ఇక హిజ్రాలకూ రైలు రిజర్వేషన్లు!
- 30 Views
- February 17, 2017
- Home Slider జాతీయం
భారతీయ రైల్వే ఇటీవల ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. రైల్వే రిజర్వేషన్ ఫారంలో స్త్రీలు, పురుషులకు తోడుగా ‘మూడవ తరగతికి చెందినవారు’ (హిజ్రాలు) కూడా వారి వివరాలను నమోదు చేయాలన్నది ఆ నిర్ణయం. తమ లైంగిక వర్గానికి కూడా గుర్తింపు దక్కాలని ఎంతో కాలంగా పోరాడుతున్న ‘హిజ్రా’లకు ఇది ఆనందదాయకమైన విషయమే. శతాబ్దం ప్రారంభం నుండి హిజ్రాల పోరాటం జరుగుతూనే వుంది. హిజ్రాల పక్షాన పనిచేసే సామాజిక ఉద్యమకారిణి లక్ష్మీనారాయణ త్రిపాఠీకి మద్దతుగా పలువురు న్యాయవాదులు ప్రభుత్వంపై వేసిన కేసులో 2014లో సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. తమ లైంగిక స్థితిని తామే నిర్ణయించుకోవాలని, స్ర్తిగానో, పురుషుడిగానో చెప్పుకోనక్కరలేదనీ- ‘థర్డ్ జెండర్’ లేదా ‘ట్రాన్స్‌జెండర్’ అని బహిరంగంగా ఎలాంటి సంకోచమూ లేకుండా ప్రకటించుకోవచ్చుననీ- రాజ్యాంగంలోని 14, 15, 19, 21, అధికరణాలు ఇందుకు అవకాశం కల్పిస్తున్నాయని న్యాయస్థానం పేర్కొంది. దీని ఫలితమే రైల్వే రిజర్వేషన్ ఫారమ్‌లో వచ్చిన మార్పు. హిజ్రాలు కోరుకున్నది ఇదొక్కటే కాదు. రైళ్లలో తమకు ప్రత్యేక బోగీలు ఏర్పాటు చేయాలని, అలా వీలుకాని పక్షంలో కొన్ని సీట్లు, బెర్త్‌లు తమకు కేటాయించాలని కోరుతున్నారు. మిగతా ప్రయాణీకులు తమపట్ల చులకన భావం ప్రదర్శించకుండా ఉండేందుకు ఈ సౌకర్యాలు కల్పించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో హిజ్రాల సంఖ్య 4.5 లక్షలు వీరందరూ తమకు తగిన గుర్తింపు, హక్కులు, కనీస సదుపాయాలు ఉండాలని పోరాడుతున్నారు. విద్యాసంస్థల్లో అడ్మిషన్లకు, రేషన్ కార్డులకు, ఆస్పత్రుల్లో చేరడానికి, పాస్‌పోర్టుకు ఇలా చాలావాటికి దరఖాస్తు చేసేవారంతా విధిగా తాము స్ర్తి లింగమో, పురుష లింగమో తెలియజేయాలి. మరి- ఈ రెండూ కాని వారు తమ గురించి ఎలా చెప్పుకోవాలి? స్ర్తిలు, పురుషులతో పాటు ‘ట్రాన్స్ జెండర్’ (టి.జె.) అనే వర్గీకరణ కూడా వుండాలని హిజ్రాలు కోరుతున్నారు. ఆమధ్య ఒక హిజ్రాకు తీవ్రమైన అనారోగ్యం చేస్తే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆ వ్యక్తిని పురుషుల వార్డులో చేర్చాలా? స్త్రీల వార్డులో చేర్చాలా? అన్నది ఆస్పత్రి అధికారులకు అర్థం కాక, ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. ఇలాంటి ఉదంతాలు ‘మూడో కేటగిరి’కి చెందిన వారిని ఎంతగానో ఆవేదనకు గురిచేస్తాయి. విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో తమకు రిజర్వేషన్లు కల్పించాలని కూడా వీరు కోరుతున్నారు. ఇక, ‘తెలంగాణ హిజ్రా ట్రాన్స్‌జెండర్ సమితి’ పోలీసులు తమపై చేసే ‘జులుం’ తొలగిపోవాలని డిమాండ్ చేస్తోంది. ఆరు నెలల కాలంలో తమపై 40కి పైగా పోలీసు దాడులు జరిగాయని ‘సమితి’ సభ్యులు అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో మరొక అపూర్వమైన సంఘటన చోటు చేసుకుంది. తిరుచ్చిశివ అనే డి.