రైతు ఇంట ధాన్య లక్ష్మి
- 18 Views
- February 17, 2017
- Home Slider రాష్ట్రీయం
గుంటూరు జిల్లాలో ధాన్యం దిగుబడులు చేతికొస్తున్న వేళ మద్దతుకు కంటే మించిన ధరలు రైతన్న ఇంట్లో సిరులు కురిపిస్తున్నాయి. పొలంగట్లపైనే ధాన్యం అమ్ముడు బోతుండటంతో అన్నదాత సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. గత నెలలోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా ఇప్పటివరకు ఒక క్వింటా కూడా వాటికి చేరకపోవడం ఇందుకు నిదర్శనం. కృష్ణా పశ్చిమ డెల్టాలో 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా ఎక్కువగా బీపీటీ-5204 రకం వేశారు. దీంతో డిసెంబరులో ప్రారంభమైన కోతలు పూర్తయ్యాయి. గ్రేడు-1 క్వింటా రూ.1510, 75 కిలోల బస్తా అయితే రూ.1132.50కు కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నారు. అయితే ఆయా ధరలకన్నా వ్యాపారులు, మిల్లర్లు ఎక్కువగా చెల్లించి కల్లాల్లోనే కొనుగోలు చేస్తున్నారు. చుట్టుపక్కల జిల్లాల వారే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కొనుగోలు దారులు వస్తుండడంతో బీపీటీ రకాల ధరలు రోజురోజుకు ఎగబాకుతున్నాయి. 75 కిలోల బస్తా ప్రారంభంలో రూ.1150 ఉండగా మెషీన్‌తో కోత కోసిన వెంటనే తేమతో నిమిత్తం లేకుండా రూ.1260కు కొనుగోలు చేస్తున్నారు. కూలీలతో కోయించి, కుప్ప వేసి నూర్పిడి చేసిన ధాన్యం బస్తా రూ.1350-1400 వరకు కొనుగోలు చేస్తున్నారు. గతేడాదీ ఇంతే ధర పలికినా ఈ సంవత్సరం దిగుబడులు మెరుగ్గా ఉండడం రైతులకు కలిసివస్తోంది. కొందరు వ్యాపారులు వారం రోజుల వ్యవధిలో వారి పేరుతో చెక్కులు ఇస్తుండగా మరికొందరు కొనుగోలు సమయంలోనే రైతుల నుంచి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి ఆన్లైన్లోనే నగదు వారి ఖాతాలకు జమ చేస్తున్నారు. కాగా ఈ ఏడాది సాగు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఇంతకంటే ధర తగ్గకుండా ఉంటేనే ఉపశమనంగా ఉంటుందని మూల్పూరు రైతులు అభిప్రాయపడుతున్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో వెలుగు సంస్థలు, సహకార పరపతి సంఘం, జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం ఆధ్వర్యంలో మొత్తం 37 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయించింది. వీటిల్లో 17 శాతం తేమ మించని ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించింది. మట్టి, రాళ్లు, గడ్డి, చెత్త, వ్యర్థాలు 2, రంగుమారిన, మొలకెత్తిన గింజలు 5, పక్వం చెందనివి 3, కేళీలు, తక్కువ శ్రేణివి 6 శాతం మించకుండా ఉండాలని నిబంధన పెట్టారు. దీంతోపాటు రైతులే కొనుగోలు కేంద్రానికి దిగుబడులు తీసుకురావాలనేది నిబంధన. అయితే వీటినేమీ పట్టించుకోకుండా వారు హాయిగా పొలంలోనే అమ్మకాలు సాగిస్తుండడంతో కేంద్రాలు వెలవెలబోతున్నాయి. డెల్టాలో 85 శాతానికి పైగా బీపీటీ రకాలే సాగుకాగా మిగిలిన పదిహేను శాతం కింద ఎన్‌ఎల్‌ఆర్, ఎంటీయూ, ఇతరాలు ఉన్నాయి. బీపీటీని ఏ గ్రేడ్ కింద పరిగణిస్తుండగా ప్రభుత్వ కనీస మద్దతు ధరకన్నా అదనంగా రూ.130-270కు పైన కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ ధాన్యం నుంచి వచ్చే నాణ్యమైన బియ్యానికి మార్కెట్ లో డిమాండ్ బాగా ఉంది. దాంతో పాలిష్ చేయించి తమిళనాడు, తెలంగాణ, ఇతర రాష్ట్రాలకూ మిల్లర్లు ఎగుమతి చేసి లాభాలు తెచ్చుకుంటున్నారు. పొలాల్లోనే ధాన్యాన్ని కొనుగోలు చేయడంవల్ల రైతులపై ఎలాంటి రవాణా, కాటా ఛార్జీల భారం పడడం లేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరవడంవల్లనే తమకు ఈ మేలు జరుగుతోందనే భావన అన్నదాతల్లో వ్యక్తమవుతోంది. కొనుగోలు కేంద్రాల్లో నెల్లూరు సన్నాలు, 2077, మొలకొలుకులు, ఎంటీయూ 1061, 1010 ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేస్తోంది. మిల్లర్లతో మర ఆడించి బియ్యం రూపంలో తీసుకుని రేషన్ షాపుల ద్వారా ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులు, సంక్షేమ హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేస్తోంది. ఈ రకాలను డెల్టా శివారు ఆయకట్టులో ఉన్న బాపట్ల, చీరాల, కారంచేడు, పర్చూరు, చినగంజాం ప్రాంతాల్లో సాగు చేశారు. ప్రస్తుతం పంట కోత దశలో ఉంది. రైతులు బయట అమ్ముకుందమన్నా ధాన్యానికి వ్యాపారులు, మిల్లర్ల నుంచి పెద్దగా డిమాండ్ ఉండటం లేదు. మార్కెట్లో కనీస మద్దతు ధరకన్నా ఎక్కువ లభించటం లేదు. కొనుగోలు కేంద్రాలకే ఈ రకాన్ని తీసుకువచ్చి విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. తేమ శాతం, ఇతర అంశాలు చూడకుండానే కోత పూర్తయిన వెంటనే తెలంగాణ నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తుండడంతో ధర రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో రైతులు నూర్పిడి కొంత వాయిదా వేసుకుంటున్నారు. ధాన్యం ఆరితే గోదావరి జిల్లాల నుంచి వ్యాపారులు వస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి వచ్చే వారే కొనుగోళ్లు చేసి మిర్యాలగూడలో మిల్లింగ్ చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. మరోవైపు నెల్లూరు మిల్లర్లు ఇక్కడ కొనుగోలు చేసిన ధాన్యాన్ని మర పట్టించి చెన్నై నగరంలో విక్రయిస్తున్నారు. దీంతో డిమాండ్ ఇంకా పెరిగి ధర పెరుగుతుందని రైతులు భావిస్తున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు బీపీటీలు వచ్చే పరిస్థితి లేదని అంచనా. ఎల్ఆర్ రకాలకు మద్దతు కంటే బహిరంగ విపణిలో తక్కువ ధర ఉంది. పైగా వాటిని జిల్లాలో సాగు చేసిందీ తక్కువ.


