కరీంనగర్లో శరవేగంగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు
- 16 Views
- January 14, 2017
- Home Slider రాష్ట్రీయం
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వాటర్ గ్రిడ్ పథకం ప్రణాళిక సిద్ధం అయింది. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసేందుకు కరీంనగర్ జిల్లా అధికారులు శరవేగంగా ముందుకు సాగుతున్నారు. జిల్లాలోని 13 నియోజకవర్గాలలోని అన్ని గ్రామాలకు రక్షిత నీటిని అందించే దిశగా 7 గ్రిడ్ లను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. సిరిసిల్ల, చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాలకు సంబంధించి గ్రిడ్‌ను మొదటి దశలో నిర్మాణం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
ఈ గ్రిడ్‌కు సంబంధించిన సర్వే పనులు పూర్తయిన తర్వాత టెండర్లను పిలవాలని అధికారులు భావిస్తున్నారు. వాటర్ గ్రిడ్ నిర్మాణంలో భాగంగా జిల్లాలోని వనరులను కూడా అధికారులు గుర్తించారు. ఇందుకోసం ఎస్సారెస్పీ, మిడ్ మానేర్, లోయర్ మానేర్, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లతో పాటు గోదావరి జలాలను వినియోగించుకోనున్నారు. సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాలకు సంబంధించిన గ్రిడ్ పనుల సర్వే ఇప్పటికే ప్రారంభం అయింది. ప్రతి ఏటా 20 టీఎంసీల నీరు అవసరముంటుందని అంచనాలు కూడా వేశారు.
ఈ అర్బన్ గ్రిడ్‌కు 2047 వరకు సరిపడే డిజైన్ కూడా అధికార యంత్రాంగం రూపొందించింది. జగిత్యాల, కోరుట్ల నియెజక వర్గాలకు సంబంధించిన వాటర్ గ్రిడ్ కోసం 865 కోట్ల రూపాయలు అవసరమని అంచనాలు తయారు చేసిన అధికారులు ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ ద్వారా ఈ గ్రిడ్‌కు నీటిని తరలించనున్నారు. వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి గ్రిడ్‌కు రూ.920 కోట్లు వెచ్చిస్తుండగా మిడ్ మానేరు నుంచి నీటిని వినియోగించుకోనున్నారు.
ఇదే ప్రాజెక్ట్ నుంచి మానకొండూర్, హుస్నాబాద్ సెగ్మెంట్ పరిధిలోని గ్రామాలకు తాగు నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. హుజురాబాద్ మొత్తం, మానకొండూర్‌లోని కొన్నిగ్రామాలకు సరఫరాచేసే గ్రిడ్ నుంచి వరంగల్ జిల్లాలోని కొన్ని గ్రామాలకు నీటి సరఫరా చేసేందుకు రూ.1300 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసిన అధికారులు ఈ ప్రాంతాలకు కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యాం నుంచి నీటిని తరలిస్తారు.
మరోవైపు, ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం, మంథనిలోని కొంత ప్రాంతానికి రామగుండం సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారా నీటిని సరఫరా చేయాలని భావిస్తున్నారు. మంథని నియోజకవర్గంలోని మహదేవ్ పూర్, కాటారం, మల్హర్, మహాముత్తారం మండలాలను రూ.160 కోట్లతో ప్రత్యేకంగా గ్రిడ్‌ను ఏర్పాటు చేసి గోదావరి జలాలను వినియోగించనున్నారు.
ఈ గ్రిడ్ ద్వారానే వరంగల్, నల్గొండ జిల్లాలకు కూడా నీటి సరఫరా చేయాలని ప్రజా ప్రతినిధులు, అధికారులు భావిస్తున్నారు. అయితే జిల్లా మొత్తంగా ఏడు వాటర్ గ్రిడ్ల ద్వారా రక్షిత నీటిని అందించాలని నిర్ణయించిన అధికారులు ఈ పథకాన్ని పూర్తి చేస్తే ప్రతి ఇంటికి రక్షిత మంచి నీరు అందనుంది.


