మోదీ ప్రాపకం కోసం అత్యుత్సాహం!
- 13 Views
- February 17, 2017
- Home Slider జాతీయం
ఖాదీ, అహింస, స్వదేశీ అన్న పదాలు మహాత్మా గాంధీతో పెనవేసుకు పోయాయి. మమైకం అయిపోయాయి. ఖాదీ అంటే గాంధీ.. గాంధీ అంటే ఖాదీ గుర్తుకువచ్చేది. ఫలితంగా బ్రాండ్, ఉత్పత్తి ఏకమైపోయాయి. స్వాతంత్య్రం తరువాత కూడా వేలాది గ్రామాలలో ప్రజలు గాంధీని, చరఖాను మరచిపోలేదు. ఎన్నో కుటుం బాల్లో అదే జీవనోపాధి అయింది. ఆర్థిక వ్యవస్థ స్వయం సమృద్ధికి తోడ్పడే సాధనం అయ్యాయి. తరాలు మారినా, చరఖా తిప్పేవారు, నూలు వడికే వారు క్రమంగా తగ్గిపోయినా, అప్పటికీ, ఇప్పటికీ గాంధీజీ అన్నా ఆయన సిద్ధాంతాలు అన్నా, చరఖా అన్నా ప్రజల మనసులలో మరుగున పడి పోలేదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహాత్మా గాంధీ ఆదర్శంగానే నిలిచి పోయారు. విదేశీ వస్తు బహిష్కరణతో స్వదేశీ దుస్తులే ధరించాలన్న ప్రచారం, ఇంటింటా చరఖాతో బ్రిటీష్ మిల్లు దుస్తులకు వ్యతిరేకంగా సాగిన గొప్ప ఉద్యమాన్ని తలపునకు తెస్తుంది. బ్రిటీష్ వాణిజ్యపరమైన సామ్రాజ్యవాదానికి వ్యతిరేకం గా ఉద్యమించేందుకు మహాత్మా గాంధీ ఖాదీని ఓ బ్రహ్మాస్త్రంగా మలచారు. స్వాతంత్య్ర సమరంలో చరఖా ఓ మహత్తరమైన ఆయుధమైంది. ప్రధానిగా దేశ ప్రజలు నరేంద్ర మోడీని గౌరవిస్తున్నారు. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ప్రపంచమంతా ఆయనను గౌరవిస్తున్నది. కానీ, మహాత్మా గాంధీ చిత్రపటం బదులు ప్రధాని నరేంద్ర మోడీని ఆ స్థానంలో ప్రతిష్ఠించడాన్ని ఎవరూ హర్షించడం లేదు. నిజానికి గ్రామీణ ప్రాంతాల్లో చేనేత, హస్తకళాకా రుల, కుటీర పరిశ్రమలను ప్రస్తుతం ప్రైవేటు పారిశ్రామిక వేత్తలే పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నారు. చాలా కుటీర పరిశ్రమల్లో తయారవుతున్న ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. చేనేత లాల్చీలు, ధోవతులు ధరించడం ఓ ఫ్యాషన్‌గా మారింది. అలాంటి పోటీ ఎదు ర్కోవాలంటే, ఖాదీ గ్రామోద్యోగ కమిషన్ కూడా మార్కెటింగ్‌లో కొత్త పద్ధతులు ఎంపిక చేసుకోవ లసిందే .ఆ నేపథ్యంలో మహాత్మా గాంధీతో ఖాదీకి ఉన్న అనుబంధాన్ని కొనసాగించాలా? కొత్త బిజినెస్ మోడల్‌ను ఎన్నుకోవాలా? అని తేల్చుకో వాలి. ఇది ఖాదీ మార్కెటింగ్ అధికారులకు వచ్చిన ఐడియానా? లేక ఖాదీ కమిషన్‌ను హస్తగతం చేసుకున్న నరేంద్రమోదీ భజనపరుల ప్రోద్బలంతోనే గాంధీ ఫోటో స్థానే కమిషన్ మోడీ చిత్రాన్ని ప్రచురించిందా అన్నది తేలవలసి ఉంది. ఇటీవల కాలంలో మోడీ యువతను ఎంతగానో ఆకట్టుకుంటున్నారని, అందువల్లే మోడీ చిత్రపటాన్ని క్యాలెండర్లపైన, డైరీలపైన ప్రచురించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఖాదీ కమిషన్ పేర్కొంది. జాతిపిత చిత్రం లేకుండా గతంలో ఐదు, ఆరు సంవత్సరాలు క్యాలెండర్లు ప్రచురించింది. వివాదం చెలరేగగానే ప్రధాన మంత్రి కార్యాలయం తమకు ఖాదీ గ్రామోద్యోగ కమిషన్ నిర్ణయంతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. గాంధీ ఖాదీ దుస్తులనే వాడే వారు. లక్షలాది పేద ప్రజలు ధరించేది ఖాదీ.