విశ్వాన్ని కలిపే ఇంధనం… ఇంటర్నెట్!
- 17 Views
- January 8, 2017
- Home Slider అంతర్జాతీయం
మనం అతి సులువుగా పేర్కొనే ఇంటర్నెట్ నిజంగా విశ్వాన్ని కలిపే ఇంధనమనే చెప్పొచ్చు. దీని వల్ల కలిగే మంచి చెడులను పక్కనపెడితే విజ్ఞానాన్ని పెంపొందించే సాధనంగా మాత్రం అనేక కోట్ల మందికి ఉపయోగపడుతోంది ఇంటర్నెట్. ఇంటర్నెట్ అన్న మాట తెలుగులో అంతర్జాలంగా వాడుకలోకివచ్చింది. ఇంటర్నెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లను కలిపే ఒక వ్యవస్థ. మరింత వివరంగా చెప్పాలంటే ఇంటర్నెట్ నెట్‌వర్క్‌లను కలిపే నెట్వర్క్. ఈ వ్యవస్థలో ఉన్న కంప్యూటర్లు ఒకదానితో ఒకటి సంభాషించుకొనేటందుకు ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనే నియమావళిని ఉపయోగిస్తారు. ఇంటర్నెట్ అంటే ఏమిటో అర్ధం అవటానికి ఒక చిన్న ఉపమానం చెప్పుకోవచ్చు.
ఒక పేటలో ఉన్న ఇళ్ళని కలుపుతూ ఒక వీధి ఉంటుంది. ఒక ఇంటి నుండి మరొక ఇంటికి వెళ్ళటానికి ఈ వీధి అవసరం. ఊళ్ళో ఉన్న పేటలన్నిటిని కలుపటానికి అల్లిబిల్లిగా అల్లుకుని ఊరు నిండా పెద్ద రహదారులు (రోడ్లు) ఉంటాయి. ఒక ఊరు నుండి మరొక ఊరుకి వెళ్ళటానికి ప్రాంతీయ రహదారులు ఉంటాయి. ఒక దేశం నుండి మరొక దేశం వెళ్ళటానికి సముద్రంలోనూ, ఆకాశంలోనూ ‘అంతర్జాతీయ రహదారులు’ ఉంటాయి. ఒక మేపులో చూస్తే ఈ చిన్నవీధులు, రహదారులూ అన్ని ఒక జాలరివాడి వలలా కనిపిస్తాయి.
ఇదే విధంగా ప్రపంచంలో ఉన్న కంప్యూటర్లు అన్నీ కూడా చిన్న చిన్న ప్రాంతీయ వలల లాగా, పెద్ద పెద్ద అంతర్జాతీయంగా అల్లుకుపోయిన వలల లాగా కనిపిస్తాయి కనుక వీటిని అంతర్జాలం అంటారు. ఇంటర్నెట్ ద్వారా ఎటువంటి సమాచారాన్ని అయినా క్షణాల్లో సేకరించుకోవచ్చు. ఇంటర్నెట్ కంప్యూటర్లకు సమాచారం చేరవేసే అద్భుతమైన సాధనం. అన్ని కంప్యూటర్లకు అందుబాటులో ఉండే కమ్యూనికేషన్ టెక్నాలజీ సాధనమే ఇంటర్నెట్. ప్రపంచంలోని అన్నిరకాల నెట్ వర్కులన్నింటి వల్ల కమ్యూనికేషన్ ప్రక్రియలో కోట్లాది మంది వ్యక్తులు అనుసంధానంలో ఉంటారు.
మెషిన్లు శాటిలైట్లు, సర్వర్లు, కంప్యూటర్లు ఒకదానితో మరొక్కటి అనుసంధానించిన అసంఖ్యాకమైన స్టాప్‌వేర్ ప్రొగ్రాంలు ప్రపంచ వ్యాప్తంగా ఆయా కంప్యూటర్లలో నిక్షిప్తమై ఉన్న బహ్మండమైన నెట్వర్క్.. ఇవన్నీ ఇంటర్నెట్లో భాగాలే. ప్రతిరోజూ కోట్లాది మంది సమాచారాన్ని తీసుకునే ఆధునాతనమైన కమ్యూనికేషన్ మీడియా ఇంటర్నెట్. వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వ పరిపాలనా దాకా ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో మన దశ, దిశ గురించి తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ మాతృకను అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది.