ఎం.కె. పార్లమెంటు సభ్యుడు రాజ్యసభలో హిజ్రాల సమస్యలకు సంబంధించి ఒక కీలకమైన ప్రయివేటు బిల్లును ప్రవేశపెట్టాడు. పార్లమెంటులో ప్రయివేటు బిల్లులు ఆమోదించబడిన సందర్భాలు తక్కువగా వుంటాయి. కానీ, చిత్రంగా ఈ బిల్లును రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 46 సంవత్సరాల కాలంలో ఇలా ఆమోదించబడిన సందర్భం మరొకటి లేదు! 2015లో ఈ బిల్లును రాజ్యసభలో ఆమోదించాక సభాధ్యక్షుడు- ‘ఒక ప్రయివేటు బిల్లు ఇలా ఆమోదించబడడం చాలా అరుదైన విషయం. సంతోషించాల్సిన విషయం’’ అని అన్నారు. తిరుచ్చిశివ చొరవతో ఆమోదం పొందిన బిల్లు హిజ్రాలకు ఎంతో మేలు చేస్తుంది. దీన్ని లోక్‌సభలోనూ ఆమోదిస్తే హిజ్రాల పట్ల వివక్ష ఉండదు. పిన్న వయస్కులైన హిజ్రాలకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో 2 శాతం రిజర్వేషన్‌కు అవకాశం వుంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా వీరికి రిజర్వేషన్ సౌకర్యం లభిస్తుంది. హిజ్రాలు నేరం చేసినట్టయితే వారిని విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటవుతాయి. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో మహిళా కమిషన్లు, మైనారిటీ కమిషన్లు వున్నట్టుగానే ‘హిజ్రా కమిషన్’లు ఏర్పాటవుతాయి. హిజ్రాలకు దత్తత తీసుకునే అధికారాలు, ఆస్తిహక్కు వుంటాయి. తమకు ఏవిధమైన అన్యాయం జరిగినా ‘హిజ్రా కమిషన్’కు తెలిపి న్యాయాన్ని పొందే అవకాశం వుంటుంది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం హిజ్రాలకు ఎంతో న్యాయం జరుగుతుంది. హిజ్రాలు వైద్య పరీక్ష చేయించుకొనడం ద్వారా గాని, ప్రత్యేక కమిటీ ద్వారా గాని తాము ‘థర్డ్ జెండర్’కు చెందిన వారమని నిరూపించుకోనక్కరలేదు. పురుషుడిగా జన్మించినా, తనలో స్త్రీ లక్షణాలు అధికంగా వున్నాయని భావించి శస్తచ్రికిత్స చేసుకుని ‘హిజ్రా’లు మారిన వారు కూడా ఎలాంటి వైద్య పరీక్షలకు హాజరుకానవసరం లేదు. తమకు తామే తమ లైంగిక స్థితిని పేర్కొనవచ్చు. పురుషుడు స్త్రీలా వేషధారణ చెయ్యవచ్చు. స్త్రీలు పురుషుడిలా వేషధారణ చెయ్యవచ్చు. అంతా స్వయం నిర్ణయంపైనే ఆధారపడి వుంటుంది. రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లు గాని, సుప్రీం కోర్టు తీర్పులో సూచించిన అంశాలు గాని కేంద్ర ప్రభుత్వానికి ఆమోదయోగ్యంగా వున్నట్టు అనిపించడం లేదు. రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లును యథాతథంగా లోక్‌సభకు తీసుకురాకుండా దాన్ని లోక్‌సభ స్పీకర్ ద్వారా ‘స్టాండింగ్ కమిటీ’కి కేంద్రం పంపించింది. రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టిన