అమెరికా ప్రెసిడెంట్ వస్తున్నాడంటూ పది లక్షల ఖరీదు చేసే సూట్ ధరించిన వ్యక్తి ఖాదీ బ్రాండ్ అంబాసిడర్ ఎలా అవుతాడు? ఆలోచించాలి. మోడీ సర్కార్ నల్లధనంపై బ్రహ్మాస్త్రం అంటూ పెద్ద నోట్లు రద్దు చేయడంతో గగ్గోలు మొదలైన సమయంలో దేశంలో చిన్నా, పెద్దా ఆర్థిక శాస్త్రవేత్తలంతా మోడీకి మద్దతు ఇచ్చినట్లుగా ఈ సారి గాంధీ బొమ్మ స్థానే మోడీ బొమ్మ ప్రచురించినప్పుడు పెద్దగా మద్ద తు రాలేదు. హర్యానా మంత్రి అనిల్ విజ్ లాంటి ఒకరో, ఇద్ద రో మోడీ భజనపరులే ఆహా, ఓహో అంటూ మద్దతుగా నిలిచారు. మంత్రిగారి ప్రవర్తన మున్నా భాయ్ సిని మాలో హీరో, అతడి ఫ్రెండ్ లాంటి కేరక్టర్లను తలపించింది. 21 సెంచరీ లో మార్కెటింగ్ సూత్రాల ప్రకారం కేలండర్పై బొమ్మలు అప్పుడప్పుడు మార్చాల్సిందే. లక్స్ సోప్‌కు క్యాలెండర్‌పై 50వ దశకంలో అప్పటి హీరోయిన్, ఈ ఏడాది ఇప్పుడు సక్సెస్‌లో సాగుతున్న హీరోయిన్ కనిపించవచ్చు. పెప్సీ ప్రకటనలో ఒకప్పుడు తెండూల్కర్, తరువాత ధోని, ఇప్పుడు కోహ్లీ.. ఆలా మారవచ్చు. అలాంటి సమయంలో బ్రాండ్ అంటే ఏమిటి.. ఉత్పాదక వస్తువా? బ్రాండ్ అంబాసిడరా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. కానీ ఖాదీ విషయంలో మహాత్మా గాంధీ స్థానే మోడీ చిత్రపటం మార్పును ఆ విధంగా పరిగణించలేక పోతున్నారు జనం. ప్రధాని మోడీ చిత్రాన్ని ఖాదీ క్యాలెండర్లపై ప్రచురించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. జాతి పితను అవమానించినందుకు ప్రధాని, ఖాదీ కమిషన్ కూడా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనని ఉద్యమిస్తున్నది. సహజంగానే కాంగ్రెస్ అనవసర వివాదాన్ని సృష్టిస్తున్నదని బీజేపీ ఎదురు దాడికి దిగింది. విచిత్రం ఏమిటంటే, ఖాదీ కమిషన్ క్యాలెండర్, డైరీలపై మోడీ ఫోటోలను ప్రచురించిన అంశాన్ని మొదట లేవనెత్తింది కాంగ్రెస్ పార్టీ కాదు. బీజేపీ మిత్రపక్షమైన శివసేన. మొదట ఖాదీ కమిషన్ ఉద్యోగుల నుంచే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఖాదీ గ్రామ ఉద్యోగుల సంఘంలోని శివసేన నాయకులే ఈ అంశాన్ని మొదట లేవనెత్తారు. నిరుడు తొలిసారిగా మహాత్మా గాంధీ ఫోటో స్థానే మోడీ చిత్రాన్ని క్యాలెండర్లపైన, డైరీల పైనా ప్రచురించారట.ఆ విషయాన్ని యూనియన్ నాయకులు ప్రస్తావించగానే 2017లో అలాంటి పొరపాటు జరగబోదని ముంబైలోని ఖాదీ కమిషన్ అధికారులు సర్ది చెప్పుకున్నారు. ఈ సారి మహాత్ముడి స్థానే మోడీ చిత్రంతో క్యాలెండర్లు వెలువడడంతో వివాదమైంది.