1973లో ఇంగ్లాండు-నార్వే మధ్య ప్రపంచ మొట్టమొదటి కమర్షియల్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ప్రారంభమైంది. 1982లో ఇంటర్నెట్ ప్రోటోకాల్ అన్నమాట వాడ కం ప్రారంభమైంది. ప్రతి నిమిషం ఇంటర్నెట్ ద్వారా వేలకోట్ల రూపాయల వ్యాపా ర లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఏ రంగానికైనా కావలసిన సమాచారం ఇంటర్నెట్లో అవలీలగా లభ్యమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వేలాది టీవీ చానళ్లు, వార్తాపత్రికలు అలాగే విద్యార్థుల చదువులు, ఫలితాలు, కౌన్సిలింగ్, రైతులు, మీ సేవా వంటి సేవలు ఇట్లా ఏ రంగాన్ని నెట్‌తో సంబంధం లేకుండా ఊహించుకోలేము.
ఇంటర్నెట్ చరిత్ర చాలా పెద్దది. అమెరికా భద్రతా విభాగమయిన ‘ఎడ్వాన్సెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ ఆర్పా)’ వారి నిధులతో సృష్టించబడింది. చాలా మందికి ఇంటర్నెట్కి వరల్డ్ వైడ్ వెబ్‌కి మధ్య ఉన్న తేడా కూడా తెలియదనడం అతిశయోక్తిమాత్రం కాదు. ఈ రెండింటిని ప్రత్యామ్నాయ పదబంధాలుగా వాడేస్తూ ఉంటారు. అలా చెయ్యడం వల్ల కొంప ములిగిపోయే నష్టం ఏమీ లేదు కానీ, ఈ రెండింటికి మధ్య తేడా ఉండడం ఉంది. అంతర్జాలం అంటే ఏమిటో చిన్న ఉదాహరణతో చెప్పడం తేలిక.
మన దేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ఊళ్లని ఎన్నింటినో కలుపుతూ రైలు మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలన్నీ గుర్తించిన దేశపటాన్ని చూస్తే అంతా గజిబిజిగా అల్లిక అల్లిన గుడ్డలా గీతలు కనిపిస్తాయి. దీనిని మనం ఇంగ్లీషులో అయితే రైల్వే నెట్వర్క్ అంటాం. తెలుగులో కావలిస్తే వలలా అల్లుకుపోయిన రైలు మార్గాలు అని అనవచ్చు, లేదా టూకీగా రైలు మార్గాల వలయం అనో మరీ టూకిగా రైలు వలయం అనో అనొచ్చు. ఇప్పుడు ఒక్క సారి చరిత్రలో వెనక్కి వెళ్తే, మనకి స్వతంత్రం రాక పూర్వం దేశంలో ఉన్న రైలు మార్గాలని బ్రిటిష్ ప్రభుత్వం నడిపేది కాదు.
ప్రెవేటు రంగంలో కంపెనీలు నడిపేవి. మద్రాస్ సదరన్ మరాటా రైల్వే వారి మార్గం ఒకటి మద్రాసు నుండి వాల్తేరు వరకు వెళ్లేది. ఇలాంటి మార్గాలు ఇంకా చాలానే ఉండేవనుకోండి. వీటన్నిటిని కలిపి ఎం.ఎస్.ఎం. రైలు వలయం అనేవారు. బెంగాల్ నాగపూర్ రైల్వే వారి మార్గం ఒకటి వాల్తేరు నుండి హౌరా వరకు వెళ్లేది. ఇలాంటి మార్గాలు వారికీ చాలా ఉండేవి. వీటన్నిటిని కలిపి బి.ఎన్.ఆర్. రైలు వలయం అనేవారు. ఇలాగే నైజాం రైలు వలయం, మైసూర్ రైలు వలయం వగైరాలు ఉండేవి. ఇవన్నీ వేర్వేరు రైలు వలయాలు.
అయినప్పటికీ ఒకరి రైలు బళ్లు మరొకరి పట్టాల మీద ఇబ్బంది లేకుండా నడిచేవి. ఈ రకం ఏర్పాటుని అంతర్‌వలయం అనొచ్చు (అంతర్ జాతీయంలా). అనేక దేశాల ఉమ్మడి సంస్థలకి పేర్లు పెట్టవలసి వచ్చినప్పుడు ఇంగ్లీషులో ఇంటర్ అనే విశేషణం వాడతాం. అదే విధంగా అనేక వలయాలని ఉమ్మడిగా ఉపయోగించినప్పుడు ఆ ఉమ్మడి వలయాన్ని ఇంటర్నెట్ అనొచ్చు; లేదా తెలుగులో అంతర్‌వలయం అనో ఉమ్మడి వలయం అనో పిలవచ్చు.
