బస్తీమే సవాల్!
- 20 Views
- January 16, 2017
- Home Slider జాతీయం
లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీలో రాజకీయ డ్రామా రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తండ్రీ కొడుకల మధ్య రేగిన రగడ చిలికిచిలికి గాలివానలా మారడమే కాకుండా ఏకంగా పార్టీ విచ్చిన్నానికే కారణమైంది. ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు, ఆయన తండ్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన ములాయం సింగ్ యాదవ్‌కు మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే.
అఖిలేశ్ తన మాటను ఏమాత్రం వినట్లేదని రాజధాని లఖ్‌నవూలో సోమవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ములాయం వ్యాఖ్యానించడాన్ని బట్టి చూస్తే పరిస్థితులు సర్దుబాటుకు మరింత దూరమయ్యాయన్నది అర్ధమవుతోంది. అఖిలేశ్ తన బాబాయి రాంగోపాల్ యాదవ్ చెప్పినట్లు చేస్తున్నాడని, ఒకవేళ తన మాట వినకపోతే తానే అఖిలేశ్‌పై పోటీకి దిగుతానని ములాయం సింగ్ హెచ్చరించారు. అఖిలేశ్‌కు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అతను పట్టించుకోవడంలేదన్నారు.
రాంగోపాల్ అఖిలేశ్‌ను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య సైకిలు గుర్తు విషయంలో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. అఖిలేశ్ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ముస్లింలకు చోటు కల్పించలేదని, తన కుమారుడు ముస్లిం వ్యతిరేకిగా మారుతున్నందుకు తనకు ఆందోళనగా ఉందని ములాయం పేర్కొన్నారు. అఖిలేశ్ భారతీయ జనతా పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేసి అఖిలేశ్‌కు వ్యతిరేకంగా ప్రజల మద్దతు కూడగట్టుకుంటానన్నారు.
సమాజ్‌వాదీ పార్టీకి ముఖ్యంగా ములాయంకు యూపీలో ముస్లింల నుంచి మద్దతు ఉంది. ఆయనను ‘మౌలానా ములాయం’ అని కూడా అంటుంటారు. దీంతో ములాయం ముస్లింలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఇప్పటివరకు మాటలకే పరిమితమైన ములాయం – అఖిలేష్ పోరు ఇక నేరుగా ఎన్నికల బరిలోకి తలపడే వరకు వెళ్లిందని రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు.
అవసరమైతే స్వయంగా తానే అసెంబ్లీ ఎన్నికల బరిలో తన కొడుకు అఖిలేష్ యాదవ్ మీద పోటీ చేస్తానని ములాయం సింగ్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. తాను పార్టీని, సైకిల్ గుర్తును కాపాడుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నానని, అఖిలేష్ తన మాటలు వినిపించుకోకపోతే తాను ప్రత్యక్షంగా అతడిపై పోటీకి దిగుతానని ములాయం స్పష్టం చేశారు. తాను మూడుసార్లు అఖిలేష్‌ను పిలిచానని, కానీ అతడు ఒక్క నిమిషం పాటు మాత్రమే ఉండి, తాను మాట్లాడటం మొదలుపెట్టడానికి ముందే అక్కడినుంచి వెళ్లిపోయాడని అన్నారు.
సైకిల్ గుర్తు విషయంలో ఎన్నికల కమిషన్ ఏం నిర్ణయం తీసుకున్నా దాన్ని ఆమోదిస్తామని చెప్పారు. బీజేపీ, ఇతర ప్రతిపక్షాలతో అఖిలేష్ చేతులు కలిపాడని, అతడికి నచ్చజెప్పడానికి తాను ఎంత ప్రయత్నించినా తన తప్పులు తెలుసుకోవడం లేదని అన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని, అఖిలేష్‌కు వ్యతిరేకంగా ప్రజల సాయం కోరుతానని తెలిపారు.
కాంగ్రెస్, ఆర్ఎల్డీ పార్టీలతో కలిసి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగాలని అఖిలేష్ వర్గం భావిస్తుండగా ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించడం ద్వారా ఆ వర్గానికి ముస్లిం ఓట్లను దూరం చేసేందుకు ములాయం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం జనాభా 19 శాతం వరకు ఉంది. ఇన్నాళ్లూ సమాజ్‌వాదీ పార్టీకి వాళ్ల మద్దతు గట్టిగా ఉండేది. చివరకు ములాయంను ‘మౌలానా ములాయం’ అని కూడా అనేవారు. అలాంటి భారీ మద్దతును కోల్పోకూడదన్న ఉద్దేశంతోనే అఖిలేష్ వర్గంపై బీజేపీ అనుకూల రంగు పులిమేందుకు ములాయం ప్రయత్నిస్తున్నారన్నది తాజా సమాచారం.


