మండలస్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్
- 13 Views
- January 16, 2017
- Home Slider రాష్ట్రీయం
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో అర్హతగల ప్రతీ ఒక్కరికీ ఫిబ్రవరి 1వ తేదీ నాటికల్లా రేషన్ కార్డులు, పెన్షన్లు, గ్యాస్ కనెక్షన్లు అందించి తీరాల్సిందేనని జిల్లా కలెక్టరు డాక్టర్ కాటమనేని భాస్కర్ మండల స్ధాయి అధికారులను ఆదేశించారు. స్ధానిక కలెక్టరు కార్యాలయంలో సోమవారం సాయంత్రం మండల స్ధాయి అధికారులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈనెల 24వ తేదీనాటికల్లా జన్మభూమిలో మంజూరైన 30 వేల పెన్షన్లను అందిస్తామని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మభూమిలో 30 వేల పెన్షన్లు ప్రభుత్వం మంజూరు చేసిందని అయితే అదనంగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి మరొక 1000 పెన్షన్లు మంజూరు చేస్తున్నామని వాటన్నింటినీ అర్హతగల పేదలకు అందేలా మండల స్ధాయి అధికారులు బాధ్యతగా పనిచేయాలని భాస్కర్ ఆదేశించారు.
వచ్చే జన్మభూమి నాటికి ఏఒక్కరూ కూడా పెన్షన్ రాలేదని, గ్యాస్కనెక్షన్ లేదని, రేషన్ కార్డు అందలేదనే మాట వినపడకూడదని కలెక్టరు స్పష్టం చేసారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అర్హతగల ప్రతీ కుటుంబానికీ రేషన్ కార్డు, వంటగ్యాస్ కనెక్షన్, పెన్షన్ సౌకర్యాన్ని కల్పించి తీరాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్ధేశ్యమని భాస్కర్ చెప్పారు.
సమాజంలో అంగవైకల్యంతో బాధపడే వారికి అర్హతను పరిగణనలోనికి తీసుకుని నూటికి నూరు శాతంమందికీ అంగవైకల్య పెన్షన్ అందేలా చూడాలని ఈవిషయంలో జన్మభూమి కమిటీలు ప్రత్యేక శ్రద్ధవహించాలని అవసరమైతే జన్మభూమి కమిటీ సభ్యులను ఒప్పించి అర్హతగల వారందరికీ పెన్షన్లు అందించేందుకు యంపిడిఓలు చర్యలు తీసుకోవాలని కలెక్టరు కోరారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో 4వ విడత జన్మభూమిలో 72 వేల రేషన్ కార్డులు మంజూరయ్యాయని ఆకార్డులన్నీ అర్హతగల పేదలకు అందించి వారందరికీ కూడా వంటగ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు పౌర సరఫరాల శాఖ జనవరి 31వ తేదీ వరకూ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత వంటగ్యాస్ కనెక్షన్ లేదనే మాట ఈజిల్లాలో వినిపించకూడదని భాస్కర్ స్పష్టం చేసారు.
జిల్లాలో జనాభా పెరుగుదల లేకపోయినా ప్రస్తుతం ఉన్న జనాభాకు మించి ఇప్పటికే తెల్లరేషన్ కార్డులు అందించారని అయితే బయోమెట్రిక్ ఆధారంగా డూప్లికేట్ కార్డులు తొలగింపు ఒకే వ్యక్తి రెండు కార్డుల్లో పేర్లు ఉంటే అటువంటివారి పేర్లను కూడా తొలగించి ఆధార్ అనుసంధానంతో జిల్లాలో ప్రతీ ఒక్కరికీ తెలుపు లేదా గులాబీ రేషన్ కార్డు అందించి తీరాలని ఈజిల్లాలో రేషన్ కార్డు లేదనే మాట ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత వినిపించకూడదని భాస్కర్ అధికారులను ఆదేశించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిబ్రవరి మొదటివారంలో ఖచ్చితంగా 11 లక్షలమంది తెల్లరేషన్ కార్డుదారులు విధిగా నగదురహిత లావాదేవీల్లో ఉండేలా చూడాలని కలెక్టరు చెప్పారు. క్రొత్తగా రేషన్ కార్డులు జారీచేయడంతో తెల్లరేషన్ కార్డుదారుల సంఖ్య 12 లక్షలకు చేరుకున్నదని ఇందులో 11 లక్షలమంది ఫిబ్రవరి 1వ తేదీ నుండి రేషన్ కార్డులు ద్వారా నిత్యావసర సరుకులు నగదురహితంగా పొందాలని కలెక్టరు స్పష్టం చేసారు. పొరుగున ఉన్న కృష్ణాజిల్లాలో 9 లక్షలమంది రేషన్ కార్డుదారులు నగదురహితంగా సరుకులు తీసుకుంటుంటే చైతన్యవంతమైన పశ్చిమ గోదావరిలో 11 లక్షలమంది నగదురహితంగా ఎందుకుసరుకులు తీసుకోలేరని ఆయన ప్రశ్నించారు.
జన్మభూమి గ్రామసభల్లో 9 వేలమంది పెన్షన్లుకోసం దరఖాస్తు చేసుకున్నారని అయితే ప్రస్తుతం మంజూరు చేసిన 30 వేల పెన్షన్లతోపాటు అదనంగా మరో 15 వేల పెన్షన్లు ఇవ్వనున్న దృష్ట్యా క్రొత్తగా పెన్షన్ కావాలనే వారి సంఖ్య ఉండబోదని కలెక్టరు స్పష్టం చేసారు. పశ్చిమ గోదావరి జిల్లాలో యస్సి, యస్టి, బిసి, మైనారిటీ, కాపు, బ్రాహ్మణ పేదవర్గాల ఆర్ధిక జీవనస్ధితిగతులు మెరుగుపరచడానికి పలు కార్పోరేషన్లు ద్వారా రుణాలను అందిస్తున్నామని అయితే ఆన్లైన్లో సాంకేతికపరమైన ఇబ్బందులను త్వరలోనే అధిగమించి అర్హులకు రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని భాస్కర్ చెప్పారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో 23 వేలమంది యస్సిలు రుణాలు కావాలని దరఖాస్తుచేసారని అయితే ఇంటర్వ్యూలకు 10 వేలమంది హాజరయ్యారని ఇందులో 4 వేల 545 మందిని మాత్రమే ఎంపిక చేయడమేమిటని కలెక్టరు యస్సి కార్పోరేషన్ ఇడి ఝాన్సీరాణిని ప్రశ్నించారు. అర్హత ఉంటే పేదలందరికీ రుణాలు అందించి ఆదుకోవాలని ఇంటర్వ్యూకు హాజరుకాని వారిపేర్లు ఎంపిక జాబితాలో ఉంటే సహించబోమని భాస్కర్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జేసీ పులిపాటి కోటేశ్వరరావు, అడిషినల్ జేసీ యంహెచ్ షరీఫ్, ఆర్డబ్ల్యుయస్ యస్ఇ అమరేశ్వరరావు, జడ్పి సిఇఓ సత్యనారాయణ, డిఆర్డిఏ పిడి కె. శ్రీనివాసులు, డ్వామా పిడి ముళ్లపూడి వెంకటరమణ, బిసి కార్పోరేషన్ ఇడి పుష్పలత, మైనారిటీ కార్పోరేషన్ ఇడి సుబ్రహ్మణ్యశాస్త్రి, గృహనిర్మాణశాఖ పిడి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.