చేపలని పట్టే వలని జాలం అనిన్నీ, పట్టేవాడిని జాలరి అనీ అన్నట్లే, పైన చెప్పిన రైలు మార్గాల అమరికని అంతర్జాలం అనిన్నీ ఈ అంతర్జాలాన్ని వాడే వారిని అంతర్‌జాలరులు అనిన్నీ కూడా అనొచ్చు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా అల్లుకుపోయిన గిడ్డంగులని విశ్వ వ్యాప్త గిడ్డంగుల అల్లిక అందాం. దీనినే ఇంగ్లీషులో అంటే వరల్డ్ వైడ్ వెబ్ అవుతుంది. ఇక్కడ వెబ్ అన్న పదం స్పైడర్ వెబ్ లాంటి ప్రయోగం కనుకనున్నూ, స్పైడర్ వెబ్‌ని తెలుగులో సాలె గూడు అని కాని, సాలె పట్టు అని కాని అంటాము కనుకనున్నూ, వరల్డ్ వైడ్ వెబ్‌ని ప్రపంచ పరివ్యాప్తమైన పట్టు లేదా పపప అనొచ్చు. రైలు పట్టాలు లేకుండా కేవలం గిడ్డంగులు, ఆ గిడ్డంగులలో సామానులు ఉండి మాత్రం ఏమి లాభం?
అలాగే రైలు మార్గాలు ఉండి, వాటి మీద రవాణా చెయ్యడానికి సరుకులు లేకపోతే ఏమి ప్రయోజనం? కనుక రైలు మార్గం లాంటి ఇంటర్నెట్టూ, అల్లుకుపోయిన గిడ్డంగులు లాంటి వర్లడ్ వైడ్ వెబ్బూ, రెండూ ఉంటేనే ప్రయోజనం. ఇంటర్నెట్ రవాణాకి కావాలి. వెబ్ సరుకులు దాచుకుందికి కావాలి. ఈ ఉపమానం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు రైలు మార్గాలకి బదులు సమాచార ప్రసార మార్గాలు అంటే టెలిఫోను సౌకర్యాలలాంటి వాటి గురించి తెలుసుకుందాం. రైలు మార్గాలలాగే ఈ సమాచార ప్రసార మార్గాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి కదా.
ఇప్పుడు ఈ సమాచార వలయానికి (అంతర్జాలానికి, ఇంటర్నెట్కి) మన కంప్యూటరుని (మన గిడ్డంగిని లేదా మన వెబ్ పేజిని) తగిలించేమనుకొండి. మనం ఇతరులతో పంచుకోవాలనుకున్న వ్యాసాలు, కథలు, ఛాయాచిత్రాలు, పాటలు, వగైరాలని మన కంప్యూటర్లో ఉన్న మన గిడ్డంగిలో పెడితే అప్పుడు అవన్నీ ఆ సమాచార వలయంతో లంకించుకున్న వారందరి అందుబాటులోకి వస్తాయి. టూకీగా ఇదీ కథ. మనం ఇతరులతో పంచుకోదలచిన సమాచారాన్ని కంప్యూటర్లో ఎక్కడ దాచుకుంటామో ఆ స్థలం మన వెబ్సైట్ లేదా తెలుగులో మన గిడ్డంగి అనో మన ఆటపట్టు అనో అందాం. ఈ ఆటపట్టులో ఉండేవి చింతపండు, బెల్లం కాదు – సమాచారం.
కనుక ఈ వెబ్ సైట్ (ఆటపట్టు)ని పుస్తకంలో పేజీలలా అమర్చుకుంటే చదివేవారికి సదుపాయంగా ఉంటుంది. అప్పుడు ప్రతి పేజీని వెబ్ పేజ్ లేదా పట్టు పుట అని కాని పట్టు పత్రం అని కాని అనొచ్చు. పుస్తకానికి ముఖపత్రం ఎలాంటిదో అలాగే ఆటపట్టు (వెబ్ సైట్)కి ముఖపత్రం (హోం పేజీ) అలాంటిది. పుస్తకం కొనేవాడు అట్ట మీద బొమ్మ చూసి కొంటాడు. ఇంట్లోకి వచ్చేవాడు వీధి వాకిలి ఎలా ఉందో చూస్తాడు. కనుక ప్రతి వెబ్ సైట్‌కి అందంగా ఉన్న ముఖపత్రం ఒక ముఖ్యమైన అంగం.


