పుట్టగొడుగుల్లా మినరల్ వాటర్ ప్లాంట్స్
- 9 Views
- February 17, 2017
- Home Slider జాతీయం
మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్నాయి. అనుమతులు లేకుండా, నిబంధనలు పాటించకుండా ప్లాంట్లను నిర్వహిస్తున్నా సంబంధిత అధి కారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. వాటర్ ప్లాంట్లలో కొన్నింటికి అనుమతులు ఉన్నా మిగిలినవి అనుమతులు లేకుండా యథేచ్ఛగా నడిపిస్తున్నారు. వాటి నుంచి ఎలాంటి రుసుంలు ప్రభుత్వానికి చెల్లించడం లేదని అధికారులు వెల్లడిస్తున్నారు. నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకుంటే నెలకు రూ.లక్షలలో ఆదాయం వస్తుందని, అనుమతులు లేని వాటిపై అధికారులు అంటిముట్టనట్లుగా వ్యవహరించడంతో ప్లాంటు యజమానులు వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వీటిలో కొన్నింటికి మాత్రమే అనుమతులు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణా లోపం కారణంగా, నిబంధనలు పాటించకుండా ప్లాంట్ల యజమానులు నీటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. నిర్వహకులు నిబంధనలు పాటించకుండా ప్లాంట్లలో రెండు, మూడు రోజుల పాటు నిల్వ ఉన్న నీటిని సరఫరా చేస్తున్నారని ఆరోపణలున్నాయి. వీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నా యంటున్నారు. ముఖ్యంగా వాటర్ ప్లాంట్లలో శుభ్రత కొరవడింది. రెండు, మూడు సంవత్సరాల క్రితం నిర్మించిన ప్లాంట్లలోని యంత్రాలు తుప్పు పట్టాయి. ప్లాంట్ల పరిసరాల్లో పారిశుధ్యం కొరవడింది. కొందరు నీటిని శుద్ధ్ది చేయకుండానే క్యాన్లలో నింపి సొమ్ము చేసుకుంటున్నారు. శుద్ధి చేసిన నీటిని నిల్వ చేసే ట్యాంకులను ఎళ్ల తరబడి వాడటంతో వాటిలో నాచు, పాకుడు పేరుకపోయి దర్శనమిస్తున్నాయి. నీటిని శుద్ధి చేసిన తేదీ, వివరాలను నోటీసు బోర్డులో ఏ ఒక్కరు పొందుపర్చడం లేదు. వాటర్ ప్యాకెట్లలో నీటిని శుద్ధి చేయకుండానే నింపి సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ప్యాకెట్లతో నింపిన నీటిని తాగితే ప్లాస్టిక్ వాసన గుప్పుమంటుందని ప్రజలు వాపోతున్నారు. కూల్ వాటర్ పేరిట సర ఫరా చేస్తున్న నీటిలో కూలింగ్ కోసం ఐస్ గడ్డలను వేసి సరఫరా చేస్తున్నారనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఆ నీటిని తాగి గొంతు, శ్వాస సంబంధిత వ్యాధు లకు గురవుతున్నామని ప్రజలు వాపోతున్నారు. మరికొన్ని ప్లాంట్లలో నల్లాల ద్వారా సరఫరా అయ్యే నీటిని నింపి విక్రయిస్తున్నారనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. ఏ ప్లాంటులోను శాశ్వత టెక్నిషియన్లు లేరు. బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్ నిబంధనల ప్రకారం ప్రతి ప్లాంట్లులో ఏరియేషన్ క్లాష్, మిక్సింగ్ ప్లాంటు, శాక్యులేషన్ ప్లాంటు, ఫిల్టరేషన్ ప్లాంటు ఉండాలి. నీటిని మొదట ఏరియేషన్ ప్రక్రియ ద్వారా శుద్ధి చేయాలి. దీని ద్వారా నీటిలో వాసన, ఏ విధమైన రుచి ఉంటే తొలగిపోతుంది. పెద్ద క్యాన్లలో నీటి ని తీసుకుని అందులోని గాలిని పంపించాలి. ఈ ప్రక్రియ ద్వారా నీరు రంగు, రుచి, వాసన లేకుండా తయారవుతోంది. ఇవి స్వచ్ఛమైన నీటికి ఉండాల్సిన ప్రాథమిక గుణం. రెండో దశలో మిక్సింగ్ ప్లాంటు పద్ధతి ద్వారా కాల్షియం, మెగ్నీషియం అధి కంగా ఉండే వాటిని తొలగించేందుకు లైమ్ సోడియం కార్బొనేట్‌లను వినియో గిస్తారు. ఏదైనా ఇతర ఘనపదార్థాలు నీటిలో ఉన్నట్లయితే ఆలం ద్వారా తొలగిస్తారు. నీటిలో ఉన్న బ్యాక్టీరియాను తొలగించేందుకు క్లోరిన్‌ను కలుపుతారు.వాటర్ ప్లాంట్లకు అనుమతులు ఉన్నా వాటర్ ప్లాంట్లలో వాడిన క్యాన్లను ఏళ్ల తరబడి వాడుతున్నారు. వీటి ద్వారా నీటిని సైప్లె చేయడంతో పాటు ప్లాస్టిక్‌ను అనేక సార్లు వాడటంతో అనేక రోగాలొస్తాయనే విషయాన్ని వైద్యులు సైతం ధ్రువీకరిస్తున్నారు. ప్లాంట్లలో పనిచేసే వ్యక్తులు కనీసం జాగ్రత్తలు పాటించకపోగా, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజలు ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.సాధారణంగా ఐఎస్ఐ, బీఐఎస్ల అనుమతులు పొందాలంటే రూ.లక్ష వరకు ఖర్చవుతోంది. ఆ తర్వాత పర్యవేక్షణ కోసం నెలకు రూ.10వేల ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత రెన్యువల్ కోసం మరో రూ.50వేలను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారాన్ని తప్పించుకోవడం కోసం ప్లాంట్ల నిర్వహకులు సంబంధిత అధికారులకు ముడుపులు అందిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అనుమతులు ఉన్నా, అనుమ తులు లేని మినరల్ వాటర్ ప్లాంట్లలో తనిఖీలు నిర్వహించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు.


