదుగా! ప్రభుత్వ ఏర్పాటుకు అనువైన కూడికలూ తీసివేతలు కుదరని పరిస్థితి ఇప్పుడు ఢిల్లీలో ఏర్పడినట్టే 1960లో కేరళ శాసన సభలోనూ ఎదురైంది. సకల ప్రయత్నాలూ విఫలమైన తర్వాత రాష్ట్రపతి పాలన విధించి ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పుడూ అదే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏదో ఒక పక్షం ప్రభుత్వం ఏర్పాటు చేయక తప్పదు. కుదరక పోతే రాష్ట్రపతి పాలన అనివార్యం అవుతుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితిలోనూ శాసనసభ గడువు పొడిగించడం అప్పట్లో కుదరదు.
మనం అనుసరిస్తున్న మొదట ఎవరు గీత దాటితే వారే విజేతలు అన్న ఎన్నికల విధానం వల్ల వివిధ పార్టీలు సాధించిన ఓట్ల శాతానికీ సీట్లకు మధ్యన పొంతన కుదరడం లేదు. ఉదాహరణకు చత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాలనే పరిశీలిద్దాం. అక్కడ మొత్తం 90 స్థానాలుంటే బీజేపీ 49 స్థానాలు సంపాదించి అధికారం నిలబెట్టుకుంది. కాంగ్రెస్ 39 స్థానాలు సంపాదించింది. విచిత్రం ఏమిటంటే ఈ రెండు పార్టీలు సంపాదించిన సీట్ల తేడా పది అయినా ఓట్ల శాతంలో తేడా మాత్రం 0.75 శాతమే. అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఈ 0.75 శాతం ఓట్ల ఆధిక్యం వల్ల కాంగ్రెస్ కన్నా పది స్థానాలు ఎక్కువ సంపాదించగలిగింది. అంటే 0.75 శాతం ఓట్లు తక్కువ వచ్చిన కాంగ్రెస్ ఏకంగా పది స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది.
అలాగే ఢిల్లీలో ఓట్ల శాతాన్ని పరిశిలిస్తే 29.6% ఓట్లు వచ్చిన కేజ్రీవాల్ పార్టీకి 28 సీట్లు వచ్చాయి. 25% ఓట్లు సంపాదించిన కాంగ్రెస్‌కు 8 సీట్లు మాత్రమే వచ్చాయి. ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు వచ్చే పద్ధతి గనక ఉంటే కాంగ్రెస్ కు 23 స్థానాలు దక్కాలి. కాంగ్రెస్‌కు ఆమ్ఆద్మీ పార్టీకి మధ్య ఓట్ల తేడా 5 శాతమే. ఆమ్ఆద్మీ పార్టీకి బీజేపీ మధ్య ఉన్న వ్యత్యాసం కూడా దాదాపు ఐదు శాతమే అయినా బీజేపీకి 31 స్థానాలు దక్కాయి. ఒక పార్టీ సాధించిన సీట్ల మధ్య వ్యత్యాసం ఆమ్ఆద్మీ పార్టీకి, కాంగ్రెస్‌కు మధ్యన అదే ఐదు శాతం అయినా కాంగ్రెస్ 20 సీట్లు కోల్పోయింది. ఆమ్ఆద్మీ పార్టీతో పోలిస్తే దాదాపు ఐదు శాతం ఓట్ల తేడా ఉన్న బీజేపీకి 20 సీట్లు కాకుండా మూడు మాత్రమే పెరిగాయి.
మనం అనుసరిస్తున్న ప్రస్తుత ఎన్నికల విధానం ఓట్లకూ సీట్లకూ పొంతన కుదరనివ్వనిది. ఇదే మనం దామాషా పద్ధతి అనుసరిస్తే సీట్ల సంఖ్యలో గణనీయమైన మార్పు కనిపిస్తుంది. నిజానికి దామాషా పద్ధతే ప్రజల తీర్పుకు అసలైన గీటురాయి. దామాషా పద్ధతి అనుసరించి ఉంటే ఢిల్లిలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని దుస్థితి తప్పేది.
బీజేపీ కాంగ్రెస్ దొందూ దొందే అంటున్న కేజ్రీవాల్ ఎన్నికల విధానంలో మౌలిక మార్పులు కోరడం లేదు. సవ్యంగా వ్యవహరించని చట్ట సభల సభ్యులను వెనక్కి పిలిపించాలనే మాట్లు వేయడానికి ఉపకరించే సంస్కరణలు మాత్రమే అడుగుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ సిద్ధాంతాలు ఒకటే అంటున్న కేజ్రీవాల్ నీతిమంతమైన రాజకీయాలు మీద చూపిన దృష్టి తన రాజకీయ సిద్ధాంత ప్రాతిపదికను విడమర్చడంలో చూపలేదు. ఆయన రాజకీయాలు ఆ రెండు రాజకీయ పార్టీల విధానాలకన్నా ఎలా మెరుగైనవో చెప్పనే లేదు.
విధానాలు, సిద్ధాంతాల్లో మౌలికమైన తేడా ఏమిటొ ప్రజలకు విడమర్చనే లేదు. అవినీత రహిత వ్యవస్థను కోరుకోవడం కచ్చితంగా ఆహ్వానించదగిందే అయినా అవినీతి నిర్మూలన ఒక్కటే సకల సమస్యలకు పరిష్కారం చూపదు. ఒక వేళ చూపుతుందనుకున్నా వ్యవస్థలో మౌలిక మార్పులు లేనిదే అదీ అసాధ్యమే అవుతుంది. రాజకీయ నాయకుల అవినీతికి ప్రధాన కారణం మనం అనుసరిస్తున్న ఎన్నికల విధానమే ప్రధాన కారణం. అందుకే విధానాలు ఎవరికీ ముఖ్యం కావడం లేదు.
దామాషా ఎన్నికల వ్యవస్థను అమలు చేస్తే చట్ట సభల స్వభావమూ మారుతుంది. ఎన్నికల్లో డబ్బు వెదజల్లే రుగ్మత చాలా వరకు మాయమవుతుంది. పార్టీల విధానాలకు ప్రాధాన్యం దక్కుతుంది. డబ్బుసంచులు, జబ్బపుష్ఠి ఉన్నవారు చట్ట సభల్ల్లో దర్జాగా ఆసీనులయ్యే దురవస్థనుంచీ బయట పడగలుగుతాం. విధానాలకు ప్రాధాన్యం దక్కినప్పుడు నేరస్థులు చట్ట సభల్లో తిష్ఠ వేసే బెడదా తగ్గుతుంది. దుష్టాంగాన్ని ఛేదించవలసిన సమయంలో కాయకల్ప చికిత్సల వల్ల ప్రయోజనం పెద్దగా ఉండదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే మరో అయిదు రాష్ట్రాల ఎన్నికలను కేంద్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎలా ఎదుర్కోనున్నాయన్నదే అంతుచిక్కని ప్రశ్న.