ఎంపీ తిరుచ్చిశివ కూడా సవరణలు చేసిన బిల్లు లోక్‌సభ ఆమోదిస్తే అదొక కళ్లులేని చట్టం అవుతుంది. శతాబ్దులుగా హిజ్రాలు లోనవుతున్న వివక్షను ఎంతమాత్రమూ రూపుమాపదు’ అన్నారు. ఇంతకూ ఈ సవరణ బిల్లులోని ప్రధాన అంశాలు ఏమిటంటే, హిజ్రాలు తమకు తాము ‘మూడో జెండర్’కు చెందిన వారమని ప్రకటించుకున్నంత మాత్రాన సరిపోదు. ఒక కమిటీ దానిని నిర్ధారిస్తుంది. లింగమార్పిడి సర్జరీ చేయించుకుని ‘థర్డ్ జెండర్’కు చెందిన వారమని ప్రకటించుకుందామంటే వీలుకాదు. స్త్రీగా, పురుషుడిగా పుట్టుక ఏదయినా ‘సెక్స్ రిఎనైన్మెంట్ సర్జరీ’ ద్వారా, మరొక లైంగిక స్థితికి మారితే వారిని ‘ట్రాన్స్ సెక్స్యువల్ పెర్సన్స్’ లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తులు అని అంటారు. ఇలా ఏమీ చెయ్యకుండా పురుషులు స్త్రీల దుస్తులు, స్త్రీలు పురుషుల దుస్తులు ధరించి తిరిగితే వారిని ‘ట్రాన్స్ వెస్టయిట్స్’ అంటారు. మనస్తత్వ పరమైన కారణాలతో ఇలా జరిగేందుకు అవకాశం వుంటుంది. హిజ్రాలు తమంతట తాము ‘థర్డ్ జెండర్’ అని ప్రకటించుకోవడం కాకుండా, తమ లైంగిక స్థాయిని నిర్ధారించి చెప్పమని ప్రభుత్వం నియమించిన కమిటీకి అభ్యర్థన పెట్టుకోవాలి. ప్రతి జిల్లాలో ఉంటే ఈ కమిటీల్లో చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సి.ఎం.ఓ.), జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి, సైకియాట్రిస్ట్, హిజ్రాల ప్రతినిధి, ప్రభుత్వ ప్రతినిధి సభ్యులుగా వుంటారు. వారు నిర్ణయిస్తేనే ‘హిజ్రా’లు అని చెప్పుకునేవారు ‘థర్డ్ జెండర్’ కిందకు వస్తారు. సుప్రీం కోర్టు తీర్పులో హిజ్రాలు ఎస్సీ, ఎస్టీ కులాల్లో జన్మిస్తే వారికి ఆయా రిజర్వేషన్లు సహజంగానే వర్తిస్తాయి. అలా జరగనప్పుడు వారికి ‘ఓ.బి.సి.’ కోటాలో రిజర్వేషన్ లభించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టదలచిన బిల్లు ప్రకారం హిజ్రాలు యాచకవృత్తిని కొనసాగించడం నేరం. ఈ నేరానికి రెండేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు. చదువు, ఉపాధి లేక బిచ్చమెత్తుకోవడం కన్నా వీరు ఏమి చెయ్యగలరు? ఈ విషయాలను ఆలోచించని ప్రభుత్వం దృష్టి మాత్రం వేరుగా ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టదలచిన బిల్లులో- హిజ్రాలకు వివాహం చేసుకునే హక్కు, దత్తత తీసుకునే హక్కు, వారసత్వపు హక్కు మొదలగు వాటి ప్రస్తావన లేదు. తమకు ఏ విధంగానూ ఉపయోగపడని రీతిలో ప్రభుత్వం ‘సవరించిన’ బిల్లును వ్యతిరేకిస్తూ హిజ్రాలు ఇటీవల దేశవ్యాప్తంగా ఊరేగింపులు జరిపారు. తిరుచ్చిశివ తన బిల్లులో ప్రతిపాదించినట్లు ప్రతి జిల్లాలోను ‘హిజ్రా వెల్ఫేర్ బోర్డులు’ ఏర్పడితే మంచి సంస్కరణ సాధ్యమవుతుంది. రైల్వే రిజర్వేషన్ ఫారమ్‌లో ట్రాన్స్‌జెండర్ అనే పదం చేర్చినంత మాత్రాన సరిపోదు.


