బల నిరూపణకు సిద్ధమన్న పన్నీర్ సెల్వం
- 24 Views
- February 9, 2017
- Home Slider జాతీయం
చెన్నై: తమిళనాడు రాష్ట్ర ఇంఛార్జి గవర్నర్ చెన్నమనేసి విద్యాసాగర్‌రావుతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గురువారం ప్రత్యేకించి భేటీ అయ్యారు. మహారాష్ట్ర పూర్తిస్థాయి గవర్నర్‌గా వ్యవహరిస్తున్న విద్యాసాగరరావు తమిళనాడు రాష్ట్రానికి కూడా అదనపు బాధ్యతలు చూస్తున్న సంగతి తెలిసిందే. ముంబయి నుంచి నేరుగా చెన్నై చేరుకున్న విద్యాసాగరరావుతో రాజ్‌భవన్‌లో భేటీ అయిన పన్నీరు సెల్వం అనంతరం తన నివాసానికి వెళ్లిపోయారు.
జయలలిత మరణానంతరం పదవీ బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి రాజీనామాకు దారితీసిన పరిస్థితులను గవర్నర్‌కు సెల్వం వివరించారు. శశికళ తీసుకొచ్చిన ఒత్తిడి కారణంగానే రాజీనామా చేశాననీ, ఆ రాజీనామాను వెనక్కి తీసుకుంటానని పన్నీర్ గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం. పన్నీరు సెల్వం రాజీనామాను గవర్నర్ తొలుత ఆమోదించిన నేపథ్యంలో ఆయన ప్రస్తుతం ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, శాసనసభలో బలనిరూపణకు తనకు అవకాశం కల్పించాలని తాజాగా గవర్నర్‌తో భేటీలో సెల్వం కోరినట్లు తెలిసింది.
ఈ భేటీ సందర్భంగా గవర్నర్ ఏం అన్నారన్నదానిపై సమాచారం లేకపోయినప్పటికీ సెల్వం మాత్రం తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ దృష్టికి తాను తీసుకువెళ్లిన విషయాలను వివరించారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం తన నివాసంలో పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడుతూ కూడా ఇవే విషయాలను వెల్లడించారు. గవర్నర్‌తో ప్రస్తుత పరిస్థితులను వివరించినట్టు చెప్పారు. అలాగే బలనిరూపణకు తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్టు తెలిపారు.
పురచ్ఛి తలైవి తలైవి ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయని ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. అన్నాడీఎంకే ప్రిసీడియం ఛైర్మన్ మధుసూదన్ తనకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపిన పన్నీర్ కచ్చితంగా ధర్మమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభ సమయంలో తనకు మద్దతుగా నిలుస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు, గురువారం రాత్రి అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ గవర్నర్‌తో భేటీ అయ్యారు.
అయితే, ఆమెతో భేటీ అనంతరం గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలావుండగా, తమిళనాడులో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అందరిచూపు ఇంచార్జి గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుపైనే ఉంది. ఆయన ఏం చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రతి కదలికను మీడియా ప్రముఖంగా చూపిస్తోంది. గురువారం మధ్యాహ్నం ముంబై నుంచి చెన్నైకు ఆయన వచ్చారు. విమానంలో కూడా మీడియా ప్రతినిధులు ఆయనను వదల్లేదు.
ఏ నిర్ణయం తీసుకోబోతున్నారని విమానంలో విద్యాసాగర్ రావును చుట్టుముట్టి ప్రశ్నలు సంధించారు. అయితే విద్యాసాగర్ రావు మాత్రం నోరు మెదపలేదు. తమిళనాడు నెలకొన్న రాజకీయ సంక్షోభంపై మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదు. చెన్నై విమానాశ్రయంలో దిగిన తర్వాత మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. పన్నీర్ సెల్వం, శశికళ నటరాజన్‌తో భేటీ అయిన తర్వాత కూడా ఆయన నిర్ణయం తీసుకోవడంపై తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, తమిళనాట అధికార అన్నాడీఎంకేలో సంక్షోభం తారస్థాయిలో చేరిన నేపథ్యంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నది. శశికళను ఇప్పటికే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. తమకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆమె వర్గం చెబుతున్నది. తనకు కూడా మెజారిటీ ఉందని, అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశమిస్తే తన బలమేమిటో నిరూపించుకుంటానని పన్నీర్ సెల్వం చెప్తున్నారు.
క్షేత్రస్థాయి వాస్తవాలను చూస్తే ప్రస్తుతం పన్నీర్ సెల్వం వద్దు ఆరుగురు ఎమ్మెల్యేలకు మించి బలం లేదని చెప్తున్నది. దీంతో అంకెల సమీకరణాలు ఇప్పుడు తమిళనాట ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శశికళ, పన్నీర్ సెల్వంలలో ఎవరి ముఖ్యమంత్రి కావాలన్న మ్యాజిక్ ఫిగర్ 117 ఉండాల్సిందే. దీంతో మెజారిటీ మద్దతు ఉన్న శశికళను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలని గవర్నర్ ఆహ్వానించకతప్పదా? అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన అధికార పార్టీ నేత ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేయించే విచక్షణాధికారం గవర్నర్‌కు ఉంటుందని ఆయన తెలిపారు. తన పుస్తకం ‘ఫియర్లెస్ ఇన్ అపోజిషన్’ విడుదల సందర్భంగా ఆయన ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘మెజారిటీ సంఖ్యాబలమున్న పార్టీ నాయకుడితో ప్రమాణం చేయించాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత గవర్నర్‌కు ఉంటుంది. ప్రస్తుతమున్న ఆయా కారణాల వల్ల ప్రమాణాన్ని కొద్దిరోజులు వాయిదా వేస్తున్నానని చెప్పే విచక్షణాధికారం కూడా గవర్నర్‌కు ఉంటుంది. ఇది చిన్నపాటి అవకాశం. రాజ్యాంగబద్ధత దీనికి ఉందా? లేదా? అన్నది చూడలేదు కానీ, ఈ అవకాశం గవర్నర్‌కు ఉంటుందని నేను భావిస్తున్నా’’ అని ఆయన చెప్పారు.
ప్రస్తుతం గవర్నర్ ముందు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయని, ఈ నాలుగు ఆప్షన్లలో (శశికళను వేచి ఉండమని చెప్పడం, ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం, పన్నీర్ సెల్వానికి మరో అవకాశం ఇవ్వడం, రాష్ట్రపతి పాలన విధించడం) ఆయన దేనిని ఎంచుకుంటారన్నది రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాయిదా ఆప్షన్ కూడా ఆయన ఎంచుకుంటారా? అన్నది చూడాలి అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.


