ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై ఉత్తమ్ ప్రకటన
- 13 Views
- February 13, 2017
- Home Slider రాష్ట్రీయం
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఇన్నాళ్లూ నాన్చుతూ వస్తున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎట్టకేలకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుత ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సమావేశంలో నిర్ణయించినట్టు భేటీ అనంతరం ఉత్తమ్ మీడియాకు తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పాత పెద్ద నోట్ల రద్దు అంశంతో పాటు కేసీఆర్ సర్కారు వైఫల్యాలను ఎండగడతామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గోబెల్స్‌ను మించి అబద్ధాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. మరోవైపు, రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించకుండా, రాజ్యాంగస్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఉత్తమ్ ఆరోపించారు. ప్రజల అభిప్రాయాలకు విలువలేకుండా పోయిందని, నియంతల పాలన సాగుతున్నదని వ్యాఖ్యానించారు.


